కడప, ఫిబ్రవరి 3,
ఏ ప్రతిఫలాన్ని ఆశించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లాల విభజనను తెర మీదకు తెచ్చారో కానీ.. ఇప్పుడు ఆ ప్రతిపాదన ఆయనకు ఊపిరి ఆడనివ్వకుండా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజిస్తూ కొద్ది రోజుల క్రితమే జగన్ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజలు, ప్రజా సంఘాలు ప్రజాభిప్రాయం చెప్పాలని కోరింది. అభిప్రాయాలు, అభ్యంతరాలు చెప్పేందుకు ఫిబ్రవరి 26 వరకూ గడువు కూడా ఇచ్చింది. జిల్లాల పునర్విభజనను కొందరు వ్యతిరేకిస్తే.. మరి కొందరు మిశ్రమంగా స్పందిస్తుండడం గమనార్హం.ఈ క్రమంలో కడప జిల్లాలో రెండు జిల్లాల పేర్లపై రచ్చ జరుగుతోంది. రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రాజంపేట జిల్లాకు రాజంపేటనే జిల్లా కేంద్రంగా పేర్కొంది ప్రభుత్వ నోటిపికేషన్. అయితే.. జిల్లా పేరును రాజంపేట అని కాకుండా అన్నమయ్య పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. ప్రభుత్వం ప్రతిపాదించిన రాజంపేట జిల్లాకు బదులుగా అన్నమయ్య జిల్లా అని పేరు పెట్టాలని పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. కడప నుంచి విభజించే జిల్లాకు పద కవితా పితామహుడు అన్నమయ్య పేరు పెట్టాలంటూ గడచిన ఐదు రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి.ఈ నిరసనలను అణచివేసేందుకు జగన్ రెడ్డి సర్కార్ దమననీతికి పాల్పడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజంపేటలో పోలీసలులు అడుగడుగునా ఆంక్షలు విధించడం ఆందోళనకారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. రాజంపేటలోకి బయటి వ్యక్తులను రానివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఆందోళనలో భాగంగా రాజంపేటలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీలో అఖిలపక్షర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీతో పాటుగా, అధికార వైసీపీ నుంచి కూడా నాయకులు, శ్రేణులు పాల్గొనడం విశేషం. మొత్తం మీద రాజంపేట వద్దు.. అన్నమయ్యే ముద్దు అంటూ స్థానికులు, రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు చేస్తున్న ఆందోళనలకు ఫలితం ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.