హైదరాబాద్, ఫిబ్రవరి 7,
కరోనా కారణంగా గత రెండు అకడమిక్స్ ఇయర్స్‌లో విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. కరోనా కేసులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేస్తూ విద్యార్థులను ప్రమోట్ చేస్తూ వచ్చాయి. ఇదిలా ఉంటే తెలంగాణలో ఈసారి కూడా ప్రాక్టికల్స్ ఉండవన్నట్లు గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. కొన్ని పత్రికల్లో కూడా ఈసారి కూడా ప్రాక్టికల్స్ నిర్వహణ సందేహం అన్నట్లు వార్త కథనాలు వచ్చాయి. దీంతో ఈ విషయంపై ఇంటర్ బోర్డ్ క్లారిటీ ఇచ్చింది.ఇంటర్ పరీక్షలపై జరుగుతోన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టిన ఇంటర్ బోర్డ్ క్లారిటీ ఇచ్చేసింది. ఈసారి పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లో నిర్వహిస్తామని తేల్చి చెప్పేసింది. ఈ విషయమై అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ‘గతేడాది కరోనా కారణంగా భౌతికంగా తరగతులు నిర్వహించలేదు, కేవలం 45 రోజులు మాత్రమే తరగుతులు జరిగాయి. ఈ కారణంగానే పరీక్షలు లేకుండానే విద్యార్థులను ప్రమోట్ చేయాల్సి వచ్చింది. అయితే 2021-2022 అకడమిక్ ఇయర్‌లో పరిస్థిలో మార్పు వచ్చింది. జనవరిలో కేవలం 14 రోజులు మాత్రమే కాలేజీలు మూతపడ్డాయి. ఫిబ్రవరి 1 నుంచి యథాతధంగా తరగతులు కొనసాగుతున్నాయి.వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో ప్రాక్టికల్ పరీక్షలను ఎప్పటిలాగే థియరీ పరీక్షలకు ముందే నిర్వహించనున్నాము. పరీక్షలను నిర్వహించుకుండానే ప్రమోట్ చేసే ఆలోచనే లేదు. ప్రాక్టికల్, థియరీ పరీక్షల షెడ్యూల్‌ను ఒకటి, రెండు రోజుల్లో విడుదల చేయనున్నాము. విద్యార్థులంతా ఈ విషయాన్ని గమనించాలి’ అంటూ తెలంగాణ బోర్డ్ స్పష్టతనిచ్చింది.
డిగ్రీలోనూ అడిషనల్ చాయిస్
రాష్ట్రంలోని 6 యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ స్టూడెంట్లకు ఈనెల 28 నుంచి ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. శనివారం ఉస్మానియా, కాకతీయ, టీయూ, ఎంజీయూ, శాతవాహన, పాలమూరు తదితర వర్సిటీల వీసీలతో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్వెంకటరమణ వర్చువల్‌గా సమావేశమయ్యారు. కరోనా కారణంగా స్టూడెంట్స్‌లో ఎగ్జామ్స్పట్ల ఏర్పడిన భయాన్ని తొలగించేందుకు ఎగ్జామ్ పేపర్లలో చాయిస్ పెంచాలని నిర్ణయించామని లింబాద్రి తెలిపారు. పరీక్షా సమయాన్ని రెండున్నర గంటల నుంచి 3 గంటలకు పెంచనున్నట్టు వివరించారు. ఈనెల17 లాస్ట్ టీచింగ్ డే అని, 18 నుంచి 25 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతాయని అన్నారు. ఈనెల 28 నుంచి మార్చి 24 వరకు డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ థియరీ పరీక్షలుంటాయని చెప్పారు.వివిధ వర్సిటీల పరిధిలోని కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి మరో విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు టీఎస్‌సీహెచ్‌ఈ చైర్మన్ లింబాద్రి తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు.