హైదరాబాద్
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి మృతి చెందారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డి ఈ రోజు తుదిశ్వాస విడిచారు. దక్షిణ భారతదేశం నుండి బీజేపీకి తొలి ఎంపీ జంగారెడ్డి. బీజేపీ దేశవ్యాప్తంగా ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు జంగారెడ్డి ఒకరు. 1984లో దేశవ్యాప్తంగా బీజేపీ 543 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తే రెండు స్థానాల్లో గెలిచింది. అందులో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని హన్మకొండ పార్లమెంట్ స్థానం నుండి జంగారెడ్డి గెలుపొందగా, గుజరాత్ లోని మెహెనా స్థానం నుండి ఏకే పటేల్ గెలుపొందారు. జంగారెడ్డి మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై 54వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. అయన రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఆకస్మిక మృతికి పలువురు సంతాపం తెలిపారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోండాపుర్ కిమ్స్ హాస్పిటల్ చేరుకోని జంగారెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు. అయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.