అనంతపురం, ఫిబ్రవరి 7,
అనంతపురంలో జిల్లాల విభజన అంశం మరో రచ్చకు తెరతీసింది. ధర్మవరం రెవిన్యూ డివిజన్‌ను రద్దు చేయడంతో పొలిటికల్ వార్ మొదలైంది. దీనిపై ఆందోళనకు సిద్ధమవుతున్నారు టీడీపీ నేతలు. ఇవాళ ధర్మవరంలో నిరాహారదీక్షకు దిగుతున్నారు పరిటాల శ్రీరామ్. ధర్మవరం డివిజన్ రద్దు చేస్తుంటే ఇక్కడున్న వైసీపీ నేతలు ఏం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పరిటాల శ్రీరామ్. గాడిదలు కాస్తున్నారా ? అని ఇటీవల కామెంట్ చేశారు. దీనిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పరిటాల శ్రీరామ్‌కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎమ్మార్వో ఆఫీసులు తగులబెట్టిన వారు కూడా రెవెన్యూ డివిజన్ అంశాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అయితే పరిటాల శ్రీరామ్ నిరాహార దీక్షతో ధర్మవరంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మరోవైపు ఇదే అంశంపై జిల్లా కలెక్టర్‌ను కలువబోతున్నారు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ. దీంతో ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు అంశం పెద్ద దుమారాన్నే రేపుతోంది.ధర్మవరం రెవెన్యూ డివిజన్‌ను రద్దు చేసి కొత్త జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పాటుకానున్న పుట్టపర్తి రెవెన్యూ డివిజన్‌లోకి విలీనం చేస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 1953లో ధర్మవరం రెవెన్యూ డివిజన్ ఫామ్ అయ్యింది. ధర్మవరం, పెనుకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల పరిధిలోని 17 మండలాలు దీని సర్కిల్‌లో ఉండేవి. అయితే 2013లో కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ ఫామ్ చెయ్యడంతో అందులోకి కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల మండలాలు వెళ్లాయి. దీంతో ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం, ముదిగుబ్బ, బత్తలపల్లి, తాడిమర్రి, రాప్తాడు నియోజకవర్గంలోని రాప్తాడు, రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాలతో డివిజన్ కొనసాగింది. ఇటీవల సత్యసాయి జిల్లా ప్రకటనతో అనంతపురం రెవెన్యూ డివిజన్‌లోకి రాప్తాడు, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాలు యాడ్ చేశారు. రామగిరి మండలాన్ని కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్‌లోకి ఛేంజ్ చేశారు. ధర్మవరం నియోజకవర్గంలోని 4 మండలాలతో రెవెన్యూ డివిజన్‌గా కొనసాగుతుందని అనకుంటుండగా… డివిజన్ రద్దు చేస్తూ గవర్నమెంట్ ఉత్తర్వులు వెలువరించింది.