న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4,
హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఎందుకంటే ఈ హైవేను సూపర్ ఇన్ఫర్‌మేషన్ రహదారిగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైదరాబాద్-బెంగళూరు హైవే సూపర్ హైవేగా వాహనదారులకు సేవలు అందించనుంది. కేంద్రం తాజా నిర్ణయంతో ఒకవేళ మీరు ట్రాఫిక్‌లో చిక్కుకుంటే.. ఆ ప్రాంతం నుంచి బయటపడేందుకు ఎంత సమయం పడుతుంది?, ఎక్కడెక్కడ పెట్రోల్ బంకులు ఉన్నాయి?, ఆస్పత్రులు ఎంత దూరంలో ఉన్నాయి? వంటి కీలక సమాచారాలను డిజిటల్ బోర్డుల రూపంలో హైవే అధికారులు ప్రదర్శించనున్నారు.కాగా హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య 576 కి.మీ. పొడవున జాతీయ రహదారి ఉంది. హైదరాబాద్ నుంచి ఏపీ సరిహద్దు వరకు 210 కి.మీ. దూరం ఉండగా… ఏపీ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు 260 కి.మీ. దూరం ఉంటుంది. కర్ణాటక సరిహద్దు నుంచి బెంగళూరు నగర సరిహద్దు వరకు 106 కి.మీ. దూరం ఉంటుంది. ఇప్పటికే సూపర్ హైవే వ్యవస్థను ప్రయోగాత్మకంగా ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేలో అందుబాటులోకి తెచ్చేందుకు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మార్గం నిర్మాణం తుది దశలో ఉంది. రియల్ టైమ్ డిజిటల్ వ్యవస్థతో అనుసంధాన చేయగానే జాతీయ రహదారుల సంస్థకు చెందిన విభాగం ఆయా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటుంది. అన్ని టోల్ ప్లాజాల వద్ద ఇందుకు సంబంధించిన వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.