YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గొర్రెల పథకం.. దళారుల రాజ్యం

గొర్రెల పథకం.. దళారుల రాజ్యం

రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెంచాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకం కొందరు అవినీతి అధికారులు, దళారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. పశువైద్యాధికారులు, దళారులు కలిసి దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్న చందంగా పథకాన్ని దారి మళ్లిస్తున్నారు. ఫలితంగా పంపిణీ చేసిన జీవాలు క్షేత్రస్థాయిలో కనిపించటం లేదు. భారీగా రీసైక్లింగ్‌ చేపడుతూ దేవరకొండ డివిజన్‌లో శివారు మండలాల్లోని పశువైద్యాధికారులు, దళారులు ఆదాయ మార్గాలుగా మలుచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రూ.1.25 లక్షల విలువైన పథకంలో రూ.31,250 లబ్ధిదారుడు చెల్లిస్తే 75శాతం సొమ్ము అంటే రూ.93,750ను ప్రభుత్వం భరిస్తుంది. ప్రతి యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక పొట్టేలు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ, కొంతమంది పశువైద్యాధికారుల కక్కుర్తి వల్ల 10, 12 గొర్రెలు ఇప్పించి చేతులు దులుపుకుంటున్నారు. అడిగితే లబ్ధిదారుడే ఇష్టపూర్వకంగా నచ్చిన పెద్దగొర్రెలను తీసుకుంటున్నారని వైద్యులు బుకాయిస్తున్నారు. గతంలో పశువుల యూనిట్ల మంజూరు విషయం లబ్ధిదారునికి తెలియకుండానే గ్రౌండింగ్‌ పూర్తిచేసి రూ.లక్షలు అవినీతికి పాల్పడిన డివిజన్‌లో ఓ పశువైద్యాధికారి తన అనుభవాన్ని రాయితీ గొర్రెల   పథకంలోనూ ప్రయోగించి ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నారు.

డిండి మండలం టి.గౌరారం గ్రామానికి చెందిన కొందరు గొర్రెలకాపరుల గొర్రెలను మార్చి మార్చి డిండి, దేవరకొండ లబ్ధిదారులకు పంపిణీ చేయడంతో ఇటీవల లబ్ధిదారుల మధ్య జరిగిన గొడవతో అది కాస్తా బట్టబయలైంది. చెవులో పుండ్లు అవుతున్నాయని లబ్ధిదారులు చెవి పోగులు తొలగిస్తున్నారనే సాకుతో గొర్రెలను రీసైక్లింగ్‌ చేయించడంతో అధికారులే సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2017 జూన్‌లో ప్రారంభమైన ఈ పథకం మొదటలో కొంత సవ్యంగా జరిగింది. ఆ తర్వాత అవినీతికి అడ్డు లేకుండా పోయింది. ఒక్క యూనిట్‌కు రూ.14వేల నుంచి రూ.15వేలు ఇస్తేనే పశువైద్యాధికారులు గ్రౌండింగ్‌ చేస్తున్నారు. లేకుంటే అనేక సాకులు చూపుతూ జాప్యం చేస్తున్నారు.

దేవరకొండ నియోజకవర్గంలో 12,387 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా మొదటి విడతలో 6123 మందికి గొర్రెలను అందించాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 4100 మందికే అందజేశారు. డబ్బులు ఇవ్వకపోవంతోనే తమకు పంపిణీ చేయటం లేదని మిగిలిన లబ్ధిదారులు వాపోతున్నారు. కొండభీమనపల్లి గ్రామానికి చెందిన 124 మంది గొల్ల, కుర్మలు ఇప్పటికే డీడీలు కట్టారు. గ్రౌండింగ్‌ కోసం ఎదురుచూసిన వారిలో ఇద్దరు ఇప్పటికే చనిపోయారు. కానీ, నేటికీ పంపిణీ చేయటం లేదు. ఈ మేరకు ఇటీవల లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎదుట వాపోయారు. వెంటనే ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.

జీవాల అక్రమ రవాణాకు దేవరకొండ డివిజన్‌ కృష్ణపట్టి ఏరియా అనువుగా మారింది. పీఏపల్లి, చందంపేట, డిండి మండలాల్లో కృష్ణ పరివాహక ప్రాంతం ఉంది. కొందరు పశువైద్యాధికారులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న దళారులతో ముందస్తు ఒప్పందం ప్రకారం తక్కువ ధరకు గొర్రెలను కొనుగోలు చేసి లబ్ధిదారులకు అప్పగిస్తున్నట్లు ఛాయచిత్రం దిగుతారు. వెంటనే ఆ గొర్రెలను తిరిగి వైద్యాధికారి ముందే లబ్ధిదారునికి కొంత డబ్బు ఇచ్చి దళారి తీసుకుంటారు.  లబ్ధిదారులు గ్రామానికి వచ్చిన తర్వాత దళారులు వారింటికి వెళ్లి గొర్రెలను కొని రోడ్డు రవాణాలో కాకుండా కృష్ణపట్టిలో జలమార్గం ద్వారా పక్కదారి పట్టిస్తున్నారు. దళారులు ఎక్కువగా కంబాలపల్లి, పెండ్లిపాకల, నేరడుగొమ్ము, అజ్మాపురం గ్రామాలకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఓ ప్రజాప్రతినిధి బంధువు ఈ వ్యాపారం కొనసాగిస్తూ దాదాపు రూ.కోటి వరకు గడించినట్లు ఏకంగా ప్రజాప్రతినిధులే చెప్పుకుంటున్నారు. జీవాలను కృష్ణానదిని దాటించే విషయంలో ఇటీవల నేరడుగొమ్ము ఎస్సై క్రాంతికుమార్‌ సస్పెండ్‌ కాగా, హోంగార్డును ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇప్పటికే మడమడక, శేరిపల్లి, టి.గౌరారం, ఉమ్మడి చందంపేట, డిండి మండలాల్లో ఎక్కువగా రాయితీ గొర్రెలు పక్కదారి పట్టాయి. ఈ అవినీతి అక్రమాలు ఉన్నతాధికారులకు తెలిసినా పట్టింపులేదు. దేవరకొండ సబ్‌డివిజన్‌లో పనిచేస్తూ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండే ఓ పశువైద్యాధికారి రూ.కోట్లు గడించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో గొర్రెల కొనుగోలుకు వెళ్లిన పశువైద్యాధికారులకు మద్యం, విందు ఇతర మర్యాదలకు కొదవేలేదు. ఉన్నతాధికారులు లోతుగా విచారణ చేపడితే.. మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.

Related Posts