YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సెల్ఫో గోల్ చేసుకున్నారా...

సెల్ఫో గోల్ చేసుకున్నారా...

హైదరాబాద్, ఫిబ్రవరి 8,
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజేసిన వివాదం ఇటు తెలంగాణ, అటు ఏపీలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజ్యాంగాన్ని తిరగరాయాలన్న కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఒక రోజు భీమ్ దీక్ష చేశారు. దీక్షతో పాటు తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహం నుంచి పార్లమెంట్ భవనం వరకు భీమ్ పాదయాత్ర చేశారు. భీమ్ పాదయాత్రలో ఎంపీలో సోయం బాపురావు, అరవింద్, బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా తెలంగాణ ఇన్ చార్జి మునుస్వామితో పాలు అనేక మంది నేతలు పాల్గొన్నారు.రాజ్యాంగాన్ని తిరగరాయాలన్న కేసీఆర్ వ్యాఖ్యలపై రాజ్యసభలో కూడా దుమారం రేగింది. బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు చేసిన విమర్శలపై రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్, హిందూ అతివాదుల విద్వేషపూరిత ప్రసంగాలు ఎక్కువయ్యాయని కేకే ఆరోపించారు. బీజేపీ పాలనలో సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటోందని, లౌకికతత్వం ప్రమాదంలో పడిందని విమర్శించారు. రాజ్యాంగాన్ని తిరగరాయాలన్న కేసీఆర్ ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు.మరో పక్కన అంబేద్కరీయులు కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఒక పక్కన ఎమ్మార్పీయస్ చీఫ్ మంద కృష్ణ మాదిగ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఇంకో పక్కన తెలంగాణ బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు.
రాజ్యాంగాన్ని మార్చాలన్న భారత రాజ్యాంగ నిర్మాత అంబేదర్కర్ ను అవమానించినట్లే అని దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. కేసీఆర్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీతో పాటు పలు రాజకీయ పార్టీలు, దళిత, ప్రజా సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. శవయాత్రలు కూడా నిర్వహిస్తున్నారు. దళిత ప్రజానీకాన్ని అన్ని విధాలా మోసం చేసిన కేసీఆర్ ను దళిత ద్రోహిగా దళిత ప్రజానీకం పరిగణిస్తున్నారని దళిత మేధావులు, సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు.ఇక.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీలోని కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసరలో ఎమ్మార్పీయస్ నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ఖబర్దార్ కేసీఆర్’ అంటూ ‘అమర్ రహే కేసీఆర్’ అంటూ కేసీఆర్ దిష్టిబొమ్మను ఎమ్మార్పీఎస్ ఎంఎస్ఎఫ్ నాయకులు ఊరేగించారు. ఎమ్మార్పీయస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ ఆదేశానుసారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంచికచర్ల మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు యండ్రాతి కోటేశ్వరరావు మాదిగ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఏ రాజ్యాంగం నీకు హక్కు ఇచ్చిందో మర్చిపోయావా కేసీఆర్ అంటూ ఖబర్దార్ అని హెచ్చరించారు.ఇప్పుడు అదే రాజ్యాంగాన్ని మార్చ మంటావా అని నిప్పులు చెరిగారు.
కేసీఆర్ చేసిన తప్పుడు వ్యాఖ్యలకు దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ క్షమాపణ చెప్పే వరకూ నిరసనలు కొనసాగిస్తామని కోటేశ్వరరావు మాదిగ తెలియచేశారు. మొత్తం మీద రాజ్యాంగాన్ని తిరగ రాయాలంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేసి, ఇటు తెలుగు రాష్ట్రాల్లో, అటు జాతీయ స్థాయిలో కెలుక్కున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.

Related Posts