YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

యూపీ అభివృద్ధి జలాల్లో స్తబ్ధతకు నకిలీ సమాజ్‌వాదీలే కారణం... జన్ చౌపల్ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోడీ

యూపీ అభివృద్ధి జలాల్లో స్తబ్ధతకు నకిలీ సమాజ్‌వాదీలే కారణం...   జన్ చౌపల్ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోడీ

న్యూఢిల్లీ ఫిబ్రవరి 7
సమాజ్‌వాదీ పార్టీ, ఆ పార్టీ సన్నిహతుల కారణంగా ఉత్తరప్రదేశ్ అభివృద్ధి‌కి గండిపడిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సామాన్య ప్రజానీకం అభివృద్ధికి, పేద ప్రజానీకం స్థితిగతులు మెరుగుపరడానికి వాళ్లు చేసిందేమీ లేదని విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లోని బిజనౌర్‌‌లో సోమవారంనాడు ఏర్పాటు చేసిన జన్ చౌపల్ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని వర్చువల్ మీట్‌ ద్వారా మాట్లాడారు. సమాజ్‌వాదీ పార్టీపై, గతంలో ఆ పార్టీ పాలనపై విమర్శలు గుప్పించారు. యూపీ అభివృద్ధి జలాల్లో స్తబ్ధతకు నకిలీ సమాజ్‌వాదీలే కారణమని అన్నారు. తమకోసం, తమ సొంత వాళ్ల దాహం తీర్చేందుకు, స్వలాభం కోసమే వాళ్లు పాటుపడ్డారని, ఆ స్వార్థం వల్లే యూపీలోని అభివృద్ధి జలాల్లో స్తబ్దత ఏర్పడిందని అన్నారు.మరో పాతికేళ్లలో భారత దేశం 100 ఏళ్ల స్వాతంత్వ్యం పూర్తి చేసుకునే సమయానికి యూపీ అభివృద్ధి చరిత్రను తాము (బీజేపీ) తిరగ రాస్తామని, అభివృద్ధిలో యూపీని అగ్రపథంలో నిలుపుతామని ప్రధాని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, రైతుల మేలు కోసం తమ ప్రభుత్వం చేయగలిగినంత సాయం చేస్తూనే ఉంటుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్‌నోర్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని అనుకున్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడం, హెలికాప్టర్ కదలకపోవడంతో ప్రజలను నేరుగా కలుసుకోలేకపోయానని, ఇందుకు క్షమాపణలు చెబుతున్నానని మోదీ అన్నారు. ఆ కారణంగానే తాను వీడియో కాన్ఫరెన్స్‌కే పరిమితం కావాల్సి వచ్చిందని చెప్పారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై మోదీ ప్రశంసలు కురిపిస్తూ, యోగి హయాంలో నేరస్థులు జైళ్లకు పరుగులు తీశారని, తమంత తాముగా లొంగిపోయారని అన్నారు. ఈ నేరశక్తులు ఇంతకాలం ఎన్నికల కోసమే వేచిచూస్తున్నారని, త్వరగా ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారితే జైళ్ల నుంచి బయటపడతామని ఆశలు పెట్టుకున్నారని మోదీ అన్నారు. ''ఒకప్పటి 'మాఫియా రాజ్' ప్రభుత్వం తిరిగి వస్తుందనే ఆశతో వాళ్లు ఉన్నారు. ఈ నేరశక్తులు ప్రభుత్వం మారితే తిరిగి వెనక్కి తిరిగి రావాలనుకుంటున్నాయి. గత ఐదేళ్లుగా మూతపడిన లూటీలు, బందిపోట్ల వల్ల తాము కోల్పోయిన దానిని ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయాలనుకుంటున్నాయి'' అని మోదీ పేర్కొన్నారు. గతంలో మహిళల వేధింపులనేవి షరామామూలు వ్యవహారమని, చైన్ స్నాచింగ్‌లు సర్వసాధారణమని, బతికి ఉండటమే గొప్ప అనుకునేలా ప్రజలు ఉండేవారని, అయితే ఆ భయాల నుంచి మహిళలకు యోగి ప్రభుత్వం విముక్తి కలిగించదని చెప్పారు. మహిళలకు నిజమైన గౌరవం తాము కల్పించామని ప్రధాని అన్నారు. కాగా, వర్చువల్ మీట్‌లో యోగి ఆదిత్యనాథ్ సైతం పాల్గొన్నారు.

Related Posts