కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధినేత దేవెగౌడ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్, బీజేపీ రెండూ కలిసిపోతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని చెప్పారు. ఆ రెండు పార్టీలతో పొత్తుపెట్టుకునే ఆలోచన తమకు లేదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో కన్నడిగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని... ఇప్పుడు ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తున్నారని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేశామని తెలిపారు. 2008లో బీజేపీతో కూటమి ఏర్పాటు చేసుకున్నామని... ఆ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డామని, ఇకపై అలాంటి పని చేయదల్చుకోలేదని చెప్పారు. హాసన్ జిల్లాలోని తన స్వగ్రామం హోలెనరసిపురలో దేవెగౌడ, ఆయన భార్య చెన్నమ్మలు ఓటు హక్కును వినియోగించుకున్నారు