హైదరాబాద్, ఫిబ్రవరి 5,
తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్, రాజేసిన రాజ్యాంగ వివాదం, రాష్ట్రంలోనే కాదు, దేశ రాజధాని ఢిల్లీ లోనూ, అగ్గి పుట్టిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, రాజ్యాంగాన్ని తిరగరాయాలన్న వ్యాఖ్యలకు నిరసనగా ఢిల్లీలోని తెలంగాణ భవన్’లో ఒక రోజు భీమ్ దీక్షచేశారు. మరో రోజు తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహం నుండి పార్లమెంట్ వరకు భీమ్ పాదయాత్ర చేశారు. ఈపాద యాత్రలో బండి సంజయ్ తోపాటు ఎంపీలు సోయం బాపురావు, అరవింద్, బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇంఛార్జ్ మునుస్వామి సహా పలువురు నేతలు పాల్గొన్నారు,మరో వంక రాజ్య సభలోనూ రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు సభలో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆర్ఎస్ఎస్, హిందూ అతివాదుల విద్వేషపూరిత ప్రసంగాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. బీజేపీ పాలనలో సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటోందని.. లౌకికత్వం ప్రమాదంలో పడిందని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూస్తోందన్న ఆయన.. దేశానికి కొత్త రాజ్యాంగం కావాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. అయితే, కేకే ప్రస్తావించిన కేసీఆర్ వ్యాఖ్యలపై రాజ్య సభలో కాంగ్రెస్ పక్ష నేత నేత మల్లికార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తపరిచారు. రాజ్యాంగాన్ని తిరగ రాయాలన్న కేసీఆర్ ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ఖర్గే స్పష్టం చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆలోచనా విధానానికి మద్దతిచ్చేలా ఉందని ఖర్గే అన్నారు.నిజానికి, కేసేఆర్ రాజ్యాంగాన్ని తిరగరాయాలని ప్రతిపాదించింది మొదలు, కాంగ్రెస్ పార్టీ ఇది బీజీపే కుట్రగా ఆరోపిస్తూనే వుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రెస్ మీట్’లో ఇదే చెప్పారు. బీజేపీ బాటలో కేసీఆర్ పయనిస్తున్నారని.. వారి ఆలోచనలను ఈయన అమలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే, రాష్ట్రంలో కాంగ్రెస్ చేపట్టిన 48 గంటల మౌన దీక్షలోనూ కాంగ్రెస్ నాయకులు అదే ఆరోపణ చేస్తున్నారు. అందుకు ఆధారంగా గతంలో కేంద్ర మంత్రి అనంత కుమార్ హెగ్డే, “రాజ్యాంగాన్ని మార్చేందుకే తాము అధికారంలోకి వచ్చాం” అంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. అదలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ సహా వివిద రాజకీయ పార్టీలు, దళిత, ప్రజాసంఘాలు కేసేఆర్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు.ముఖ్యమంత్రి కేసేఆర్ దిష్టిబొమ్మల దహనం, చేస్తున్నారు . శవ యాత్రలు నిర్వహిస్తున్నాయి. మరోవంక, కడియం శ్రీహరి, బాలక సుమన్ వంటి తెరాస దళిత నాయకులు కేసేఆర్ వ్యాఖ్యలను సమర్ధించడమే కాదు, ఆయన (కేసీఆర్) అంబేద్కర్’ను మించిన దళిత దేవుడు అన్నట్లుగా ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే, దళిత ప్రజానీకం మాత్రం తమను అన్ని విధాలా మోసంచేసిన కేసేఆర్’ను మరోలా, చూస్తున్నారని దళిత మేథావులు , సామాజిక కార్యకర్తలు అంటున్నారు.