విజయవాడ, ఫిబ్రవరి 7,
చంద్రబాబు శపథం చేశారు. అసెంబ్లీకి ఇక అడుగుపెట్టబోనని ఆయన శాసనసభ సాక్షిగా చెప్పేసి వచ్చారు. తిరిగి ముఖ్యమంత్రి హోదాలోనే సభలోకి అడుగుపెడతానని చెప్పారు. చంద్రబాబు అసెంబ్లీకి ఈ రెండున్నరేళ్లలో వెళ్లే అవకాశం లేదు. అయితే కీలకమైన అంశాలన్నీ చంద్రబాబు గైర్హాజరీలోనే అసెంబ్లీ ముందుకు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. చంద్రబాబు తొందరపడి శపథం చేశారా? అన్న చర్చ పార్టీలోనూ జరుగుతుంది. గతంలోనూ ముఖ్యమంత్రి జగన్ దాదాపు రెండేళ్ల పాటు అసెంబ్లీని బహిష్కరించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడమే కాకుండా వారిలో కొందరికి మంత్రి పదవులు ఇవ్వడంతో జగన్ అసెంబ్లీకి రానని ప్రకటించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. పాదయాత్ర చేశారు. తిరిగి ముఖ్యమంత్రిగానే సభలోకి అడుగు పెట్టారు. కానీ జగన్ తాను ఒక్కడే కాకుండా పార్టీ మొత్తం అసెంబ్లీని బహిష్కరించింది. అప్పుడు కూడా విపక్షం లేకుండానే సభను నిర్వహించారు. అయితే చంద్రబాబు మాత్రం తానొక్కడే అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరవుతారు. వచ్చేది బడ్జెట్ సమావేశాలు. ఈ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చ జరుగుతుంది. ముఖ్యమైన బిల్లులు వచ్చే అవకాశముంది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయం కూడా అసెంబ్లీలో చర్చకు రానుంది. అలాగే కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, వైసీపీ ఎంపీ ల వైఫల్యంపై మాట్లాడే ఛాన్స్ చంద్రబాబు కోల్పోయారు. ఎన్టీఆర్ పేరు పెట్టడం వంటివి కొన్ని తమకు అనుకూల నిర్ణయాలు తీసుకున్నా, వ్యతిరేకంగా అనేక అంశాలున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. కీలక బిల్లులు... దీంతో పాటు మరోసారి మూడు రాజధానుల బిల్లులను కూడా అసెంబ్లీకి జగన్ తెచ్చే అవకాశముంది. గతంలో తాను చెప్పినట్లుగా బిల్లుల్లో మార్పులు చేసి తీసుకువస్తానని జగన్ అసెంబ్లీ సాక్షిగానే చెప్పారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో కాకపోయినా ఏదో ఒక సమావేశాల్లో బిల్లులను జగన్ తెచ్చే అవకాశముంది. జిల్లాల విభజన, మూడు రాజధానులు వంటి కీలక అంశాలు చర్చ జరిగే సమయంలో చంద్రబాబు సభలో ఉండక పోవడం పార్టీకి ఇబ్బందికరమే. మరి చంద్రబాబు శపథంపై నిలబడతారా? లేక రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అసెంబ్లీకి వెళతారా? అన్న సందిగ్దంలో ఉన్నారట. అసెంబ్లీకి వెళ్లే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని చెబుతున్నారు.