విజయవాడ, ఫిబ్రవరి 4,
సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనే కాకుండా అన్నింటా హాట్ టాపిక్ గా మారారు. జగన్ నమ్ముతుంది ఆయనను ఒక్కడినేనన్న సంకేతాలు పార్టీ క్యాడర్ నుంచి నేతల వరకూ ఎప్పుడో వెళ్లాయి. వైైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెంబర్ 2 అంటే ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనే పార్టీలో ఎవరైనా చెబుతారు. జగన్ మనసులో మాటలనే ఆయన బయటకు చెబుతుంటారన్నది వినికిడి. ఇప్పుడు ఉద్యోగ సంఘాల సమ్మె చేస్తున్న సమయంలోనూ సజ్జల రామకృష్ణారెడ్డి కీలకంగా మారారు. ఆయనకు సంబంధం లేని విషయాల్లోనూ జోక్యం చేసుకుంటారన్న విషయాలను కూడా పెద్దగా సజ్జల పట్టించుకోరు వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా జగన్ నియమించారు. సలహాదారులు దాదాపు అరవై మందికి పైగా ఉంటే ఒక్క సజ్జల మాత్రమే దానికి న్యాయం చేకూరుస్తున్నారు. మిగిలిన సలహాదారులు ఎక్కడ ఉన్నారో తెలియని కూడా తెలయదు. ప్రధానంగా రాజకీయంగా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రత్యర్థుల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. పోలీసు బాస్ గా.... ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీల నేతలపై పెట్టే అక్రమ కేసులు సజ్జల రామకృష్ణారెడ్డి చెబితేనే పోలీసు ఉన్నతాధికారులు పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు పలుమార్లు సజ్జలపై నేరుగా విమర్శించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి సయతం సజ్జల ఆదేశాలతోనే తనపై పోలీసు కేసు నమోదయిందని చెప్పారు. ఇలా సజ్జల షాడో హోంమంత్రిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. జగన్ అభిప్రాయం తెలుసుకునే ఆ మేరకు సజ్జల ఉన్నతాధికారులకు సమాచారం చేరవేస్తారన్నది పార్టీ నేతల అభిప్రాయంగా వినిపిస్తుంది. ఇక ఇప్పుడు ఉద్యోగ సంఘాల చర్చలకు, సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధం లేదు. ఉద్యోగ సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య సానుకూల వాతావరణం నెలకొల్పేందుకు మాజీ ఉద్యోగ సంఘాల నేత చంద్రశేఖర్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. అయితే ఆయన ఊసు ఇప్పుడు ఎక్కడా విన్పించడం లేదు. కన్పించడం లేదు. మంత్రుల కమిటీలో బొత్స సత్యనారాయణ, పేర్నినాని, బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ఉన్నా సజ్జల మాత్రమే కీలకం అని చెప్పక తప్పదు. ఈరోజు చలో విజయవాడలో కూడా ఉద్యోగులకు సజ్జల టార్గెట్ అయ్యారు. ఆయన ఏ హోదాలో చర్చలకు వస్తున్నారని ఉద్యోగులు నిలదీస్తున్నారు. తమతో చర్చలు జరిపే అర్హత ఆయనకు లేదని నినదించారు. ఆయనకు కేబినెట్ లో అవకాశం లేకపోయినా జగన్ మాత్రం తన మనసులో చోటు కల్పించడంతో సజ్జల రామకృష్ణారెడ్డి మంత్రుల్లో కెల్లా సూపర్ మంత్రి అని చెప్పక తప్పదు. వైసీపీలో నెంబర్ టూ గా వ్యవహరిస్తున్నారు. జగన్ కు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా సజ్జల గుర్తింపు పొందడంతో ఆయన ప్రయారిటీ కూడా బాగా పెరిగింది.