YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కన్నాకు మూడు పార్టీల ఎర

 కన్నాకు మూడు పార్టీల ఎర

గుంటూరు, మే 12 (న్యూస్ పల్స్) 

ఒకే ఒక్క నేత కోసం ఏపీలోని మూడు ప్ర‌ధాన పార్టీలు వేచిచూస్తున్నాయి. ఆయన త‌మ పార్టీలోనే ఉండాల‌ని క‌మ‌ల‌నాథులు.. ఎలాగైనా సైకిలెక్కించేయాల‌ని టీడీపీ నేత‌లు.. ఇక ఫ్యాన్ కింద‌కు తీసుకురావాల‌ని వైసీపీ నేత‌లు.. ఇలా ఎవ‌రికి వారు వ్యూహాలు ర‌చిస్తూనే ఉన్నారు. మాజీ మంత్రి, బీజేపీ నాయ‌కుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ అడుగులు ఎటువైపు ప‌డ‌తాయోన‌ని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయ‌న వైసీపీలో చేర‌డం దాదాపు ఖ‌రారైపోయింద‌ని, ఇక రేపో మాపో చేరిపోతార‌ని పార్టీ నేత‌లు ప్ర‌క‌టించేశారు. అయితే అక‌స్మాత్తుగా అనారోగ్యం బారిన పడ‌టంతో ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నారు. ప్ర‌స్తుతం కోలుకున్న ఆయ‌న రాజ‌కీయంగా ఎటువైపు వెళతార‌నే అంశంపై మ‌రోసారి చ‌ర్చ మొద‌లైంది. గుంటూరు జిల్లా రాజకీయాల్లో క్రెడిబులిటీకి క‌న్నా మారుపేరు. 2014 వరకు కాంగ్రెస్ లో ఉన్న ఆయ‌న‌, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితులు. మాజీ ఎంపీ కావూరి సాంబశివరావును రాజకీయ గురువుగా భావిస్తుంటారు. అయితే 2014 ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత బీజేపీలో చేరారు.అంతేగాక ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు కూడా ప్ర‌కటించేస్తున్నారు. ఎంతో అనుభ‌వంతో పాటు సామాజిక‌వ‌ర్గ అండ‌దండ‌లు పుష్క‌లంగా ఆయ‌న సొంతం! దీంతో కీల‌క‌మైన స‌మ‌యంలో ఆయన తీసుకునే నిర్ణ‌యంపైనే నేత‌లంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. పార్టీల ప‌రిస్థితి ఇలా ఉంటే.. ఆ నేత ప‌రిస్థితి మ‌రోలా ఉంది. దాదాపు పార్టీలో చేరిపోయే స‌మ‌యంలో అక‌స్మాత్తుగా కొన్ని ప‌రిణామాల వ‌ల్ల వెన‌క‌డుగు వేసిన ఆయ‌న‌.. ఏ పార్టీలోకి వెళ్లాలో తేల్చుకోలేని ప‌రిస్థితి వ‌చ్చింద‌ట‌. మూడు రోడ్ల జంక్ష‌న్లో నిల‌బ‌డి ఎటువైపు వెళితే రాజ‌కీయ జీవితం సాఫీగా సాగిపోతుందోన‌ని ఆలోచిస్తున్నార‌ట‌.మొదటి నుంచి చంద్రబాబుపై విరుచుకుపడే లక్ష్మీనారాయణ టీడీపీకి బీజేపీ మిత్రపక్షమైనప్పటికీ ప్రభుత్వంలో జరిగే లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపారు. టీడీపీ నేతలు కూడా లక్ష్మీనారాయణపై ఎదురుదాడికి దిగారు. తనపై దాడి చేస్తున్నా.. బీజేపీ నేతలెవరూ నోరు మెదపకోవడంతో ఆయ‌న మనస్తాపానికి గురయ్యారు. పార్టీ అధ్యక్ష పదవి ఇస్తామని చెప్పిన హైకమాండ్‌ చివరి నిమిషంలో వెనక్కి తగ్గడం కన్నాకు నచ్చలేదు. దీంతో వైఎస్సార్ సీపీ నేతలు కన్నాపై దృష్టి సారించారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని నేతలతో పాటు.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నేతలతో క‌న్నా సంప్రదింపులు జరిపారు. అనంత‌రం వైఎస్సార్ సీపీలో చేరాల‌నుకు న్నారు. కృష్ణా జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్‌ సమక్షంలో పార్టీలో చేరాలనుకున్నారు. పేప‌ర్ల‌లో ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డంతో పాటు జిల్లా అంత‌టా తాను వైసీపీలో చేరుతున్న‌ట్టు హోరెత్తించారు.ఈలోపు బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. పార్టీ అధ్యక్ష పదవి ఇస్తామని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. మధ్యలో టీడీపీ నేతలు టచ్‌లోకి వచ్చారు. ఇరువురు మంత్రులు కన్నాతో మాట్లాడారు. ఆయ‌న‌పై బీజేపీ వాళ్లు తీవ్ర‌స్థాయిలో ఒత్తిడి చేసిన‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఈ సంఘర్షణను తట్టుకోలేక ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గుర‌య్యారు. మూడు రోజులు చికిత్స అనంతరం డిస్‌ఛార్జ్‌ అయ్యారు. ఈలోపు పుకార్లు షికార్లు చేశాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలకు బీజేపీ అగ్రనేతలు ఫోన్‌ చేసి తమ నేతను ఎలా చేర్చుకుంటారని నిలదీశారట! ఫలితంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో కన్నా చేరిక ఆగిపోయిందట! మళ్లీ అటు బీజేపీ.. ఇటు టీడీపీ.. మధ్యలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు కన్నాను సంప్రదించారు. తమ పార్టీలోకి వస్తే గుంటూరు పశ్చిమతో పాటు ఆయన సూచించిన మరో వ్యక్తికి కూడా టికెట్‌ ఇస్తామని హామీ ఇచ్చారట టీడీపీ నేతలు! వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు కూడా ఇదే హామీ ఇచ్చార‌ట‌. బీజేపీలోనే ఉంటే రాష్ట్ర అధ్యక్ష పదవి లేదా కేంద్రంలో కీలక పదవి ఇస్తామని కమలదళ అగ్రనేతలు చెప్పారట! ఇన్ని పార్టీల నుంచి ప్రతిపాదనలు రావడంతో కన్నా లక్ష్మీనారాయణ ఎటువైపు మొగ్గుతారనేది ఆసక్తికరంగా మారింది.అటు కులపరంగానూ, ఇటు రాజకీయంగానూ అనుచరులకు ఎప్పుడూ రక్షణ కవచంగా ఉండే కన్నా ఏ పార్టీలో చేరిన ఆ పార్టీకి ఉపయోగమేనని రాజకీయ నాయకులు చెబుతారు. ఇప్పుడు కన్నా రూట్ ఎటువైపు అనేది జిల్లాలో చర్చనీయాంశమైంది. తన ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాతే రాజకీయంగా ఆలోచిస్తానని కన్నా తన అనుచరవర్గానికి చెబుతున్నారు. బీజేపీలో ఉండి ఎవరికీ సహాయం చేయలేకపోతున్నారని.. ఆ పార్టీ కూడా రాష్ట్రంలో తీవ్రంగా దెబ్బతినడంతో ఉండి ఉపయోగం ఏమిటన్నది అనుచరుల ప్రశ్న! వీరంతా ఒత్తిడి తీసుకురావడంతో కన్నా రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి ప్ర‌త్తిపాటి పుల్ల‌రావును టీడీపీ అధిష్టానం క‌న్నా వ‌ద్ద‌కు పంపింద‌ట‌. ఆయ‌న న‌ర‌సారావుపేట ఎంపీ సీటు ఇవ్వాల‌ని… ఖ‌ర్చంతా పార్టీయే భ‌రించాల‌ని అలా అయితేనే తాను టీడీపీలోకి వ‌స్తాన‌ని కండీష‌న్ పెట్టార‌ట‌. మూడు పార్టీల నుంచి ఆఫ‌ర్లు ఉండ‌డంతో క‌న్నా చివ‌ర‌కు చెట్టెక్కేశారు. దీంతో ఇప్పుడు ఆయ‌న డిమాండ్లు పెడుతున్నారు. క‌న్నా డిమాండ్‌తో ప్ర‌త్తిపాటి మౌనంగా వెళ్లిపోయార‌ట‌. ఇక టీడీపీలోనే క‌న్నా కులానికే చెందిన మ‌రో మంత్రిని కూడా క‌న్నాతో మాట్లాడ‌మ‌ని చెపితే ఆయ‌న క‌న్నా వ‌స్తే పార్టీలో కుల‌ప‌రంగా త‌న ప్ర‌యారిటీ ఎక్క‌డ త‌గ్గుతుందో అని ? క‌న్నా టీడీపీ ఎంట్రీకి వేయాల్సిన బ్రేకులు తెర‌వెన‌క వేస్తున్నార‌ట‌.

Related Posts