ఏలూరు ఫిబ్రవరి 8,
రఘురామ తూచ్ అన్నారు. రాజీనామాపై యూటర్న్ తీసుకున్నారు. తనదైన స్టైల్‌లో తప్పించుకున్నారు. తనపై అనర్హత వేటు వేయించడానికి ఫిబ్రవరి 11 వరకూ గడువిచ్చానని మరోసారి గుర్తు చేశారు. ఆ లోగా వేటు వేయిస్తే సరేసరి. లేదంటే.. తానే రాజీనామా చేస్తానని గతంలో చెప్పిన ఆయన.. ఇప్పుడు మాత్రం కాస్త తిరకాసు పెట్టారు. అనర్హత వేటు వేయించడం తన వల్ల కాదని జగన్ ఒప్పుకుంటే.. అప్పుడు తాను రాజీనామా చేస్తానని కొర్రీ పెట్టారు. అది అయ్యే పని కాదు.. రఘురామ రాజీనామా చేయరని అంటున్నారు. ఇంతకీ రఘురామ స్టాండ్‌లో మార్పుకు కారణం ఏంటి? వ్యూహాత్మకమా? భయమా? వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ అన్నంత పని చేస్తారు. ఆయన రాజీనామాతో నరసాపురంకు ఉప ఎన్నికలు వస్తాయని భావించారంతా. సర్వేలతో అంతా ప్రజానాడి పసిగట్టే పనిలో పడ్డారు. బై ఎలక్షన్ జరిగితే.. తాను 3 లక్షలకు పైగా మెజార్టీతో గెలుస్తానని రఘురామా ధీమాగా ఉన్నారు. సర్వేలు, లెక్కలతో రెడీగా ఉన్నారు. కానీ, అంతలోనే ఏమైందో ఏమోగానీ.. రాజీనామాపై ఆయన తిరకాసు పెట్టారు. అయితే, తానే స్వయంగా రాజీనామా చేస్తే అంతగా సానుభూతి కలిసిరాకపోవచ్చని.. అదే వేటు వేయించుకుంటే.. సింపతీ కొట్టేయొచ్చనేది రఘురామ స్కెచ్‌గా కనిపిస్తోందని అంటున్నారు. ఇప్పటికే స్పీకర్ ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి ఫార్వర్డ్ చేశారు. ఆ నివేదిక రాగానే అటోఇటో తేల్చేసే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అయితే, అందుకు మరికొంత కాలం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. వేటు పడకపోతే నో ప్రాబ్లమ్. ఎప్పటిలానే ఎంపీగా ఢిల్లీలో ఉంటూ.. రచ్చబండతో రోజూ జగన్ అండ్ కో ను కుమ్మేయొచ్చు. నిత్యం పబ్లిక్ టాక్‌లో ఉండొచ్చు. అదే, అనర్హత వేటు పడితే.. ఇక ఎలాగూ తప్పదు కాబట్టి ఉప ఎన్నికల్లో అటోఇటో తేల్చేసుకోవచ్చు. ఎలాగూ అమరావతి ఎజెండా ఉండనే ఉంది. బీజేపీ టికెట్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు. ఇస్తే ఓకే. బీజేపీ, జనసేన పొత్తు ఉంది కాబట్టి.. అటు జనసైనికుల ఓట్లూ తనకు కలిసివస్తాయి. అమరావతి రెఫరెండం కాబట్టి.. టీడీపీ సైతం తనకే మద్దతు ఇచ్చే అవకాశం మెండు. ఒకవేళ బీజేపీ టికెట్ రాకపోతే.. ఇండిపెండెంట్‌గా బరిలో దిగడం.. వైసీపీ మినహా అన్నిపార్టీల సపోర్ట్ సమీకరించడం.. సార్వత్రిక ఎన్నికలకు ముందు నరసాపురం బై ఎలక్షన్‌తో జగనన్నకు ఝలక్ ఇవ్వడం.. ఇదే రఘురామ పొలిటికల్ ఎజెండా అంటున్నారు. అన్నీ ఆయన అనుకున్నట్టే అయితే ఓకే. కాకపోతేనే.....!!