YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇంటికి ‘వెలుగు’

ఇంటికి ‘వెలుగు’

న్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లో ఇక వేగం పుంజుకోనుంది. నిధుల కొరత కారణంగా వీటి నిర్మాణాల్లో జాప్యం జరుగుతుండడంతో ఈ సమస్య పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. శ్లాబ్‌ నిర్మాణం, ఇతర పనుల నిమిత్తం ప్రత్యేకంగా నిధులు అందజేయాలని ఆదేశించడంతో అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో అధికారులు నిమగ్నమయ్యారు.

జిల్లాలో ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళలు ఇళ్ల నిర్మాణం చేపట్టారు.  పునాది దశ నుంచి గోడల వరకు చక చకా జరుగుతున్న నిర్మాణ పనులు శ్లాబ్‌ దశకు వచ్చేసరికి ఆగిపోతున్నాయి. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం.. మరోవైపు ప్రభుత్వం నుంచి బిల్లుల మంజూరులో జాప్యం జరగడంతో స్వయం సహాయక సంఘాల సభ్యులకు చెందిన అనేక ఇళ్లు అసంపూర్తి దశలో ఆగిపోతున్నాయి. బిల్లుల మంజూరుకోసం అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన లబ్ధిదారులు ఏమి చేయాలో తెలియక నిస్సహాయస్థితిలో ఉండిపోతున్నారు. ఈసమస్యను అధిగమించేందుకు పైకప్పు వేసుకోవడానికి వెలుగుశాఖ నుంచి ఆర్థికసాయం అందించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కేవలం శ్లాబ్‌ స్థాయిలో ఇంటి నిర్మాణంలో చోటుచేసుకుంటున్న జాప్యంతో ప్రగతి నివేదికల్లో జిల్లా కాస్త వెనుకబడుతోంది. నిధుల విడుదలలో జాప్యం కారణంగా నిర్మాణాల్లో ప్రగతిని చూపించలేకోపోతున్నారని గుర్తించిన కలెక్టర్‌ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయం చూపించారు.

జిల్లాలో 2016-19 వరకు ఎన్టీఆర్‌ గృహనిర్మాణ పథకం కింద,  2017-19 వరకు ఎన్టీఆర్‌ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద మొత్తం 59,160 గృహాలను మంజూరు చేశారు. ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకంలో లబ్ధిదారునికి ప్రభుత్వ రాయితీ రూ.1.5 లక్షలు, ఎన్టీఆర్‌ గ్రామీణ గృహ నిర్మాణ పథకంలో రూ.2 లక్షల వరకు అందిస్తారు. ప్రభుత్వం అందించే ఆర్థికసాయంతో పాటు లబ్ధిదారులకు కూడా రెండు గదులతో ఇళ్లు నిర్మించుకునేందుకు మరో రూ.లక్ష వరకు వ్యయం చేయాల్సి వస్తోంది. గృహనిర్మాణ సంస్థ అధికారులు పునాదులు, గోడల దశ వరకు రూ.1.10 లక్షల వరకు బిల్లులు చేస్తున్నారు. శ్లాబ్‌ వేయడంలో జాప్యం కారణంగా చివరి విడత బిల్లులు చేయడంలో ఆలస్యమవుతోంది. చేతిలో సొమ్ములు లేకపోవడంతో ఇంటి పైకప్పు నిర్మాణం పూర్తి చేయలేకపోతున్నామని లబ్ధిదారులు వెల్లడిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం కూడా లబ్ధిదారుల ఆర్థికపరమైన ఇబ్బందులను గుర్తించి సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయంగా వెలుగు నుంచి సదరు మహిళలకు ఇంటి పైకప్పు వేసుకునేందుకు రూ.25 వేలు చేబదులుగా ఇవ్వాలని ఆదేశించారు. దీంతో వెలుగు, గృహనిర్మాణ సంస్థ అధికారులు గ్రామాల్లో పథకంలో ఇళ్లకు పైకప్పు వేయాల్సిన వారిని గుర్తించారు.

జిల్లాలో 50 మండలాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న రెండు పథకాల్లో ఇప్పటికి గృహాలు మంజూరైన వారిలో ప్రస్తుతం 3వేల మంది లబ్ధిదారులు తమ ఇళ్లకు పైకప్పు నిర్మాణం పూర్తిచేయాల్సి ఉన్నట్లుగా గుర్తించారు. వాస్తవంగా జిల్లాలో శ్లాబ్‌లు వేసుకునేందుకు 10 వేల మంది వరకు వెలుగు నుంచి నిధులు చేబదులుగా ఇవ్వాలని లక్ష్యంగా ఉంది. మండల సమాఖ్య నిధుల నుంచి గుర్తించిన లబ్ధిదారులకు రూ.25వేలు అందజేస్తారు. ఇలా అందించిన సొమ్ముకు ఎలాంటి వడ్డీ వసూలు చేయరు. లబ్ధిదారులకు గృహ నిర్మాణ సంస్థ నుంచి బిల్లులు మంజూరవగానే తాము తీసుకున్న రూ.25వేలు తిరిగి వెలుగు శాఖ బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు. లబ్ధిదారులు తమ ఇళ్లకు శ్లాబ్‌ నిర్మాణం కూడా పూర్తి చేస్తే గృహ నిర్మాణ సంస్థ నుంచి ఆ పనికి సంబంధించి రూ.40వేలు చెల్లిస్తారు. శ్లాబ్‌ పూర్తయి జియోట్యాగింగ్‌ తీసుకుని అధికారులు బిల్లుల మంజూరుకు నివేదిక పంపించిన పక్షం రోజుల వ్యవధిలో సొమ్ములు విడుదలవుతాయి. అంటే లబ్ధిదారులు తమకు వెలుగు నుంచి అందిన సొమ్ముతో శ్లాబ్‌ పనులు సత్వరమే పూర్తి చేసుకుంటే నెలన్నర వ్యవధిలో పూర్తి బిల్లులు మంజూరవడంతో పాటు తీసుకున్న చేబదులు సొమ్ము కూడా తిరిగి చెల్లించవచ్చు. లబ్ధిదారులు తీసుకున్న సొమ్మును వెలుగుశాఖకు చెందిన మండల సమాఖ్యకు జాప్యం చేయకుండా చెల్లిస్తే ఆ సొమ్ముతో మిగిలిన లబ్ధిదారులకు సాయం చేసేందుకు తోడ్పడుతుంది.

జిల్లాలో మే మొదటి వారం నుంచి కొత్త ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్‌ ఆదేశానుసారం వెలుగు, గృహనిర్మాణ సంస్థ అధికారులు సమన్వయంతో గృహనిర్మాణ లబ్ధిదారులకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో తొలిగా మూడు వేల మందికి రూ.7.5 కోట్లు వరకు అందజేయనున్నారు. నెలన్నర వ్యవధిలో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించడంతో వడ్డీ మినహాయింపు కూడా ఇచ్చారు. నెలాఖరులోపు లక్ష్యం మేరకు రూ.25 వేలు చేబదులు సొమ్ము అందించేందుకు వెలుగు అధికారులు చెక్కులు కూడా సిద్ధం చేశారు. గంపలగూడెం మండలంలో శనివారం చెక్కుల పంపిణీ ప్రక్రియను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. రూ.25 వేలు అందుకున్న లబ్ధిదారులు సత్వరమే శ్లాబ్‌ పనులు కూడా పూర్తి చేసుకుంటే సొంతింటి కలను వేగంగానే సాకారం చేసుకుంటారు.

Related Posts