YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ కు ఫస్ట్ స్ట్ర్రోక్

జగన్ కు ఫస్ట్ స్ట్ర్రోక్

విజయవాడ, ఫిబ్రవరి 4,
జగన్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అయింది. ఇప్పటి వరకూ జగన్ కు సరైన స్ట్రోక్ పడలేదు. విపక్షాలను అన్ని రకాలుగా దెబ్బతీయడంతో వారు ఆందోళన చేయడానికి కూడా ముందుకు రాలేదు. ప్రధానంగా టీడీపీ అనేక రకాలు ఆందోళనలు చేసినా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. విపక్ష నేతలపై కేసులు పెడుతుండటం, ఆర్థిక మూలాలను దెబ్బతీయడంతో వారు ఎవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు రాలేదు జగన్ తన పాలనపై పూర్తి సంతృప్తి ఉందని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఉండి భావించి ఉండవచ్చు. వరసగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటం, ఎన్నికల్లో వన్ సైడ్ విజయాలు లభించడంతో జగన్ తనకు తిరుగులేదని అనుకుని ఉండవచ్చు. కానీ అది అపోహ అని మాత్రమే తేలింది. ఫస్ట్ ట్రోక్ బెజవాడ వేదికగా పడిందనే చెప్పాలి. రెండున్నరేళ్లలో తొలిసారి జగన్ కు వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గళమెత్తాయి. కదంతొక్కాయి. . బెజవాడ వీధులన్నీ ఉద్యోగ, ఉపాధ్యాయులతో కిక్కిరిసి పోయాయి. ప్రభుత్వానికి, జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతు చూస్తామని వేదికపై నుంచి ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. అంటే ప్రభుత్వంపై ఉన్న భయం పోయినట్లే. ఇన్నాళ్లూ గుప్పిట మూసి ఉంచింది బయటపడినట్లే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 13 జిల్లాల నుంచి లక్షలాది మంది ఉద్యోగులు బెజవాడకు తరలి వచ్చారు. వారిని కట్టడి చేయడం కూడా పోలీసులకు కష్టసాధ్యమయంది. ఉద్యోగులు, పింఛనుదారుల కుటుంబ సభ్యులు మొత్తం 75 లక్షల మంది ఉన్నామని వారు ప్రభుత్వానికి బెజవాడ నుంచి హెచ్చరిక చేశారు. ఇది జగన్ ప్రభుత్వానికి ఒక రకంగా గుణపాఠమనే చెప్పాలి. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారన్న సామెత ఉద్యోగుల విషయంలో ఈ ప్రభుత్వానికి సరిపోతుంది. ఉద్యోగుల వల్ల తనకు ఏమీ నష్టం జరగదని ప్రభుత్వం భావించవచ్చు. కానీ ఇప్పుడు బెజవాడలో జరిగిన కార్యక్రమానికి చూసిన వారికి ఎవరికైనా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లేనని చెప్పకతప్పదు.
ఏంటీ జనం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలీసు ఉన్నతాధికారులపై సీరియస్ అయినట్లు తెలిసింది. విజయవాడకు భారీగా ఉద్యోగులు తరలి రావడంతో పోలీసుల వైఫల్యమే కారణమని జగన్ అభిప్రాయపడినట్లు తెలిసింది. పోలీసు ఉన్నతాధికారుల పనితీరుపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దాదాపు పది హేను రోజుల ముందే ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపు నిచ్చినా పోలీసులు పట్టించుకోలేదన్న అభిప్రాయాన్ని జగన్ వ్యక్తం చేసినట్లు సమాచారం. పోలీసుల ఆంక్షలను ఛేదించుకుని మరీ విజయవాడకు భారీ సంఖ్యలో ఉద్యోగులు చేరుకున్నారు. అయితే వారిపై ఎలాంటి లాఠీ ఛార్జి వంటివి చేయవద్దని జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రభుత్వంలో వారు భాగమేనని శాంతియుత పద్ధతిలో కార్యక్రమం ముగిసేలా చూడాలని జగన్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు చెబుతున్నారు. ఇంటలిజెన్స్ ఏమైంది? ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులు విజయవాడ చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా బల ప్రదర్శన చేయడాన్ని పోలీసు వైఫల్యంగానే జగన్ పరిగణించారని చెబుతున్నారు. ఈ వైఫల్యానికి బాధ్యులను గుర్తించాలని కూడా జగన్ కోరినట్లు తెలిసింది. ఇంటలిజెన్స్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. దీనిపై మరికాసేపట్లో జగన్ సమీక్ష చేయనున్నారని తెలిసింది.

Related Posts