నెల్లూరు
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పిఆర్సి చీకటి జీవోలను నిరశిస్తూ రాష్ట్ర పిఆర్సి సాధన సమితి 3వ తేదీన చలో విజయవాడకు పిలుపునిచ్చింది. అయితే చలో విజయవాడ కార్యక్రమానికి ఒక్కరోజు ముందుగానే ఖాకీ అడ్డంకులు మొదలయ్యాయి. కార్యక్రమాన్ని భగ్నం చేసే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాల నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. అదే క్రమంలో వాకాడు మండల పోలీసులు ఎస్ఐ రఘునాథ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల నేతలను అరెస్టు చేశారు. ఉదయం నాలుగు గంటలకే ఉపాధ్యాయుల ఇంటి వద్దకు వెళ్లి నిద్రలేపి మరీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిలో ముందుగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఇంగిలాల మస్తానయ్య, బీటీఏ వాకాడు మండల అధ్యక్షుడు బాబులను పోలేస్టేషన్ లో ఉంచి మిగిలిన వారికోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ విధానాన్ని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఇంగిలాల మస్తానయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. గౌరవప్రదమైన ఉపాధ్యాయులని కూడా చూడకుండా నేరం చేసిన వారిలా నాలుగు గంటలకే ఇంటి ముందు పోలీసులు జీబుతో ఉండటాన్ని ఆయన తప్పుబట్టారు. తమ హక్కులకు పోలీసులు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. అరెస్టుల పేరుతో తమను పోలీస్స్టేషన్లో ఉంచితే ఈరోజు జరగాల్సిన తమ పాఠశాలలు మూతపడతాయని, తద్వారా విద్యార్థులు ఒక్కరోజు విద్యాబోధనకు దూరమవుతారని, దానికి పోలీసులే కారణమవుతారని పేర్కొన్నారు.