ఏలూరు, ఫిబ్రవరి 8.
చేపల చెరువుల యజమానుల దురాగతాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. వేలాది మంది ప్రజానీకం నడిచే ఆర్‌అండ్‌బి రోడ్డును సైతం చేపల చెరువుల గట్టుగా మార్చేస్తున్న పరిస్థితి నెలకొంది. పంట కాలువల్లోకి విచ్చలవిడిగా చేపల చెరువుల నీటిని వదిలేస్తుండటంతో వందల ఎకరాల భూముల్లో రబీలో వరి నాట్లు వేయలేని దుస్థితి ఏర్పడింది. దీంతో రైతులు, ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం.మండల కేంద్రం నిడమర్రు నుంచి అడవికొలను వెళ్లేందుకు మూడు కిలోమీటర్ల ఆర్‌అండ్‌బి రహదారి ఉంది. దశాబ్దకాలంగా ఈ రోడ్డు వేయకపోవడంతో అస్తవ్యస్తంగా తయారైంది. నిడమర్రు గ్రామశివారు నుంచి ఆర్‌అండ్‌బి రహదారికి ఇరువైపులా చేపల చెరువుల తవ్వకాలు జరిగాయి. నిబంధనల ప్రకారం అర్‌అండ్‌బి రహదారిని ఆనుకుని చెరువు తవ్వకాలు చేయాలంటే రోడ్డుకు పదిమీటర్లు ఖాళీ వదిలి చేపల చెరువు గట్టు వేయాల్సి ఉంటుంది. నిడమర్రు నుంచి అడవికొలను వెళ్లే దారిలో చేపల చెరువుల తవ్వకందారులు నిబంధనలు పూర్తిగా పక్కనపెట్టేశారు. మొదట్లో చెరువు తవ్వకం జరిపినప్పుడు కొద్దిమేరే ఖాళీ వదిలారు. అయినప్పటికీ అధికారులు ఏఒక్కరూ పట్టించుకోలేదు. ఇప్పుడు చెరువు రీమోడలింగ్ పేరుతో మరోసారి తవ్వకం చేశారు. ఈసారి మట్టిని మొత్తం ఆర్‌అండ్‌బి రహదారిపై వేసి రోడ్డునే గట్టుగా మార్చేసిన పరిస్థితి నెలకొంది. రోడ్డుకు పక్కగా వేసిన కరెంటు స్తంభాలు సైతం గట్టులో కలిసిపోయాయి. ఈ రోడ్డుగుండా నిత్యం నాలుగైదువేల మంది రాకపోకలు సాగిస్తుంటారు.వర్షాకాలం వస్తే ఆ మట్టి కరిగి రోడ్డుపైకి వస్తే నడిచేందుకు వీలుండదని జనం లబోదిబోమంటున్నారు. అడవికొలను వెళ్లేందుకు తహశీల్దార్, ఎంపిడిఒ, ఆర్‌అండ్‌బి అధికారులు, విఆర్‌ఒలు అంతా ఈ రోడ్డుగుండానే నిత్యం వెళ్తుంటారు. అయినఏఒక్కరూ పట్టించుకున్న దాఖలాల్లేవు. దీంతో చెరువుల యాజమాన్యం నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టేసి రోడ్డునే గట్టుగా మార్చేశారు. వేలాది మంది నడిచే ఆర్‌అండ్‌బి రోడ్డునే ఈ విధంగా కలిపేయడంపై సరత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా అధికారులు రోడ్డుకు పది మీటర్ల వరకూ ఖాళీ చేయించి రోడ్డును కాపాడాలని కోరుతున్నారు. ఆర్‌అండ్‌బి డిఇ డిఎం.కోటేశ్వరరావును వివరణ కోరగా తన దృష్టికి విషయం రాలేదని, సిబ్బందిని పంపించి పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.చేపల చెరువుల యజమానుల ఆగడాలు శృతిమించిపోతున్న పరిస్థితి నెలకొంది. చేపల చెరువుల్లో నిబంధనలకు విరుద్ధంగా రొయ్యల సాగు చేయడం, ఇష్టానుసారంగా ఉప్పునీటి బోరు తవ్వకాలు సాగించేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. రబీ సాగు ఆరంభమయ్యాక రైతులు నారుమడులు వేసి నాట్లకు సిద్ధమవుతుండగా, చేపల చెరువుల్లో నీటిని పంట కాలువల్లోకి ఇష్టానుసారంగా వదిలేస్తున్నారు. దీంతో నిడమర్రు మండలం అడవికొలనులో వందకెరాలకుపైగా సాగుభూమిలో రబీ నాట్లు వేయకుండా వదిలేసిన పరిస్థితి నెలకొంది. భూములన్నీ కొల్లేరుకు ఆనుకుని ఉన్న చిన్న, సన్నకారు రైతుల భూములే. ఇష్టానుసారంగా చేపల చెరువుల్లోని నీటిని వదిలేయడంతో పొలాల్లోకి నీరు చేరి నాట్లు నాటేందుకు వీల్లేకుండాపోయింది. దీంతో రైతులంతా లబోది బోమంటున్నారు. ఇప్పటికే రైతులు నారుమడులు, పొలం బాగు చేయించడానికి ఎకరాకు రూ.మూడు వేలకుపైగా ఖర్చు చేసిన పరిస్థితి నెలకొంది. చేపల చెరువుల్లోని నీటిని ఇష్టానుసారంగా పంటకాలువల్లోకి వదిలేయకుండా చర్యలు తీసుకోకపోతే ముందుముందు పంట పొలాలన్నీ బీడుబీములుగా మారిపోయే పరిస్థితి రానుందనడంలో ఎటువంటి సందేహామూ లేదు.