అలిపిరిలో అమిత్ షా కాన్వాయ్‌పై దాడి ఘటనతో రాజకీయం వేడెక్కింది. ఈ దాడిపై పాత మిత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. బీజేపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. తమ బాస్‌పైనే రాళ్లు వేస్తారా అంటూ కమలం పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇవాళ డీజీపీ మాలకొండయ్యను కలిసి... ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరగా... ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశామని డీజీపీ నేతలకు వివరించారు. డీజీపీని కలిసిన వారిలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పార్టీ నేతలు ఉన్నారు.అలిపిరి ఘటనపై వీర్రాజు ఖండించారు. అమిత్ షాకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని విమర్శించారు. కాన్వాయ్‌పై దాడి జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని... దీనికి చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలన్నారు. షాకు సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు సోము. మరోవైపు సోము వ్యాఖ్యలకు మంత్రి గంటా కౌంటర్ ఇచ్చారు. మోదీ, అమిత్ షాలే ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని... అలిపిరి ఘటనను చంద్రబాబు కూడా సీరియస్‌గా తీసుకున్నారన్నారు. ఈ ఘటన ప్రజల్లో ఉన్న ఆవేదనను తెలియజేస్తోందన్నారు గంటా.మరోవైపు ఈ ఘటనలో ముగ్గురు టీడీపీ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి వ్యతిరేకంగా తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ అలిపిరి పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన డీఎస్పీ ఎమ్మెల్యేతో చర్చించి... టీడీపీ కార్యకర్తల్ని విడుదల చేయడంతో పరిస్థితి సద్ధుమణిగింది. అలిపిరి దగ్గర శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న టీడీపీ కార్యకర్తల్ని... బీజేపీ నేతలే కవ్వించారని సుగుణమ్మ అన్నారు. వారే దాడికి కూడా దిగారని ఆరోపించారు.