విజయవాడ, ఫిబ్రవరి 5,
ఏకపక్షంగా కొత్త పీఆర్సీని ప్రకటించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు చెప్పిన అభ్యంతరాలను పెడచెవిన పెట్టింది. చర్చల పేరిట ఎటూ తేల్చకుండా కాలయాపన కూడా చేసింది. ఆపై ఉద్యోగులపై బెదిరింపులకు దిగింది. ఉద్యమించిన ఉద్యోగులపై ఆంక్షలు పెట్టింది. అయినప్పటికీ తమ సమస్యను ఏమాత్రం పట్టించుకోని సర్కార్ పై పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన ‘ఛలో విజయవాడ’ పిలుపుతో ఉద్యోగులంతా దండు కట్టారు. విజయవాడ వీధుల్లో కదం తొక్కారు. లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది బెజవాడను ముట్టడించడంతో జగన్ రెడ్డి సర్కార్ కు దిమ్మ దిరిగి మైండ్ బ్లాంక్ అయింది. చీమలదండు మాదిరి ముంచెత్తిన ఆందోళనకారులను చూసిన సర్కార్ కు చలి జ్వరం వచ్చినట్లయింది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగినట్లు కనిపిస్తోంది.పీఆర్సీ సాధన సమితి ఉద్యమంలో గణనీయమైన పాత్ర వహించిన ఉపాధ్యాయులను మచ్చిక చేసుకునే చర్యలు చేపట్టింది. ఉద్యమం నుంచి ఉపాధ్యాయులను తప్పించే వ్యూహం పన్నింది. ఈ క్రమంలో ఏపీలోని స్పెషల్ గ్రేడ్ టీచర్ల (ఎస్ జీటీ)కు పదోన్నతి వల వేసింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి ఎస్ జీటీలకు స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ)గా పదోన్నతి కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఏపీలోని సుమారు 30 వేల మంది ఎస్ జీటీలకు ప్రయోజనం కలుగుతుందని జగన్ సర్కార్ పేర్కొంది. పాఠశాల విద్యపై సమీక్షలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తద్వారా పీఆర్సీ కోసం భారీ సంఖ్యలో ఉద్యమిస్తున్న ఉపాధ్యాయుల బలాన్ని తగ్గించే వ్యూహాన్ని జగన్ రెడ్డి సర్కార్ పన్నినట్లయిందని విశ్లేషకులు అంటున్నారు. ఛలో విజయవాడ సక్సెస్ అవడంతో ఆగమేఘాల మీద సీఎం జగన్ తో చర్చలు జరిపిన అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు కూడా ప్రభుత్వంలో ఏదో భయం మొదలైనట్లు కనిపించిందంటున్నారు. అంతకు ముందు ప్రభుత్వం తరఫున ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపేందుకు వేసిన కమిటీ ఏమాత్రం పట్టు విడుపు లేకుండా వ్యవహరించింది. ఛలో విజయవాడను పీఆర్సీ సాధన సమితి సక్సెస్ చేసి, ఛాలెంజ్ చేయడంతో ప్రభుత్వం బెట్టు సడలినట్లు ఉందంటున్నారు. కొత్త పీఆర్సీతో జీతాలు పెరుగుతాయంటూ చర్చల కమిటీ సుద్దులు చెప్పింది. అయితే.. సీఎస్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో జీతాలు ఎక్కడ తగ్గుతాయో చెప్పాలని కోరడాన్ని ‘తగ్గేదేలే’ అని కాకుండా ‘తగ్గితే పోలా’ అనే ధోరణే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తమకు జీతాలు తగ్గుతాయి మొర్రో.. కొత్త పీఆర్సీ వద్దు, పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వండని డైరెక్ట్ గానే మొత్తుకున్నా పట్టించుకోలేదు సర్కార్. పైగా ఉద్యోగుల జీతాలు ఫస్ట్ తారీఖున కాకుండా ఆలస్యంగా ఇచ్చిన జగన్ రెడ్డి సర్కార్ పంతానికి పోయి.. ట్రెజరీ ఉద్యోగులు సహకరించకపోయినా.. కొత్త పీఆర్సీ ప్రకారం జనవరి జీతాలు ఫిబ్రవరి ఒకటో తేదీనే జమ చేసింది. అయితే.. ఇంతగా తమకు జీతాలు తగ్గుతాయని చెప్పినా పట్టించుకోకుండా.. ఏదైనా సమస్య ఉంటే చెబితేనే కదా తెలిసేది అని సీఎస్ అనడంతో ప్రభుత్వంలో బింకం సడలిందా? అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పీఆర్సీ సాధన సమితి నేతలు చేసిన డిమాండ్లను ససేమిరా అన్న సర్కార్ ఇప్పుడు హెచ్ఆర్ఏపై సమస్యలుంటే ప్రభుత్వంతో మాట్లాడాలని కోరడం వెనుక.. ఉద్యోగులతో పెట్టుకోవడం ఎందుకొచ్చిన తంటారా బాబూ అనే ధోరణి వచ్చిందంటున్నారు. తమ డిమాండ్లపై జగన్ రెడ్డి సర్కార్ దిగి రాకపోతే ఉద్యోగులు ఎలాగూ సమ్మెలోకి వెళ్లిపోతారు. పీఆర్సీ సాధన సమితికి ఇప్పటికే ట్రెజరీ ఉద్యోగులు మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ సంఘాలు కూడా అదే బాటలో వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. ఆపైన వైద్య సిబ్బంది కూడా జగన్ రెడ్డి సర్కార్ పై తిరుగుబాటు బావుటా ఎగరేసేందుకు రెడీ అవుతున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం తక్కువ వచ్చిన జనవరి నెల జీతాలు చూసుకున్న పోలీసన్నలకూ జగన్ రెడ్డి సర్కార్ తత్వం బోధపడింది. ఆ కారణంగా పోలీసులు కూడా ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారంటున్నారు. పోలీసులు కోపంగా ఉండడం కూడా గురువారం నాటి ‘ఛలో విజయవాడ’ విజయవంతం కావడానికి ఓ కారణం అనే విశ్లేషణలు వస్తున్నాయి.