YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

హ్యాట్రిక్ కోసం... వ్యూహాలు, ప్రతివ్యూహాలు

హ్యాట్రిక్ కోసం... వ్యూహాలు, ప్రతివ్యూహాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 5,
పార్టీ జిల్లా అధ్యక్షులతో త్వరలోనే సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. అధ్యక్షులు అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతివ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. జిల్లాల్లో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన కేసీఆర్… నాయకుల మధ్య సమన్వయం లోపించకుండా చర్యలు చేపట్టనున్నారు. జిల్లా పూర్తిస్థాయి కార్యవర్గం నియామకంపై కూడా చర్చించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే వాయిదా పడుతూ వస్తున్న జిల్లా కార్యాలయాల ప్రారంభంపై తేదీల ఖరారు చేయనున్నట్లు సమాచారం.టీఆర్ఎస్ ను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే గ్రామ, మండల, పట్టణ కమిటీలను పూర్తి చేసిన పార్టీ అధిష్టానం జిల్లా కమిటీలను జనవరి 26న ప్రకటించింది. 33 జిల్లా కమిటీల్లో 19 మంది యువ ఎమ్మెల్యేలకు జిల్లా బాధ్యతలను అప్పగించింది. యువతకు పెద్దపీట వేస్తామని పార్టీ అధిష్టానం సంకేతాలిచ్చింది. అయితే నూతన అధ్యక్షులుగా ఎన్నికైన వారంతా సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కానీ వారికి ఎలాంటి మార్గనిర్దేశనం చేయలేదు. కమిటీ నియమించిన మూడ్రోజుల్లోనే జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహిస్తానని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. పార్లమెంట్ బడ్జెట్ సెషన్, ముచ్చింతలకు ప్రధాని వస్తుండటంతో జిల్లా అధ్యక్షులతో నిర్వహించే సమావేశం వాయిదా వేసినట్లు తెలిసింది. త్వరలోనే నిర్వహిస్తామని ప్రగతి భవన్ వర్గాలు అధ్యక్షులకు చెప్పినట్లు సమాచారం. తేదీని మాత్రం ఇంకా నిర్ణయించలేదు.వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు పార్టీ బలోపేతంపై టీఆర్ఎస్ దృష్టి సారించింది. అందులో భాగంగానే ఎవరు ఊహించని విధంగా ఎక్కువ జిల్లాలకు అధ్యక్షులను యువ ఎమ్మెల్యేలను నియమించింది. జిల్లాల్లో ఇతరులను నియమిస్తే పార్టీలో విభేదాలు వస్తాయని, పార్టీ బలహీనమవుతుందని భావించి అప్పగించినట్లు సమాచారం. అయితే అధ్యక్ష పదవి ఆశించిన భంగపడిన వారిలో అసంతృప్తి లేకుండా చేసేందుకు కేసీఆర్ అధ్యక్షులకు మార్గనిర్దేశనం చేయనున్నారు. జిల్లా కమిటీలో ఎవరిని తీసుకోవాలి…? సీనియర్ల పాత్రపై కూడా భేటీలో కేసీఆర్ వివరించనున్నారు. అదే విధంగా గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులను ఎలా మోటివేషన్ చేయాలి, ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం, కేంద్రం చేపడుతున్న తెలంగాణ వ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న కృషిని వివరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. జిల్లా పార్టీ కార్యాలయాల ప్రారంభ తేదీలను కూడా జిల్లా అధ్యక్షుల సమావేశంలో వెల్లడించనున్నట్లు సమాచారం. అదే విధంగా పార్టీ శ్రేణులకు శిక్షణ కార్యక్రమాలపై చర్చించనున్నారు.పార్టీకి 2015 నుంచి జిల్లా అధ్యక్షులను అధిష్టానం నియమించలేదు. అయితే రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నియామకం చేపట్టింది. అయితే ప్రమాణస్వీకార మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకర మహోత్సవాలకు గ్రామస్థాయి నుంచి పార్టీ అధ్యక్షులు, శ్రేణులు తరలివచ్చేలా చర్యలు చేపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వహించి పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. పార్టీ శ్రేణుల్లో భరోసా నింపడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీ చేపట్టే కార్యక్రమాలను సైతం వివరించనున్నారు.

Related Posts