YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

కాసులు కురిపిస్తున్న కాఫీ

కాసులు కురిపిస్తున్న కాఫీ

విశాఖపట్టణం, ఫిబ్రవరి 4,
అంతర్జాతీయ గుర్తింపు పొందిన అరకు కాఫీకి మంచి ఆదరణ ఉంది. కానీ, గిరిజనులు పండించిన కాఫీ పంటకు మార్కెట్‌కు సదుపాయం లేదు. దీంతో, ఏటా మాదిరిగానే ఈ ఏడాదీ ప్రయివేటు వ్యాపారులకు గిరిజన రైతులు అమ్ముకుంటున్నారు. గిరిజన సహకార సంస్థ (జిసిసి) సకాలంలో సరైన ధర ప్రకటించి కొనుగోలు చేయకపోవడంతో తూకంలో నష్టపోతున్నా ప్రయివేటు వ్యాపారులనే గిరిజన రైతులు ఆశ్రయించాల్సి వస్తోంది. పాడేరు ఏజెన్సీలోని అనంతగిరి, అరకు, డుంబ్రిగుడ, హకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్‌, పాడేరు, జి.మాడుగుల, జి.కె.వీధి, చింతపల్లి, కొయ్యూరు మండలాల్లో దాదాపు లక్షా 50 వేల ఎకరాల్లో గిరిజనులు కాఫీ పంట పండిస్తున్నారు. దాదాపు 20 వేల మెట్రిక్‌ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా. దీనిలో రెండు వేల మెట్రిక్‌ టన్నులు మాత్రం కొనుగోలు చేయాలని జిసిసి ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకుంది. జిసిసి ధర కంటే ప్రయివేటు వ్యాపారులు ఎక్కువ ధర ఇస్తున్నారు. నేరుగా గిరిజన రైతుల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అయితే, తూకంలో మోసాలకు పాల్పడుతున్నా వ్యాపారులకే కాఫీని గిరిజన రైతులు అమ్ముకుంటున్నారు. అరబిక పార్చ్‌మెంట్‌ కాఫీ గింజలను కిలో రూ.280కు ప్రయివేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. జిసిసి రూ.180 మాత్రమే కొంటోంది. అరబిక చెర్రీ కాఫీకి ప్రయివేటు వ్యాపారులు కేజీకు రూ.125 ఇస్తున్నారు. జిసిసి రూ.75 మాత్రమే చెల్లిస్తోంది. దీంతో, లక్ష్యంలో 241 మెట్రిక్‌ టన్నులను మాత్రమే జిసిసి కొనుగోలు చేయగలిగింది. గిరిజనుల విజ్ఞప్తి మేరకు జిసిసి ఎట్టకేలకు స్పందించింది. సోమవారం జరిగిన కాఫీ ఎపెక్స్‌ కమిటీ సమావేశంలో ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో మంచి గిరాకీ ఉన్న పార్చ్‌మెంట్‌, చెర్రీ కాఫీకి దాదాపు ప్రయివేటు వ్యాపారులు చెల్లిస్తున్న ధర ఇవ్వడానికి జిసిసి ఎపెక్స్‌ కమిటీ ఆమోదం తెలిపింది.కాఫీ గింజల ధర పెంచాలని రైతులు, ప్రజాప్రతినిధుల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. ప్రయివేటు వ్యాపారుల కంటే జిసిసి చెల్లిస్తున్న ధర తక్కువ కావడంతో జిసిసికి అమ్మడానికి రైతులు ముందుకురాలేదు. జిసిసిని నమ్ముకున్న గిరిజనులను మేలు చేయాలని కాఫీ ఎపెక్స్‌ కమిటీ సమావేశంలో ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. పెంచిన రేట్లు తక్షణమే అమల్లోకి తెస్తున్నాం. మరో 15, 20 రోజుల్లో సమీక్షించి అవసరమైతే ధర పెంచుతాం. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సలహా ప్రకారం గిరిజన రైతులను ఆర్థికంగా ఆదుకొనేందుకు ధరలు పెంచామని జీసీసీ అధికారులు చెబుతున్నారు.

Related Posts