YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రాజ్యంగ వ్యాఖ్యలపై దుమారం

రాజ్యంగ వ్యాఖ్యలపై దుమారం

హైదరాబాద్, ఫిబ్రవరి 3,
కాలం కలిసి రాకపోతే,తాడే పామై కరుస్తుంది. ఇలాంటి సామెతలు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’కు వేరే ఎవరో చెప్పనక్కరలేదు. అయితే, ఇప్పుడు ఆయన అలాంటి చిక్కుల్లోనే చిక్కుకున్నారు. కేంద్ర బడ్జెట్’పై తమ అభిప్రాయలను తెలిపేందుకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, ఆయన కేంద్రంపై ఉన్న కసినంతా వెళ్లగక్కారు. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని చివరకు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్’ ఒక మహిళ అనే విషయాన్ని కూడ మరిచి పోయి దుయ్యబట్టారు. అంతటితోనూ ఆగకుండా, రాజ్యాంగంపై దండయాత్రకు దిగారు.  డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్  రాసిన రాజ్యాంగాన్ని, తిరగ రాయాలని, అదుపు తప్పిన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అయన మెడకే చుట్టుకున్నాయి. ముఖ్యమంత్రి ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేసినా, ఇప్పుడు అవి అంబేద్కర్ వ్యతిరేక, దళిత వ్యతిరేక వ్యాఖ్యలుగా, జనంలోకి దూసుకు పోతున్నాయి. రాజ్యంగ నిర్మాత అంబేద్కర్’ను అవమానించిన ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఢిల్లీలో డిమాండ్ చేశారు. హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు నిర్వహిస్తామని, అదే విధంగా ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని బండి సంజయ్ ప్రకటించారు.  నిజానికి ప్రతిపక్షాలే కాదు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, ప్రజాస్వామిక వాదులు మేథావులు ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్‌ను అవమానించడమేనంటూ  దళిత సంఘాలు రోడ్డెక్కి అందోళనకు కూడా దిగాయి. రాష్ట్రంలో అనేక చోట్ల అంబేద్కర విగ్రహాలకు బీజేపే దళిత మోర్చా ఆధ్వర్యంలో పాలాభి షేకం చేశారు. మరోవంక కాంగ్రెస్ పార్టీ  ములుగు ఎమ్మెల్యే సీతక్క స్పందించారు.సీఎం కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్.. మహాత్మ జ్యోతిరావుపూలే వంటి మహనీయుల కంటే గొప్పవారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ వ్యాఖ్యానించడం దురదృష్టకరమని అన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీల హక్కులను కాపాడేందుకు అణగారిన వర్గాల బిడ్డ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని తుడిచి వేయాలని కొంత కాలంగా బీజేపీ ప్రయత్నిస్తోందని, ఇప్పుడు కేసీఆర్ కూడా అదే అజెండాను ఎత్తుకున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే హక్కు ఎవరికీ  లేదని గుర్తుంచుకోవాలని సీతక్క హెచ్చరించారు.  అలాగే, రాజ్యాంగాన్ని మార్చాలనటం అంబేద్కర్‌ను అవమానించటమేనని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అంబేద్కర్‌ భిక్షతోనే తెలంగాణ ఏర్పడిందని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. దళితబిడ్డ రాష్ట్రపతిగా.. చాయ్ వాలా ప్రధానిగా ఉన్నారంటే అంబేద్కర్‌ పుణ్యమేనన్నారు. కేసీఆర్ సంస్కార హీనమైన మాటలు వినలేక ప్రజలు టీవీలు బంద్ పెట్టారన్నారు. కేసీఆర్ బూతు పురాణంపై తెలంగాణ పట్టణాలు, పల్లెల్లో చర్చ జరుగుతోందని ఈటల పేర్కొన్నారు. అదలా ఉంటే, కేసీఆర్ వ్యాఖ్యలపై దుమారం రేగిన నేపధ్యంలో, తెరాస సీనియర్ నాయకుడు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ముఖ్యమత్రి వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని, అన్నారు. అయితే, రాష్ట్రంలో ఇప్పటికే తెరాస ప్రభుత్వం, దళిత ముఖ్యమంత్రి మొదలు, మూడు ఎకరాల భూమి, దళిత బందు, డబుల్ ఇళ్ళ వరకు వరకు ఇచ్చిన  ఏ  హమీనీ నిలుకోలేదని ప్రచారం జరుతున్న నేపధ్యంలో, ఇప్పడు ఏకంగా అంబేద్కర్’నే అవమానించారనే ప్రచారం ఊపందు కోవడం తెరాసకు రాజకీయంగా దెబ్బతీస్తుందని, తెరాస నాయకులే అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, విపక్షాలకు మరో ఆయుధం ఇచ్చారని, పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు అభిప్రాయ పడ్డారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను అవమానకరంగా, అవినీతి ఆరోపణలు చేసి మంత్రి వర్గం నుంచి వెలివేయడం మొదలు కేసీఆర్ దళితులను అవమానాలకు గురి చేస్తున్నారనే మాట కూడా పార్టీ వర్గాల్లో వినవస్తోంది.  చివరకు ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుంది? ఎవరిని కాటేస్తుంది? కాలమే నిర్ణయిస్తుందని అంటున్నారు.

Related Posts