YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

కార్పొరేట్ టీచర్ల దుస్థితి

కార్పొరేట్ టీచర్ల దుస్థితి

హైదరాబాద్, ఫిబ్రవరి 7,
కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పరిస్థితి 'పేరు గొప్ప ఊరు దిబ్బ' అన్నట్టుగా ఉన్నది. పైకి కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో పనిచేస్తున్నారంటూ సమాజంలో పేరుంటుంది. కానీ చాలీచాలని వేతనాలతో కుటుంబాలను పోషించుకోలేని దుస్థితి వారిది. ప్రస్తుతం పనిచేస్తున్న వారి పరిస్థితే ఇలా ఉంటే వాటిలో పనిచేసి ఇప్పుడు విధుల్లోకి తీసుకోని ఉపాధ్యాయుల దుస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మానసికంగా, ఆర్థికంగా వారు ఎంత దయనీయ పరిస్థితిలో ఉంటారో అర్థం చేసుకోవచ్చు. శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల్లో డ్రాయింగ్‌, యోగా, మ్యూజిక్‌, డ్యాన్స్‌ టీచర్లుగా పనిచేసిన వారిని రెండేండ్లుగా విధుల్లోకి తీసుకోవడం లేదు. 20 ఏండ్ల నుంచి వాటిలో పనిచేస్తున్నా కనీసం కనికరం చూపడం లేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా సాకుతో వారి జీవితాలతో ఆయా యాజమాన్యాలు చెలగాటమాడుతున్నాయి. దీంతో వందలాది కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఉపాధి లేక, జీతాల్లేక వారి బతుకులు ఛిద్రమయ్యాయి. కుటుంబాలను పోషించుకోవడానికి టీచర్లు అప్పులపాలయ్యారు. మానవతా దృక్పథంతో ఆలోచించి తమను విధుల్లోకి తీసుకోవాలంటూ శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాలను వేడుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ స్పందించి న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. ఎప్పుడు ఆయా యాజమాన్యాల నుంచి పిలుపు వస్తుందోనని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.బడుల్లో ఆటలు, పాటలుంటేనే విద్యార్థులు మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటారు. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేందుకు క్రీడలు, డ్రాయింగ్‌, యోగా, మ్యూజిక్‌, డ్యాన్స్‌ దోహదపడతాయి. కార్పొరేట్‌ విద్యాసంస్థలంటేనే బట్టీ చదువులకు నిలయాలని పేరుంది. అయితే డ్రాయింగ్‌, యోగా, మ్యూజిక్‌, డ్యాన్స్‌ వంటి నేర్పించే ఉపాధ్యాయుల వల్ల అక్కడి విద్యార్థులు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఇతర సబ్జెక్టులను శ్రద్ధగా వినాలన్నా, నేర్చుకోవాలన్నా, చదవాలన్నా కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ కీలకపాత్ర పోషిస్తాయి. విద్యార్థులకు ఎంతో ప్రయోజనం ఉన్నా ఆయా ఉపాధ్యాయులను మాత్రం శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాలు రెండేండ్లుగా విధుల్లోకి తీసుకోవడం లేదు. వారు లేకపోవడం వల్ల విద్యార్థులు మానసిక ఉల్లాసానికి దూరమయ్యారన్న అభిప్రాయం వినిపిస్తున్నది. ఉద్యోగాలున్నాయా? లేదా?అన్న దానిపై సరైన సమాధానం ఇవ్వడం లేదు. అవసరమైనప్పుడు తీసుకుంటామంటూ యాజమాన్యాల నుంచి సమాధానం వస్తున్నది. దీంతో ఈ వృత్తినే నమ్ముకున్న ఆ ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఉద్యోగం, జీతం లేక విలవిలలాడుతున్నారు. ఇంటిఅద్దె, కుటుంబ పోషణ, విద్యార్థుల చదువులు, వైద్య ఖర్చులు వంటి వాటికోసం డబ్బుల్లేక వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేస్తున్నారు. కొందరు ఈ వృత్తిని వదిలేసి సొంతూర్లకు వెళ్లి వ్యవసాయ పనులు, ఉపాధి హామీ కూలీలుగా మారుతున్నారు. ఇంకొందరు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.  శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల్లో డ్రాయింగ్‌, యోగా, మ్యూజిక్‌, డ్యాన్స్‌నే నేర్పించే ఉపాధ్యాయులు వందల సంఖ్యలో పనిచేశారు. వారికి నెల జీతం ఉండదు. వారంలో వారు నేర్పించే తరగతులను బట్టి జీతం ఇస్తారు. అందులోనూ ఒకే పాఠశాల లేదా కాలేజీ వరకే పరిమితం కాకుండా రెండు, మూడు బ్రాంచీల్లో విద్యార్థులకు వాటిని నేర్పించాలి. అలా నెలకు ఎన్ని తరగతులు నేర్పిస్తారో వాటి ఆధారంగా రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు జీతం తీసుకుంటారు. ఇప్పుడు వారికి ఒక్క రూపాయి జీతం రాకపోవడంతో కుంగిపోతున్నారు. బడా కార్పొరేట్‌ కాలేజీలు తమ ప్రతాపాన్ని చిరుద్యోగులపైన చూపడం సరికాదని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. విద్యార్థుల మానసిక ఉల్లాసం, కళలు నేర్పించే ఉపాధ్యాయుల జీవితాలు, వారి కుటుంబాల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు.

Related Posts