YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నోరు తెస్తున్న తంటా..

 నోరు తెస్తున్న తంటా..

నరం లేని నాలుక తెలుగుదేశంపార్టీలో అలజడి సృష్టిస్తోంది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ పార్టీని ముప్పుతిప్పలు పెడుతోంది. లూజ్ టంగ్.. తెలుగుదేశం పార్టీకి శాపంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయినప్పటికీ లూజ్ టంగ్ మాత్రం ఆగడంలేదు. అందుకే ముందు నోరు కట్టేసుకోవాలని కొంతమంది నేతలను హైకమాండ్ ఆదేశించింది. తెలుగుదేశంపార్టీకి విరోధులు ఎక్కడో లేరు.. పార్టీలోనే కొంతమంది నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ పరువును బజారుకీడుస్తున్నాయి.. టీడీపీకి అంతర్గత శత్రువుల ప్రమాదం పొంచి ఉంది. ప్రభుత్వ పథకాలు.. సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాల ద్వారా కొన్ని వర్గాల ప్రజలలో పార్టీ పట్ల ఆదరణ పెరుగుతోంది.. చంద్రబాబు బాగా కష్టపడుతున్నారన్న సానుభూతి వ్యక్తం అవుతోంది.. చంద్రబాబుకు ఉన్న ఇమేజ్‌ కారణంగా మధ్య తరగతి ప్రజలలలో టీడీపీ పట్ల సానుకూల వాతావరణాన్ని సృష్టించింది. అయితే పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి ప్రజలలో పలుచన అయ్యారు. ఎమ్మెల్యేల బంధువులు రాబందుల్లా నియోజకవర్గ ప్రజలను పీక్కుతిన్నారు. వీరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అనేకసార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కోపగించుకున్నప్పుడు కొంతమేరకు తగ్గినట్టే తగ్గి ..ఆ తర్వాత మళ్లీ విజృంభించారు. ఇలాంటి నేతలు కొంతమంది దొంగే దొంగన్నట్టుగా అవినీతి పెరుగుతుందని చేస్తున్న వ్యాఖ్యలు చంద్రబాబు దృష్టికి వెళ్లాయి..

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశంపార్టీలో కలవరం రేకెత్తించాయి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్‌ చేసిన విమర్శలతో కొంతమంది అధికారపార్టీ ఎమ్మెల్యేలు బెంబేలెత్తారు. టీడీపీ వెంటనే ఎదురుదాడి ప్రారంభించడంతో పవన్‌ వెనక్కు తగ్గారు. ఎన్నికలకు ఏడాది ముందుగానే టీడీపీతో పొత్తు ఉండదని పవన్‌ చెప్పడం ఓ రకంగా మేలే చేసిందని టీడీపీ వర్గాలు అంటున్నాయి.. ఆయన పార్టీ వైఖరి ఏమిటన్నది ముందుగానే తెలియడంతో టీడీపీ మానసికంగా సిద్ధమయ్యేందుకు అవకాశం దొరికిందని టీడీపీ సీనియర్‌ నేతలు అన్నారు. పైగా పవన్‌కల్యాణ్‌, జగన్మోహన్‌రెడ్డిలు కలిసిపోతున్నారని … వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఈ రెండుపార్టీలకు ఇబ్బందికరంగా మారింది. పవన్‌-జగన్‌లను బీజేపీ నడిపిస్తోందన్న సంకేతాలను ప్రజల్లోకి పంపగలిగింది టీడీపీ. తాజాగా తెలుగుదేశంపార్టీలోని కొంతమంది నేతలు చేస్తున్న ప్రచారం చంద్రబాబు దగ్గరకు చేరింది.

      టీడీపీ గ్రాఫ్‌ తగ్గి జగన్ బలపడుతున్నారనిఅంతర్గత చర్చలలో కొందరు తెలుగు తమ్ముళ్లు అంటున్నారట! ఇదే విషయాన్ని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు కూడా చెబుతుండటాన్ని చంద్రబాబు పరోక్షంగా ప్రస్తావించారు. అందుకనే చంద్రబాబు కొంతమంది ఎమ్మెల్యేలకు గట్టిగా క్లాస్‌ తీసుకున్నారు. టీడీపీలో అంతర్గతంగా జరుగుతున్న విషయాలను కొంతరు నేతలు ప్రత్యర్థులకు లీక్‌ చేస్తున్నారన్న విషయాన్ని అధినాయకత్వం గుర్తించింది. మొన్నటి వరకు చంద్రబాబు నిర్వహించే అంతర్గత టెలీకాన్ఫరెన్స్‌ ల్లో... సమీక్షల్లో పాల్గొన్న ఈ నేతలకు ప్రస్తుతం నో ఎంట్రీ బోర్డు పెట్టారు టెలీ కాన్ఫరెన్స్‌లో కూడా కాల్ కలపవద్దని ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు దగ్గర జరిగిన అంతర్గత సమావేశం వివరాలు....టెలీ కాన్ఫరెన్స్‌లో విషయాలను కొన్ని ఛానల్స్‌కు... ప్రత్యర్ధి పక్షానికి చేరవేస్తున్నారని హైకమాండ్ కు కచ్చితమైన సమాచారం అందింది. ఫలితంగా వీరిని కట్ చేశారు. పార్టీలోనే తిరుగుతూ మరికొందరు ముఖ్యమంత్రి... మంత్రులు... అధికారులపై చేస్తున్న విమర్శల వ్యవహారం కూడా చంద్రబాబు వరకు వెళ్లింది. సమాచారాన్ని లీక్ చేయడం, నోటి దురదను ఎక్కువగా ప్రదర్శిస్తున్న నేతలతో పార్టీకి చిక్కులు వస్తున్నాయని గ్రహించడంతో చంద్రబాబు వీరందరికీ చెక్ పెట్టాలని నిర్ణయించారు.

 

        ప్రత్యర్ధులకంటే ముందే అంతర్గత శత్రువులు చేస్తున్న వ్యాఖ్యలు గత పదిహేను రోజులుగా పార్టీలో హాట్‌టాపిక్‌ అయ్యాయి. దీని వల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని హైకమాండ్ భావించి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. తాము లేకపోతే పార్టీ లేదని భావిస్తున్న కొంతమంది నేతలకు పార్టీ చరిత్ర ఏమిటో తెలియజేప్పే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ముందు నోటిని అదుపులో పెట్టుకోమంటూ కొంతమంది నేతలకు ఇప్పటికే వార్నింగ్ లు వెళ్లాయి. ఆ నేతల్లో ఎక్కువ మంది ప్రస్తుతానికి సైలెంట్ అయిపోయారు.

Related Posts