హైదరాబాద్ ఫిబ్రవరి 3
దళిత బంధు పథకంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలిచ్చే పథకంలో లబ్ధిదారుల ఎంపికపై ఎమ్మెల్యేలు తర్జనభర్జన పడుతున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 5వ తేదీలోగా లబ్ధిదారులను ఎంపిక చేసి.. ఆ జాబితాను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది. కానీ ఇప్పటికీ చాలాచోట్ల ఈ ఎంపిక ప్రక్రియ కొలిక్కి రాలేదట. దీంతో ఈ పథకం అమలుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్ధదారులను ఎంపిక చేయాల్సి ఉంది. చాలా నియోజకవర్గాల్లో 100కు పైగా గ్రామాలు ఉన్నాయి. దీంతో గ్రామానికి ఒకరిని కూడా ఎంపిక చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. లబ్ధిదారుల ఎంపికపై అసలు ప్రభుత్వం సరైన మార్గదర్శకాలు కూడా రూపొందించలేదు. గ్రామానికి ఒకరిని ఎంపిక చేసినా మిగతా కుటుంబాల్లో అసంతృప్తి పెల్లుబుకుతుంది. దీంతో ఎమ్మెల్యేల పరిస్థితి కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం.. అన్నట్లు మారనుంది.దీంతో లబ్ధిదారుల ఎంపికలో మధ్యేమార్గంగా కొత్త ఆలోచన చేశారు ఎమ్మెల్యేలు. మిగతా కుటుంబాల నుంచి వ్యతిరేకత రాకుండా తక్కువ కుటుంబాలు ఉన్న గ్రామాలను ఎంపిక చేయాలనుకుంటోంది. ఇక్కడా ఇబ్బంది ఎదురైతే ఆదర్శ గ్రామాల వైపు మొగ్గు చూపేందుకు నిర్ణయించుకున్నారు. అయినప్పటికీ ఏమైనా సమస్యలు తలెత్తితే లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నారు. ఇలా చేసినా మిగతా గ్రామాలు అలకబూనే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఎమ్మెల్యేల్లో మంత్రుల్లో ఆందోళన మొదలైంది.దళితబంధు పథకం పర్యవేక్షణ బాధ్యత తొలుత కలెక్టర్లకు అప్పగించింది ప్రభుత్వం. లబ్ధిదారుల ఎంపికకు గ్రామ మండల జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. కానీ ఆ తర్వాత ఎమ్మెల్యేలకు నిర్ణయాధికారం ఇచ్చింది. దీంతో కలెక్టర్లు ప్రేక్షక పాత్రకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. కలెక్టర్ల నుంచి ఎమ్మెల్యేలు మంత్రులకు అప్పగించినపుడే ఈ పథకం రాజకీయ రంగు పులుముకుంది. అధికార ప్రతిపక్షాల మధ్య చిచ్చు రగిలే అవకాశం ఉంది. ముందు టీఆర్ఎస్ అనుకూల కుటుంబాలకే లబ్ధి చేకూరుస్తారని ప్రతిపక్షాలు అప్పుడే విమర్శలు మొదలుపెట్టాయి.రాజకీయ నిపుణులు కూడా ఇది మరో ఇందిరమ్మ పథకం మాదిరి కానుందని హెచ్చరిస్తున్నారు. తొలి విడత కొద్ది మందికే అవకాశం ఇచ్చినా మలి విడతకు ఎన్ని రోజుల సమయం పడుతుందో చెప్పలేదు. మలి విడతలో కూడా ఎన్ని కుటుంబాలకు ఇస్తారో స్పష్టత లేదు. ఆలోగా ఎన్నికలు వస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. లబ్ధి జరగని దళిత కుటుంబాలతో పాటు మిగతా వర్గాల్లో కూడా అసంతృప్తి వస్తే నియోజకవర్గాల్లో కూడా తిరగలేమని ఎమ్మెల్యేలు బయపడుతున్నారు. చూడాలి మరి ఈ పథకాన్ని ఎలా ముందుకు తీసుకెళతారో..!