మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న ఖిలాడీ సినిమాను సత్య నారాయణ కోనేరు నిర్మించారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై తెరకెక్కుతోంది. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 11న తెలుగు మరియు హిందీ భాషల్లో ఒకేసారి విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సత్యనారాయణ కోనేరు మీడియాతో ముచ్చటించారు.
ఖిలాడి సినిమా కథను రమేష్ వర్మ నాకు చెప్పారు. కథ విన్నప్పుడే నాకు నచ్చింది. ఇది రవితేజ గారికి బాగుంటుందని అన్నాను. ఆయనకు కూడా కథ వినిపించారు. చేస్తాను అని మాటిచ్చారు. రైటర్ శ్రీకాంత్ గారితో డైలాగ్స్ రాయించాం. అయితే సినిమా ప్రారంభించడానికి ఆలస్యమవుతుందని అనుకున్నాం. కానీ వెంటనే సినిమా చేసేద్దామని రవితేజ అన్నారు.
నేను కథను నమ్ముతాను. రాక్షసుడు సినిమా కథను నమ్మాను. అది హిట్ అయింది. ఇందులో కథ బాగుంటుంది. హీరో హీరోయిన్లు కెమెరా ఇదంతా సెకండరీ. కథ బాగుంటేనే సినిమా హిట్ అవుతుంది. మీ కెరీర్‌లో హయ్యస్ట్ కలెక్ట్ చేయాలని ఈ సినిమాను చేస్తున్నానని రవితేజ గారితో చెప్పాను.
రెగ్యులర్ కమర్షియల్ సినిమానే అయినా ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రం. ఇలాంటి పాయింట్‌తో ఇది వరకు సినిమా రాలేదు. కొత్త పాయింట్‌తో రాబోతోంది. బాలీవుడ్ మూవీలా ఉంటుంది. ఇటలీలో కొన్ని షాట్లు తీశాం. వాటిని చూస్తే హాలీవుడ్ రేంజ్‌లో అనిపిస్తుంది. సినిమా ఎంతో స్టైలీష్‌గా ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్‌గా ఉంటాయి.
నా సినిమా మీదు నాకు నమ్మకం ఉంది. సినిమా చూసి ఈ మాట చెబుతున్నాను. అవుట్ కమ్ మీద నాకు కాన్ఫిడెంట్ ఉంది. రాక్షసుడు సినిమా చూసి ఎలాంటి ఫలితం వస్తుందని అనుకున్నానో ఇప్పుడు దాని కంటే ఎక్కువ రిజల్ట్ వస్తుందని నమ్ముతున్నాను.
రమేష్ వర్మ నాకు ఈ సినిమాను చూపించారు. నాకు బాగా నచ్చింది. దీంతో ఏదో ఒకటి ఇవ్వాలనిపించింది. అందుకే ఆ కారును బహుమతిగా ఇచ్చాను. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కాబోతోంది.
ఇతర వ్యాపారాలు, విద్యా సంస్థలున్నా కూడా హవీష్ కోసమే సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాను. హవీష్ కోసమే సినిమాలను నిర్మించాను. హవీష్ కు ఈ ఫీల్డ్‌లోనే ఆసక్తి ఉంది.
ఈ కథను ఆల్ ఇండియా లెవెల్‌లో తీసుకెళ్దామని పెన్ స్టూడియోస్‌తో కలిశాం. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదలవుతోంది.
సినిమా విడుదల విషయంలో నాకు కూడా అనుమానం ఉండేది. అనుకున్న సమయానికి రమేష్ వర్మ అందిస్తాడా? లేదా? అనుకున్నాం. కానీ దీన్నో చాలెంజ్‌లా తీసుకున్నారు. చెప్పిన సమయానికి సినిమాను రెడీ చేసి ఇచ్చారు. ఏపీలో నాలుగు ఆటలకు పర్మిషన్ అడిగాం. అయినా నైజంలో ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేస్తున్నాం. సోలో రిలీజ్‌గానే వస్తున్నాం. ఫిబ్రవరి 25వరకు ఇంకో పెద్ద సినిమా ఏదీ కూడా రాకపోవచ్చు. ఖిలాడీ సినిమాకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడదని నమ్ముతున్నాను.
హవీష్ ప్రస్తుతం సంజయ్ రామస్వామి అనే సినిమాను చేస్తున్నాడు. ఆ స్టోరీ, స్క్రిప్ట్ అద్భుతంగా ఉంటుంది. ఆ తరువాత ఏ స్టూడియోస్ మీద చేస్తున్నాం. రాక్షసుడు 2 కూడా ప్లాన్ చేస్తున్నాం. వంద కోట్ల యోధ అనే పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అనుకుంటున్నాం.
ఏ వ్యాపారం అయినా కూడా నిబద్దత, క్రమశిక్షణతో చేయాల్సి ఉంటుంది. సినిమా కోసం నేను మొత్తం డిజిటల్ పేమెంట్ చేశాను. ఇప్పటి వరకు నేను సినిమా ఇండస్ట్రీలో యాభై శాతం నేర్చుకున్నట్టు అయింది. ఇంకో రెండు మూడు సినిమాలు చేస్తే ఇంకాస్త నాలెడ్జ్ వస్తుంది.
ఇంత వరకు ఇంజనీరింగ్ కాలేజ్‌లు పెట్టాను. కానీ ఇప్పుడు వంద ఎకరాల్లో ఓ యూనివర్సిటీ కట్టాలని అనుకుంటున్నాను. అందులో ఇంజనీరింగ్ కంటే ఎంటర్టైన్మెంట్‌ను ఎక్కువ ఫోకస్ చేయాలని అనుకుంటున్నాను. వరల్డ్ హై క్లాస్ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ యూనివర్సిటీని కట్టాలని అనుకుంటున్నాను.
పెళ్లి చూపులు సినిమాను తమిళంలో రీమేక్ చేశాను హిట్ అయింది. రాక్షసుడు సినిమాను కూడా రీమేక్ చేశాను. అది కూడా హిట్ అయింది. ఖిలాడీ సినిమా కూడా కచ్చితంగా హిట్ అవుతుంది. ఈ సినిమా కాస్త బడ్జెట్ పెరిగినా కూడా బాగా వచ్చింది. రీమేక్ కథను అనుకున్నాం. కానీ అది మధ్యలో ఆపేసి.. ఖిలాడీని లైన్‌లో పెట్టాం. కథకు తగ్గట్టుగా మ్యూజిక్ డైరెక్టర్‌ను పెట్టుకోవాలి. దేవీ శ్రీ ప్రసాద్ అద్బుతమైన సంగీతాన్ని అందించారు. ఇప్పటి వరకు విడుదల చేసిన ఐదు పాటలు హిట్ అయ్యాయి. ఒక్కొక్కరు ఒక్కో టైప్ మ్యూజిక్ ఇస్తుంటారు. హీరోయిన్లు కూడా చక్కగా నటించారు.
ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. హిందీలో కూడా పోటీగా ఏ సినిమా రావడం లేదు. హిందీలో రవితేజ డబ్బింగ్ చెప్పలేదు. కానీ అక్కడ ఎక్కువ మొత్తంలో కలెక్ట్ చేస్తుందని నమ్మకం ఉంది.
సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. U/A సర్టిఫికెట్ లభించింది. ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు హిందీ భాషలలో ఖిలాడి సినిమా విడుదల కానుంది.