YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రగతిపథం దిశగా అడుగులు..

 ప్రగతిపథం దిశగా అడుగులు..

 

- నిన్న మాదే, నేడు మాదే, రేపు మాదేలే... 

సర్పంచ్‌... బాట్లపల్లి రజిత, చదువు .... టెన్త్‌ క్లాస్‌ 
గ్రామం .... ముండ్రాయి. నంగునూరు మండల్‌, సిద్థిపేట జిల్లా 
జనాభా...1545 
పొదుపు సంఘాలు....31 
ఏం సాధించించారు ? 

ప్రతీ కుటుంబానికి రోజుకు 40లీటర్ల మినరల్‌ వాటర్‌. వందశాతం మరుగుదొడ్లు. ఇంకుడు గుంతలతో సంపూర్ణ పారిశుద్థ్యం సాధించారు. కష్టాలు మనిషిలో కొత్త ఆలోచనలు పుట్టిస్తాయి. సమస్యల నుండి గట్టెక్కే మార్గం చూపిస్తాయి. 
శ్రమించి పనిచేసే తత్వం,సాధించాలన్న పట్టుదల ఉండాలి గానీ ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. 
భూగర్భ జలాలు ఎండి పోయి, సరైన రహదారులు లేక, తాగునీరు లేక ఉపాధి అవకాశాలు లేక. సకల సమస్యల వలయంలో విలవిల లాడుతున్న గ్రామానికి 'రజిత' వెలుగు బాటలు వేసింది. తమ గ్రామపంచాయితీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా మారిందామె. 
పేరుకే మహిళా సర్పంచ్‌లు కానీ వారి భర్తలే అధికారం చెలాయించడం చాలా చోట్ల జరుగుతున్నదే. కానీ రజిత భర్త వెంకటేశం తీరే వేరు. భార్య సర్పంచ్‌గా విధులు నిర్వహిస్తుంటే అతడు ఇంకుడు గుంతలు తవ్వుతుంటాడు. రహదారులకు ఇరువైపులు మొక్కలు నాటి నీరు పెడుతుంటాడు. పొదుపు సంఘాల మహిళలకు ఎకౌంట్లు రాసి పెడుతుంటాడు. ప్రజలకు ప్రభుత్వ పధకాల గురించి వివరించి వాటిని ఎలా సాధించాలో అవగాహన కలిగిస్తాడు. మహిళా సర్పంచ్‌కి తగిన భర్తగా, గ్రామాభివృద్దిలో తన వంతు కృషి చేస్తుంటాడు తప్ప ఎక్కడా భార్య అధికారాన్ని దుర్వినియోగం చేయడు. 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామ ప్రజల ముంగిట్లోకి తెచ్చి ప్రగతిపథం దిశగా అడుగులు వేస్తున్నారీ గ్రామీణులు. ఊరిలో ప్రతీ ఇంటి ఆడపడుచు ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించి 100శాతం మరుగుదొడ్లున్న స్వచ్ఛగ్రామాన్ని సాధించడంలో రజిత కృషి అపారం. అక్కడితో ఆగకుండా గ్రామంలో బోరుబావులు ఎండిపోవడంతో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడసాగారు. గ్రామ సభలో ఇదే సమస్యపై చర్చించి నీళ్ల విషయంలో ముందు జాగ్రత్త పడకపోతే భవిష్యత్‌లో నీటి కొరత మరింత తీవ్రమవుతుందని గ్రహించారు. దీనికి పరిష్కారంగా ప్రతీ ఇంటికీ ఇంకుడు గుంత తప్పనిసరిగా ఉండాలని తీర్మానం చేశారు. మరి వీటి నిర్మాణానికి నిధులు ఎలా? ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉన్న రజిత భర్త వెంకటేశం డ్వామా అధికారులను సంప్రదిస్తే పరిష్కారం ఉంటుందని సలహా ఇవ్వడంతో గ్రామస్థులను తీసుకొని రజిత అధికారులను కలిశారు. వీరి ఐక మత్యాన్ని, ముందు చూపును గమనించిన జిల్లా అధికారులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇంకుడు గుంతల నిర్మాణానికి సహాయం అందించడంతో ఇళ్ల ముందు ఇంకుడు గుంతలు తయారైంది. 
ఇంట్లో వాడిన వ్యర్థ జలాలతో పాటు , వానలు కురిసినపుడు ఇంటిపై కప్పు నుండి జారే ప్రతి నీటి చుక్క అక్కడే ఇంకిపోతుంది. దీనివల్ల బోర్లు కూడా రీచార్జ్‌ అయి నీటికి కొరత లేదని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


ప్రతీ ఇంటికీ స్వచ్ఛజలం ..
భూగర్భజలాలనైతే ఇంకుడు గుంతలతో పెంచారు గానీ స్వచ్ఛమైన నీరు లేక ప్రజలు డయోరియా వంటి వ్యాధులకు లోనవడం కూడా సర్పంచ్‌ రజిత గ్రహించారు. ఈ సమస్య నుండి గ్రామస్థులను ఎలాగైనా కాపాడాలనుకొని ''అరబిందో ఫార్మా'' సంస్థను సంప్రదించారు. వారు తమ సిఎస్‌ఆర్‌ నిధుల నుండి ఆర్‌ఓ ప్లాంట్‌ మిషనరీకి అయ్యే ఖర్చు రూ.10లక్షలను విరాళంగా ఇచ్చారు. మనసుంటే మార్గం ఉంటుందనే దిశలో సర్పంచ్‌ ఆలోచనకు పలు సంస్ధలు తోడవడంతో ప్రజల దాహార్తి అలా తీరింది. 
ఫలితంగా నేడు రూ.3లకే ఇరవై లీటర్ల స్వచ్ఛమైన నీరుని గ్రామస్థులు పొందుతున్నారకు. రోజుకు ప్రతీకుటుంబం 40-లీటర్ల నీటిని వాడుతున్నారకు. 
ఇవీ ఫలితాలు 
1, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్దవంతంగా తమ అభివృద్ధికి ఉపయోగించుకున్నారు. 
2, ఆడ బిడ్డలు టాయిలెట్లు లేక చెంబు పట్టుకొని ఆరు బయటకుపోతూ పలు అవమానాలు ఎదుర్కోవడం తగ్గింది. రూరల్‌వాటర్‌ స్కీమ్‌, ఉపాధి హామీ పథకం నిధులతో ప్రతీ ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకున్నారు. 
3, ప్రభుత్వం సాయంతో, ప్రజల శ్రమదానంతో 100శాతం ఇంకుడు గుంతలు పూర్తి చేశారు. 
4, స్త్రీనిధి బ్యాంక్‌ ద్వారా 67 మంది మహిళలు పాడి పశువుల కోసం రుణాలు పొందారు. 
5, మహిళా పొదుపు సంఘాలన్నీ కలిసి ఒక గ్రామ సంఘంగా ఏర్పడి ప్రతీ సభ్యురాలు నెలకు రూ.10లు పొదుపు చేస్తారు. ఎవరైనా దూరదృష్టవశాత్తు మరణిస్తే తక్షణం రూ.10వేలు వారి వారసులకు అందించే బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. 
6,మహిళలు స్వయం ఉపాధి పొందడానికి స్త్రీనిధి బ్యాంక్‌ ద్వారా 25 మందికి ఒక్కొక్కరికి రూ.40వేలు, 41 మందికి ఒక్కొక్కరికి రూ.50వేలు రుణం పొందారు. 

Related Posts