YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ప్రైవేటుకు కృష్ణపట్నం థర్మల్.. రంగం సిద్ధం?

ప్రైవేటుకు కృష్ణపట్నం థర్మల్.. రంగం సిద్ధం?

నెల్లూరు, ఫిబ్రవరి 3,
అప్పులు ఉన్న సంస్థలను అమ్మడానికి లేదు. కేంద్ర చట్టాలు అందుకు ఒప్పుకోవు. ఈ విషయం తెలిసినా.. లీజు నెపంతో ప్రైవేటీకరణకు జగన్ నేతృత్వంలోని ఏపీ సర్కార్ తెగించేస్తోంది. తద్వారా మరో మోసానికి తెరలేపుతోంది. మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్.. నేడు కృష్ణపట్నం జెన్ కో థర్మల్ ప్రాజెక్టు.. ఏపీ జెన్కో లీజును దొంగదారిలో ప్రైవేటుకు అప్పగించే యత్నం చేస్తోంది. సంస్థ ఉద్యోగులను బయటికి నెట్టేసి, జెన్కో ను చంపేసేందుకు సర్కార్ వ్యూహం రెడీ చేస్తోంది. తండ్రి వైఎస్సార్ హయాంలో ఈ ప్లాంటుకు శ్రీకారం చుడితే.. దాన్ని తనయుడు జగన్ అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు. దీంతో ఏపీ జెన్కో ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.ప్రభుత్వ విద్యుత్ సంస్థ జెన్కోకు ఒక సొంత ప్లాంట్ ఉండాలనే ఆలోచనకు ఆకారమే కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టు. సంస్థ నష్టాలను సాకు చూపి జెన్కో ఉద్యోగులకు అన్యాయం చేసి, తన సన్నిహిత ప్రైవేట్ సంస్థకు నెల్లూరు శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్ ను కట్టబెట్టేందుకు ఇంధన శాఖ వడివడిగా అడుగులు వేస్తోంది. విద్యుత్ ఉత్పత్తికి అవుతున్న ఛార్జీల్లో వ్యత్యాసాన్ని సాకుగా చూపి జెన్కోను చంపేసే ఆలోచనలు సాగుతున్నాయంటున్నారు. అందుకోసం అడుగులు పడుతున్నాయనే అనుమానాలు విద్యుత్ ఇంజనీరింగ్ ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు వ్యక్తం చేస్తున్నారు. కృష్ణపట్నం విద్యుత్ కేంద్రాన్ని ప్రైవేటుకు లీజుకు ఇస్తూ ఈ నెల 21న జగన్ రెడ్డి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచీ ఐకాస ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ఇంతలోనే లీజుపై ప్రకటన జారీచేసేందుకు కూడా ఇంధన శాఖ సిద్ధం అవుతోంది.నిజానికి కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం తొలి నుంచీ వివాదాస్పదంగానే ఉంది. నెల్లూరు జిల్లా నేలటూరులో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్లాంటుకు శంకుస్థాపన చేశారు. ప్లాంటు నిర్మాణాన్ని 4 వేల 800 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభించారు. కానీ దాని నిర్మాణ ఖర్చు 8 వేల 200 కోట్లు దాటేసింది. అంచనా వ్యయం రెట్టింపు అవడంపై అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి.  అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించి ఆటోమేటిక్ గా విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం గల మూడో యూనిట్ ఏర్పాటు చేసింది. అందు కోసం 12 వేల కోట్ల రూపాయలు రుణంగా తీసుకుంది. అంటే మొత్తం కృష్ణపట్నం థర్మల్ కేంద్రం కోసం  మొత్తం 20 వేల కోట్లు రుణంగా తీసుకుంది. మూడో యూనిట్ ఇంకా కమిషన్ ఆఫ్ ఓపెనింగ్ డేట్ (సీ ఓ డీ)కాలేదు. వచ్చే నెలలో ప్రారంభించేందుకు ఇంధన శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇంతలోనే ముందు నిర్మించిన రెండు ప్లాంట్లను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇవ్వాలని జగన్ సర్కారు నిర్ణయించింది.థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకోవాలని జాతీయ సంస్థ ఎన్ టీపీసీని ఇటీవల కేంద్రం కోరింది. ఎక్కువ ఖర్చు కారణంగా దాన్ని తాము తీసుకోలేం అని కేంద్రానికి ఎన్ టీపీసీ తిరస్కరించింది. కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ కోసం 5 వేల కోట్ల రూపాయల దాకా ఆర్ఎఫ్ సీ, పీఎఫ్ సీ వంటి కేంద్ర ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకోవడం కేపిటల్ వ్యయాల కోసం మరో 3 వేల 500 కోట్ల రూపాయల దాకా అప్పులు చేయడంతో యూనిట్ నిర్వహణ జెన్కోకు భారంగా మారింది. వాస్తవానికి ఈ యూనిట్ల నిర్మాణ వ్యయం రెట్టింపు కావడంపై ఇటీవల కేంద్ర విద్యుత్ సంస్థ (సీఈఏ) సందేహం వ్యక్తం చేసింది. దీనిపై అధ్యయనం కోసం వేసిన కమిటీ కృష్ణపట్నం ప్లాంట్ విలువ 7 వేల 500 కోట్ల నుంచి 8 వేల కోట్ల దాకా ఉంటుందని నివేదిక అందించింది. కృష్ణపట్నం ప్లాంట్ ను అమ్మేసినా దాని కోసం చేసిన అప్పులు పూర్తిగా తీరిపోయే పరిస్థితి లేదని విద్యుత్ రంగ నిపుణులు చెప్తున్నారు. ప్రైవేట్ సంస్థలకు అమ్మాలంటే ముందుగా అప్పులన్నీ తీర్చేయాలని కేంద్ర ఇంధన సంస్థలు ఆదేశిస్తున్నాయని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్లాంట్ అమ్మకం జోలికి వెళ్లకుండా సన్నిహిత ప్రైవేట్ సంస్థకు మొదట రెండు యూనిట్లు, ఫిబ్రవరిలో మూడో యూనిట్ ను లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కృష్ణపట్నం విద్యుత్ ప్లాంటును లీజుకు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పుడే విద్యుత్ ఉత్పత్తి ఖర్చుని సాకుగా చూపించారు. ఈ ప్లాంట్ లో యూనిట్ ఉత్పత్తి వ్యయం 3 రూపాయల 14 పైసలు కాగా దగ్గరలోని ప్రైవేట్ విద్యుత్ సంస్థలో ఉత్పత్తి వ్యయం 2 రూపాయల 51 పైసలు మాత్రమే అని కేబినెట్ లో చర్చకు వచ్చిందట. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ ప్లాంట్ లో ఒక్కో యూనిట్ ఉత్పత్తికి అయ్యే ఖర్చుతో డిస్కమ్ లకు 63పైసలు నష్టం వస్తుందని కేబినెట్ భేటీలో అనుకున్నారట. కానీ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలేవీ వెల్లడించక పోవడం గమనార్హం. అయితే.. ప్రభుత్వం పేర్కొన్న ప్రైవేట్ సంస్థ కంటే 10 పైసలు తక్కువకే ఈ సంస్థలో యూనిట్ విద్యుత్ ఉత్పత్తి అవుతున్న సత్యాన్ని ప్రభుత్వం ఉద్దేశం పూర్వకంగానే దాటేసిందనే విమర్శలు వస్తున్నాయి.కృష్ణపట్నం విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బందిని రాష్ట్రంలో మిగిలిన జెన్కో విద్యుత్ ఉత్పత్తి సంస్థలలో సర్దుబాటు చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం జరిగింది.అంటే.. కృష్ణపట్నం ప్లాంట్ లోని ఉద్యోగులను రాయలసీమ, విజయవాడలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు పంపుతారన్నమాట. ఆ తర్వాత పెరిగిన ఉద్యోగుల జీత భత్యాలతో ఆయా సంస్థల యాజమాన్య నిర్వహణపై ఆర్థిక భారం పడుతుంది. ఆ తర్వాత బయటి విద్యుత్ కేంద్రంలో.. జెన్కో ప్లాంట్ లలోని ఉత్పత్తి వ్యయంలో తేడాను చూపించి వాటిని కూడా క్రమంగా ప్రైవేటుకు అప్పగించే దుష్టపన్నాగం జరుగుతోందని సిబ్బంది వాపోతున్నారు. చివరిగా జెన్కో ఉనికే లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నారు

Related Posts