కర్నూలు జిల్లాలోని పాణ్యం నియోజకవర్గంపైనే అందరి దృష్టి పడింది. అక్కడ ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నదానిపై బోలెడన్ని చర్చలు జరుగుతున్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో అయితే టికెట్ కోసం పెద్ద ఫైటే నడుస్తోంది. మరోవైపు టీడీపీ నుంచి బైరెడ్డి బరిలోకి దిగుతారన్న ప్రచారం సాగుతోంది. పాణ్యంలో హీటెక్కిన రాజకీయంపై ప్రత్యేక కథనాన్ని తెలుసుకోండి.
మొన్నటి వరకు బీజేపీలో ఉన్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్‌భూపాల్‌రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీలో చేరిన తర్వాత సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పుడు పాణ్యం అసెంబ్లీ టికెట్ ఎవరికి దక్కుతుందా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఈ విషయంలో పాణ్యం సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరితా వెంకటరెడ్డి... కాటసాని రామ్‌భూపాల్‌రెడ్డి మధ్య రసవత్తరపోరు నడుస్తోంది. సీనియర్ నాయకుడైన కాటసాని రామ్‌భూపాల్‌రెడ్డి చేరికతో తమ పార్టీ బలం ఆమాంతంగా పెరిగిందని జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు సంబరపడుతున్నాయి.. అయితే కాటసాని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కండువా కప్పుకున్న మరుసటి రోజు నుంచే టికెట్ రగడ మొదలయ్యింది.
ఇటీవల గౌరు వెంకటరెడ్డి దంపతులు పాణ్యం నియోజకవర్గ మండలాలలో బూత్ లెవల్ కమిటీ కన్వీనర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ట్రైనింగ్ క్లాసులు ముగిసిన తర్వాత గౌరు దంపతులతో మండలస్థాయి నాయకులు పోటీ విషయంపై కాసేపు ముచ్చటించారు. పోటీ విషయంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని.. వచ్చే ఎన్నికల్లో పాణ్యం నుంచి తానే పోటీ చేస్తానని గౌరు చరితా వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కొంతమంది కాటసాని రామ్‌భూపాల్‌రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం చేస్తున్నారని... అందులో నిజం లేదని చెప్పుకొచ్చారు. పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి తనకే టికెట్ ఇస్తారని హామీ ఇచ్చారని గౌరు చరిత అన్నారు. ఆరు నూరైనా.. నూరు ఆరైనా బరిలో నిలిచేది తాననేనని గట్టిగా చెప్పారు. కాటసాని వర్గీయులు మాత్రం కొండంత ధీమాతో ఉన్నారు.. సర్వే రిపోర్టులు కాటసాని పక్షానే ఉన్నాయంటున్నారు. తెలుగుదేశంపార్టీ నుంచి ఎవరు నిలబడినా కాటసాని గెలవడం నల్లేరు మీద బండి నడకేనని పార్టీ శ్రేణులకు వివరిస్తున్నారు.
అయితే పాణ్యం అసెంబ్లీ టికెట్ విషయమై పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. జగన్మోహన్‌రెడ్డి ఎవరికీ మాట ఇవ్వకపోయినా ఇద్దరూ నేతలు మాత్రం కార్యకర్తల దగ్గర చర్చలు జరుపుతున్నారు.. దీంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ క్యాడర్‌లో కాసింత కన్ఫ్యూజన్ నెలకొంది.. ఇదే విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు కొందరు జిల్లా నేతలు! ఎమ్మెల్యే గౌరు చరిత.. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్‌భూపాల్‌రెడ్డి మధ్య నడుస్తోన్న టికెట్ వార్‌కు వీలైనంత త్వరగా ముగింపు పలకాలని జగన్‌కు రిక్వెస్ట్ చేశారు. జగన్ కూడా వీలైనంత త్వరగా ఈ గొడవకు పుల్‌స్టాప్ పెట్టాలనే యోచనలో ఉన్నారట! టికెట్ ఎవరికి ఇవ్వడం అటుంచి తెలుగుదేశంపార్టీ తరఫున ఎవరు బరిలో దిగుతున్నారనేదానిపైనే జగన్ దృష్టి పెట్టారు..వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తీరు ఇలా ఉంటే... మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి త్వరలో తెలుగుదేశంపార్టీ తీర్థం పుచ్చుకుంటారనే టాక్ జిల్లాలో నడుస్తోంది. బైరెడ్డి కనుక టీడీపీ తరఫున పోటీ చేస్తే బంపర్ మెజారిటీతో గెలవడం ఖాయమంటున్నాయి టీడీపీ శ్రేణులు.. పార్టీ చేరికపై టీడీపీ అగ్రనేతలతో బైరెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారని.. ఇవి కొలిక్కి వచ్చాయని అంటున్నారు. బైరెడ్డి టీడీపీలోకి వస్తే పాణ్యంలో రసవత్తరమైన పోటీ నెలకొంటుంది.