తిరుపతి, ఫిబ్రవరి 5,
ఎమ్మెల్యే రోజా. జగనన్నకి దేవుడిచ్చిన చెల్లి. సొంత చెల్లికి చెక్ పెట్టినట్టే.. ఈ చెల్లినీ జగన్‌రెడ్డి సైడ్ చేస్తున్నారా? తనకు ఎంతో కావలసిన మంత్రి పెద్దిరెడ్డి కోసం.. తనకోసం ఎంతో చేసిన రోజమ్మను పక్కనపెట్టేస్తున్నారా? నగరి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రెబెల్స్‌ను రెచ్చగొడుతున్నారా? వారికి కీలక పదవులు కట్టబెట్టి.. రోజాపై ఉసుగొల్పుతున్నారా? అనే చర్చ జరుగుతోంది. తాజాగా, శ్రీశైలం బోర్డు చైర్మన్‌గా రెడ్డివారి చక్రపాణిరెడ్డిని నియమించారు సీఎం జగన్. ఈ చక్రపాణిరెడ్డి మరెవరో కాదు.. నగరిలో ఎమ్మెల్యే రోజాకు ఏకు మేకుగా మారిన వైసీపీ నేత. నిండ్ర ఎంపీపీ ఎన్నికల్లో రోజా వర్గానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడారు. రోజా గొడవ గొడవ చేసి.. నిండ్రను ఎలాగోలా తన మనిషికి కట్టబెట్టించుకున్నారు. అప్పుడు నిండ్రలో చక్రపాణిరెడ్డిని పక్కనపెట్టినందుకు.. ఇప్పుడు ఆయనకు ఏకంగా మరింత రాష్ట్రవ్యాప్త ప్రాముఖ్యత ఉన్న శ్రీశైలం బోర్డు చైర్మన్ పదవి కట్టబెట్టడం రోజాకు షాకింగ్ పరిణామమే. కేవలం చక్రపాణిరెడ్డి మాత్రమే కాదు.. ఎమ్మెల్యే రోజాను గట్టిగా వ్యతిరేకించే నగరి మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ,కేజీ కుమార్ సతీమణి శాంతికి.. ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది. ఈ రెండు పదవులతో రోజాపై ఆమె వ్యతిరేక వర్గం రాజకీయంగా ఆధిపత్యం సంపాదించనట్టే అంటున్నారు. తెలిసి తెలిసి జగనన్న తన వ్యతిరేకులను ఎందుకంత కీలక పోస్టుల్లో కూర్చోబెడుతున్నారని రోజా కలత చెందుతున్నారు. ఇదంతా, మంత్రి పెద్దిరెడ్డి మాట కాదనలేక.. ఆయన తిరగబడకుండా చూసుకునేలా.. రోజా రెబెల్స్‌ను ఇంతలా ఎంకరేజ్ చేస్తున్నారనేది ఓపెన్ టాక్. మరి, నియోజకవర్గం వ్యాప్తంగా శత్రువులను పోగేసుకున్న రోజమ్మ.. వచ్చే ఎన్నికల్లో నగరిలో ఎలా నెగ్గుకొస్తారో..?