YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పనులు చేయరు.. నీళ్లివ్వరు..

 పనులు చేయరు.. నీళ్లివ్వరు..

 జిల్లాలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు నుంచి దేవరకద్ర, చిన్నచింతకుంట, ధన్వాడ, మరికల్‌ మండలాల్లోని 12వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తున్నారు. కొన్నేళ్ల కిందట కాల్వలు ఏర్పాటు చేయటంతో కాల్వలకు లైనింగ్‌ లేక శిథిలావస్థకు చేరటంతో పాటు, తూములు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. నీటి విడుదల సమయంలో సాగునీరు వృథా కావటంతో చివరి ఆయకట్టుకు నీరందడం ప్రశ్నార్థకంగా మారుతోంది. దీంతో ఈ ఖరీఫ్‌లో సాగునీటి విడుదలకు ముందే కుడి, ఎడమ కాల్వల ఆధునికీకరణను చేపట్టి సాగునీటిని విడుదల చేయాలనే లక్ష్యంతో భారీ నీటిపారుదల శాఖ దేవరకద్ర మండలంలోని ఎడమకాల్వకు రూ.33.70 కోట్లు నిధులను మంజూరు చేసింది.

ధన్వాడ, మరికల్‌, చిన్నచింతకుంట మండలాల్లో ఉన్న కుడికాల్వకు రూ.38 కోట్ల నిధులను మంజూరు చేయాలని అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి పంపించారు. ఇప్పటి వరకు కుడికాల్వకు నిధులు విడుదల చేయలేదు. ఎడమకాల్వకు రూ.33.70 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు పరిపాలన అనుమతులు ఫిబ్రవరిలో వచ్చినప్పటికీ ఇప్పటి వరకు టెండరు ప్రక్రియ మొదలవలేదు. దీంతో ఖరీఫ్‌ నాటికి కాల్వల ఆధునికీకరణ జరిగే పరిస్థితి కనిపించటం లేదు. చివరి ఆయకట్టు ఈ ఖరీఫ్‌లో కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు స్పందించి టెండరు ప్రక్రియ పూర్తి చేసి కాల్వలకు మరమ్మతులు చేపట్టాలని ఆయకట్టుదారులు కోరుతున్నారు. 

ఎడమకాల్వ ఆధునికీకరణ చేసేందుకు రూ.33.70 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు పరిపాలన అనుమతులు ఫిబ్రవరిలో వచ్చాయి. ఆ నిధులతో 24 కిలోమీటర్ల మేర కాల్వకు లైనింగ్‌తో పాటు తూములు మరమ్మతు చేయనున్నారు. అంతేకాకుండా కాల్వ వెడల్పు చేయించి 8 కిలోమీటర్ల మేర అదనంగా కొత్త ఆయకట్టుకు నీటిని అందించేందుకు కాల్వ తవ్వనున్నారు. కొత్తగా కాల్వను తవ్వటంతో దేవరకద్ర మండలం రాజోళి గ్రామం నుంచి చిన్నచింతకుంట మండలంలోని అప్పంపల్లి, ముచ్చింతల, దాసర్‌పల్లి, కురుమూర్తి, తిర్మాలపూర్‌ గ్రామాల్లో 6వేల ఆయకట్టు సాగులోకి రానుంది. దీంతో పాటు ధన్వాడ, మరికల్‌, చిన్నచింతకుంట మండలాలకు సాగునీటిని అందించే కుడికాల్వ ఆధునికీకరణ కోసం నీటిపారుదల శాఖ అధికారులు రూ.38 కోట్ల నిధులను మంజూరు చేయాలని ప్రతిపాదనలు నీటిపారుదలశాఖకు పంపించినప్పటికీ  ఎలాంటి అనుమతులు రాలేదు. ఎడమకాల్వకు నిధులు మంజురైనా టెండర్లు పూర్తికపోవటంతో పాటు, కుడికాల్వకు నిధులు లేకపోవటంతో ఖరీఫ్‌ నాటికి కాల్వల మరమ్మతులు జరిగే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో ఖరీఫ్‌లో ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేసిన కూడా వృథా అయ్యి చివరి ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని ఆయకట్టుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related Posts