తిరుమల
సూర్య జయంతిని పురస్కరించుకొని మంగళవారంనాడు తిరుమలలో 'రథసప్తమి' ఉత్సవాన్ని టిటిడి శాస్త్రోక్తంగా నిర్వహించింది. రథసప్తమి వాహనసేవల్లో అత్యంత ప్రధానమైనది సూర్యప్రభవాహనం. ఈ ఏడాది శ్రీవారి ఆలయంలోని ధ్వజ మండపం ముందు శ్రీమలయప్పస్వామివారిని సూర్యప్రభవాహనంపై వేంచేపు చేశారు. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం 6.43 గంటలకు శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు.ఈ వాహనంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.