న్యూఢిల్లీ ఫిబ్రవరి 4
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేషన్ (నీట్ పిజి) పరీక్షను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు వాయిదా వేసింది. నీట్ పిజి పరీక్ష తేదీ 2022 మార్చి 12 అని, అదే సమయంలో నీట్ పిజి -2021 కౌన్సెలింగ్ జరగబోతోందని, అందువల్ల నీట్ పిజి పరీక్షను వాయిదా వేయాలని మెడకికల్ డాక్టర్ల నుంచి అనేక వినతులు వస్తున్నట్లు ఆరోగ్య సేవల విభాగం డైరెక్టర్ శుక్రవారం జారీ చేసిన ఆదేశాల్లో తెలిపారు. 2022 మే/జూన్ నెలలో జరిగే పీజీ కౌన్సెలింగ్ 2022లో చాలా మంది ఇంటర్న్స్ పాల్గొనే అవకాశం ఉండదని చెప్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నీట్ పిజి 2022 పరీక్షను ఆరు నుంచి ఎనిమిదివారాలపాటు వాయిదా వేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు ఈ నోటీసులో తెలిపారు. నీట్ పిజి 2022 పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్‌బీఈ) నిర్వహిస్తోంది. ఈ పరీక్షను ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు వాయిదా వేయాలని దాదాపు ఆరుగురు ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు జనవరి 25న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మాండేటరీ ఇంటర్న్‌షిప్ పీరియడ్ పూర్తి కానందువల్ల అనేక మంది ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు ఈ పరీక్షను రాసే అవకాశం ఉండదని తెలిపారు. కోవిడ్ విధుల కారణంగా చాలా మంది ఈ ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయలేకపోయారని తెలిపారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరుపుతుంది.