హైదరాబాద్, ఫిబ్రవరి 3,
కేసీఆర్‌ను రాజకీయ చాణక్యుడు అంటారు కొందరు. ఆ.. అంతలేదు, ఒకప్పుడు కావొచ్చు.. ఇప్పుడు కేసీఆర్‌కు అంతసీన్ లేదంటారు చాలామంది. గులాబీబాస్ అస్త్రాలు ఆయనకే బూమరాంగ్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయని గుర్తు చేస్తుంటారు. లేటెస్ట్‌గా దళిత బంధు స్కీం సైతం ఆయనకు వర్కవుట్ కాలేదని చెబుతున్నారు. తాజా ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ తాము మరోసారి తప్పక గెలుస్తామని.. 95 నుంచి 105 సీట్లు వస్తాయి రాస్కో మంటూ సవాల్ చేశారు. తన దగ్గర ఈసారి కూడా బ్రహ్మాండమైన మంత్రం ఉందని కూడా లీక్ ఇచ్చారు. సరైన సమయంలో ఆ మంత్రం అమలు చేస్తామని చెప్పారు. పనిలో పనిగా రాజకీయంగా తాను అవలంభించబోయే మరో కీలక ఎత్తుగడ కూడా రివీల్ చేశారు.గత ఎన్నికల్లో అసెంబ్లీని 6 నెలలు ముందుగానే రద్దు చేసి.. సడెన్‌గా ముందస్తు ఎన్నికలకు వెళ్లి.. ప్రతిపక్షాలు ప్రిపేర్ అయ్యేందుకు అసలేమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా చేసి.. ఆ ఎన్నికల్లో ఎలాగోలా గట్టెక్కేశారు కేసీఆర్. ఈసారి అంతకుమించి ప్రజా వ్యతిరేకత ఉండటం.. కేసీఆర్ ఈసారి పక్కా ఓడిపోతారని టాక్ నడుస్తుండటంతో.. మరోసారి ముందస్తు ఎత్తుగడను రచిస్తున్నారు గులాబీ బాస్. అయితే, ముందస్తు ఎన్నికలకు వెళ్లకుండా.. ఎమ్మెల్యే అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తామని చెప్పేశారు కేసీఆర్. ఏకంగా 6 నెలలు ముందుగా టీఆర్ఎస్ కేండిడేట్స్‌ను అనౌన్స్ చేసే అవకాశం ఉందని లీకులిచ్చేశారు. కేసీఆర్ స్ట్రాటజీపై అప్పుడే పోస్ట్‌మార్టం మొదలైపోయింది. అంత ముందుగా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తే.. అది అసలుకే ఎసరు తెస్తుందని అంటున్నారు. అన్ని పార్టీల్లో మాదిరే టీఆర్ఎస్‌లోనూ టికెట్ల కోసం ఆశావహుల సంఖ్య భారీగానే ఉంది. తమకు టికెట్ రాకపోతుందా అని నామినేషన్ టైమ్ ముగిసే వరకూ చాలామంది ఎదురుచూస్తుంటారు. అధిష్టానం దగ్గర తమవంతు ప్రయత్నం చేస్తుంటారు. అలాంటిది.. 6 నెలలు ముందే అభ్యర్థులను ప్రకటిస్తే.. టికెట్ రాని ఆశావహులంతా కారు దిగేసి.. ఏ కమలం గూటికో.. కాంగ్రెస్ చేతికో.. చిక్కే అవకాశమే ఎక్కువ. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్‌కు ప్రతీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయి బలమైన నేతలు ఒకరికంటే ఎక్కువే ఉంటారు. అందులో ఒక్కరికే టికెట్ వస్తే.. మిగిలిన వారు కేసీఆర్‌కు హ్యాండ్ ఇచ్చి.. తమ దారి తాము చూసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అది.. కాంగ్రెస్, బీజేపీలకు అడ్వాంటేజ్‌గా మారుతుంది. కాంగ్రెస్ పరిస్థితి బెటర్‌గానే ఉన్నా.. గత ఎన్నికల్లో బీజేపీకి ఎమ్మెల్యే అభ్యర్థులే కరువయ్యారు. ఈసారి బీజేపీ టికెట్‌కు ఫుల్ డిమాండ్ నెలకొనగా.. అధికార పార్టీ నుంచి టికెట్ రాని బలమైన నేతలకు కమలం పార్టీ గాలం వేయడం ఖాయం. ఇక, కాంగ్రెస్ టికెట్ కోసం ఆ డిమాండ్ మరింత అధికం. ఇలా.. 6 నెలలు ముందుగానే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించాలనే కేసీఆర్ స్కెచ్.. ఆ పార్టీకే బూమరాంగ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. మరి, కేసీఆర్ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా..? దీని వెనుకా ఇంకేదో మతలబు ఉండుంటుందా?