గుంటూరు, ఫిబ్రవరి 8,
ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్‌తో టీమిండియా సంచలనం సృష్టించింది. భారత్ గెలుపులో తెలుగు కుర్రాడిది కీ రోల్. గుంటూరు మిర్చిలాంటి ఆ బ్యాట్స్‌మెన్.. రెండు హాఫ్ సెంచరీలతో ఇరగదీశాడు. అందుకే, ఇప్పుడు గుంటూరు జిల్లాలో షేక్ రషీద్ పేరు మారుమోగిపోతోంది.సెంచరీలు కొట్టే వయసు కాదది. బౌండరీలు దాటే వయసు కూడా కదు. అయినా, రషీద్ గ్రౌండ్‌లో దిగాడంటే పరుగుల వరద పారాల్సిందే. స్కోర్ బోర్డ్ బద్దలవ్వాల్సిందే. ఏడేళ్ల వయసులోనే బ్యాట్ పట్టాడు. తొమ్మిదేళ్లకే అండర్-14 క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇదిగో ఇప్పుడిలా దేశానికే వరల్డ్ కప్ అందించాడు. షేక్ రషీద్‌ది గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని మల్లయపాలెం. తండ్రి బలీషా వలీ లోన్ రికవరీ ఏజెంట్. సంపాదన సరిగా లేకున్నా.. కొడుకుకు క్రికెట్‌పై ఉన్న ఇష్టాన్ని గుర్తించి చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ ఇప్పించాడు. అంతర్ జిల్లాల పోటీల్లో.. పన్నెండేళ్ల వయస్సులోనే ట్రిపుల్ సెంచరీ కొట్టి సత్తా చాటాడు. 2017లో అండర్-16 కేటగిరీలో 674 పరుగులు చేసి ఆ టోర్నీలోనే హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. అండర్-19లో 680 రన్స్‌తో నేషనల్ లెవెల్‌లో రెండో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. లెటెస్ట్‌గా అండర్-19 వరల్డ్ కప్‌లో వీరబాదుడు బాదాడు. వరల్డ్ కప్‌లో రషీద్ ఆడిన నాలుగు మ్యాచ్‌లో రెండు అర్ధ సెంచరీలతో సత్తా చాటాడు. రషీద్ రోజుకు 8 గంటలు శిక్షణ తీసుకునేవాడు. ద్రవిడ్ సలహాలు, సూచనలు, ట్రైనింగ్‌తో మరింత రాటుదేలాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 31 పరుగులు చేసినప్పటికీ రషీద్ తాను అవుటైన తీరుకు తీవ్ర నిరాశ చెందాడు. ఆ మ్యాచ్‌లో జట్టు గెలిచింది. రెండోసారి మ్యాచ్‌కు సిద్ధమవుతున్న సమయంలో కొవిడ్ పాజిటివ్‌గా రావడంతో ఆడే అవకాశం కోల్పోయాడు. సెమీఫైనల్స్‌లో 94 పరుగులతో చెలరేగిపోయాడు. ఫైనల్‌లోనూ అద్భుతంగా ఆడాడు. జాతీయ టెస్ట్ జట్టులో స్థానమే రషీద్ తరువాతి లక్ష్యం..అంటున్నారు. రషీద్ ఆటతో గుంటూరు జిల్లా మురిసిపోతుంది. స్థానికంగా ఆనందోత్సాహాలు మిన్నంటాయి. తన కుమారుడు రషీద్ గొప్పగా ఆడటం గర్వంగా ఉందని తండ్రి బాలీషా సంతోషంతో ఉప్పొంగిపోయారు.