అమరావతి
జగన్ రెడ్డి గారూ! ఉద్యోగుల పట్ల ఎందుకింత క్రూరంగా వ్యవహరిస్తున్నారు? తమకు న్యాయబద్ధంగా రావాల్సిన ప్రయోజనాల కోసం-మాట తప్పిన మీ ప్రభుత్వతీరుపై శాంతియుతంగా ఉద్యోగులు నిరసన తెలపడం నేరం ఎలా అవుతుందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ప్రసాదించిన హక్కునీ హరించే అధికారం మీకు ఎవ్వరిచ్చారు? విద్యాబుద్ధులు నేర్పే గురువులని పోలీసులతో నిర్బంధించడమేనా వారికి మీరిచ్చే గౌరవం? మీ అరాచకపాలనలోనూ ఎటువంటి గౌరవానికి నోచుకోకపోయినా, ప్రభుత్వం కోసం కుటుంబాల్ని వదిలి మరీ పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులంటే ఎందుకింత కక్ష? ఇచ్చిన మాట తప్పనని బీరాలు పలికిన మీరు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలే కదా వారు అమలు చేయాలని అడుగుతున్నదని అన్నారు.
మీ లక్షల కోట్ల అక్రమాస్తుల్లోనూ, మీ అక్రమాల పుత్రిక సాక్షిలోనూ, మీ ఇంద్రభవనాల్లోనూ వారేమీ వాటాలు అడగడంలేదు. ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం గౌరవం వున్నా...ప్రభుత్వ ఉద్యోగుల్ని నిర్బంధించడం ఆపండి. విశ్వసనీయత అనే పదం అర్థం తెలిస్తే..ప్రభుత్వ ఉద్యోగులకు మీరు ఇస్తామన్నవన్నీ ఇవ్వండి. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం అంటూనే..మీ సలహాదారులు, తాబేదారులు, పోలీసులతో మాటలతోనూ, చేతలతోనూ విషప్రచారాలతోనూ, దాడులతోనూ మానసికంగా, భౌతికంగా హింసిస్తున్నారు. ఇదేమి రాక్షసప్రవృత్తి సీఎం గారూ! వారంలో సిపిఎస్ రద్దన్నారు-అవగాహనలేక హామీఇచ్చానని మడమ తిప్పారని విమర్శించారు.
రివర్స్ పీఆర్సీ ఇచ్చి మాట తప్పారు. ఇన్ని భరించిన ప్రభుత్వ ఉద్యోగులు తమకు న్యాయం చేయాలని పదేపదే వేడుకుంటుంటే, నా ఇష్టం అన్నట్టు మూర్ఖంగా వ్యవహరించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని రోడ్డెక్కితే...పోలీసుల్ని ఉసిగొల్పి ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దారుణంగా దెబ్బతీశారు. ఉద్యోగుల శాంతియుత న్యాయమైన ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నానని లోకేష్ అన్నారు.