ఏలూరు ఫిబ్రవరి 2,
రబీలోనూ కౌలురైతులకు రుణాలందని పరిస్థితి పశ్చిమగోదావరి జిల్లాలో నెలకొంది. ఇప్పటివరకు బ్యాంకులు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. దీంతో కౌలురైతులు అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోంది. జిల్లాలో మూడు లక్షల మంది కౌలురైతులు ఉన్నారు. జిల్లా వ్యవసాయ సాగులో 75 శాతం కౌలు రైతులే చేస్తున్నారు. ఈ ఏడాది కౌలుకార్డుల అందజేత, రుణాల మంజూరులోనూ కౌలురైతులపై తీవ్ర వివక్ష కొనసాగింది. కేవలం 1.39 లక్షల మందికి మాత్రమే సాగుదారుని హక్కుపత్రాలు (కౌలుకార్డులు) మంజూరయ్యాయి. కార్డులున్న కౌలు రైతుల్లో కొందరికే రుణాలందాయి. ఈ ఏడాది మొత్తంలో ఇప్పటివరకు 43,525 మంది కౌలురైతులకు కేవలం రూ.197 కోట్లు రుణం మాత్రమే మంజూరయ్యాయి. మంజూరైన రుణాలు కూడా ఖరీఫ్‌లో ఇచ్చినవే. రబీలో ఇప్పటివరకు రుణాలు మంజూరు కాలేదు. ఎకరాకు రూ.30వేలకుపైగా కౌలురైతుకు పెట్టుబడి ఖర్చులువుతున్నాయి. బ్యాంకుల నుంచి రుణాలివ్వకపోవడంతో కౌలురైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలకు అప్పులు తేవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం జిల్లా వ్యవసాయ రుణ ప్రణాళికలో రూ.10 వేల కోట్లకుపైగా పంట రుణాలకు కేటాయించారు. అందులో కౌలురైతులకు ఇప్పటి వరకు ఇచ్చిన రుణాలు కేవలం రూ.197 కోట్లు మాత్రమే. నిబంధనల ప్రకారం సాగు చేసే రైతులకు పంట రుణాలు అందించాలి. భూయజమానులకు పంటేతర రుణాలివ్వాలి. బ్యాంకులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. వాస్తవ సాగుదారుడైన కౌలురైతులకు కాకుండా భూయజమానులకు పంట రుణాలిస్తున్నాయి.2011లో కౌలురైతులకు ప్రత్యేకంగా అప్పటి ప్రభుత్వం భూ అధీకృత సాగుదారుని చట్టం తెచ్చింది. భూయజమానితో సంబంధం లేకుండా కౌలు రుణఅర్హత కార్డులు మంజూరు చేసి పంట రుణాలు మంజూరు చేయాలని చట్టంలో పొందుపరిచారు. దీంతో కౌలురైతులకు సంబంధించిన రుణార్హత కార్డుల మంజూరు, బ్యాంకుల నుంచి రుణాల వితరణపై రైతుసంఘాలు పెద్దఎత్తున పోరాటం చేశాయి. వైసిపి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక 2019 కౌలుచట్టంలో మార్పులు చేసింది. భూయజమాని అంగీకారంతోనే కౌలురైతులకు సాగుదారుని హక్కుపత్రాలు మంజూరు చేయాలని చట్టంలో చేర్చింది. దీంతో కౌలుదారులకు సాగుదారుని హక్కుపత్రాలు ఇచ్చేందుకు భూయజమానులు ససేమిరా అంటున్నారు. కౌలుకార్డు ఉంటేనే రైతుల పేర్లను ఈ-పంటలో నమోదు చేస్తున్నారు. అలా నమోదైన రైతులకు మాత్రమే పంట రుణాలు, నష్టపరిహారం, భీమా పరిహారం అందుతాయని ప్రభుత్వం తెలిపింది. చట్టం మార్పుతో సగం మంది కౌలురైౖతులకు కూడా సాగుదారుని హక్కుపత్రాలు మంజూరు కాలేదు. దీంతో కౌలురైతులకు బ్యాంకు రుణాలతో పాటు దెబ్బతిన్న పంటలకు పరిహారమూ అందని పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలతో కౌలురైతులు వ్యవసాయం చేసేందుకు ఆసక్తి కనబరచడంలేదు.
రద్దు రబీ...
రబీ దాదాపు రద్దయినట్లే కనిపిస్తోంది. జనవరి ముగిసినా సాగులో పురోగతి లేదు. పైగా వేసిన పంటలు ఎండుతున్నాయి. సాధారణంగా ఈ పాటికి రబీ పంటల సేద్యం ముమ్మరంగా సాగాలి. చిరుధాన్యాలు, పప్పులు, వాణిజ్య పంటల సాగుకు సమయం ముగిసింది. ఫిబ్రవరిలో అదపాదడపా సాగు తప్ప ఊపుగా సాగదు. చిరుధాన్యాల సాగు 8 శాతం తగ్గగా అందులో ప్రధానమైన మొక్కజొన్న 25 శాతం తగ్గింది. మొత్తంగా పప్పుధాన్యాల సాగు పర్వాలేదనిపి స్తుండగా వాటిలో పెసర 24 శాతం, మినుము 23 శాతం తగ్గింది. శనగ సాగు అంకెల్లోనే బాగుంది. కర్నూలు, కడప జిల్లాల్లో రబీ శనగ వేలాది హెక్టార్లలో ఎండి పోయిందని ప్రభుత్వమే ప్రకటించింది. వాణిజ్యపంటల్లో పొగాకు 18 శాతం, మిరప 46 శాతం తగ్గాయి. వర్షాభావం వలన మిరప సాగు నిలిచిపోగా సాగైన చోట పొగమంచు, తెగుళ్లతో నష్టం వాటిల్లింది. నీటి వసతి ఉన్న దగ్గర వరి నాట్లకు కాస్తంత అవకాశం ఉంటుంది. మార్చి రెండో వారం వరకు అక్కడక్కడ వరి నాట్లు వేస్తారు. జనవరి ముగిసే సమయానికి సాగు కావాల్సిన దాంట్లో 2.38 లక్షల హెక్టార్ల మేర తక్కువ నమోదైంది. సాధారణ సాగులో 11 శాతం లోటు. కాగా సాగయ్యాయంటున్న పంటల్లో చాలా మట్టుకు ఎండిపోయాయి. ప్రధానంగా ఖరీఫ్ నుంచి తీవ్ర కరువు కొనసాగుతున్న రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో కాస్తోకూస్తో రైతులు సాగు చేసిన పంటలు సైతం వర్షాభావం, నీటి ఎద్దడి వలన అస్సలు చేతికి రాలేదు. దీంతో రైతులు ఒకటికి రెండు సార్లు విత్తనాలేశారు. ఈ విధంగా సాగైన విస్తీర్ణాన్ని వ్యవసాయశాఖ లెక్కగట్టడంతో కాగితాలపై అంకెల్లో సేద్యం పెరిగిందనిపిస్తోంది. వాస్తవానికి చాలా చోట్ల పంటల ఎదుగుదల లేదు.వ్యవసాయశాఖ సమాచారం ప్రకారం అన్ని పంటలూ కలుపుకొని ఇప్పటికి 22.36 లక్షల హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 19.98 లక్షల హెక్టార్లలో సాగయ్యాయి. నిరుడు ఇదే సమయానికి 22.87 లక్షల హెక్టార్లలో సేద్యం జరిగింది. ఆహారధాన్యాలు 19.47 లక్షల హెక్టార్లకు 18.05 లక్షల హెక్టార్లలో సాగయ్యాయి. ఆహార పంటల సాగులో ఏడు శాతం లోటు కొనసాగుతోంది. వరి ఇప్పటి వరకు సాగు కావాల్సిన దాంట్లో 1.23 లక్షల హెక్టార్ల మేర తగ్గింది. నెల్లూరు జిల్లాలో ఈ మారు వరి బాగా తగ్గింది. కరువు, పెన్నా డెల్టాలో నీటి ఎద్దడి వలన వరి నాట్లు స్తంభించాయి. గోదావరి డెల్టాలో తప్ప తతిమ్మా చోట్ల ఎక్కడా వరి సాగు ఆశాజనకంగా లేదు.