YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

ఇజ్రాయెల్ ప్రభుత్వం మెడకు చుట్టుకున్న పెగాసస్ సాఫ్ట్ వేర్ వ్యవహారం

ఇజ్రాయెల్ ప్రభుత్వం మెడకు చుట్టుకున్న పెగాసస్ సాఫ్ట్ వేర్ వ్యవహారం

న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 8
చివరకు అటు చేసి ఇటు చేసి పెగాసస్ సాఫ్ట్ వేర్ వ్యవహారం ఇజ్రాయెల్ ప్రభుత్వం మెడకే చుట్టుకుంది. ప్రపంచంలోని అనేక దేశాలకు ఇజ్రాయెల్ కు చెందిన పెగాసస్ స్పై సాఫ్ట్ వేర్ అందించిన విషయం తెలిసిందే. ఆ సాఫ్ట్ వేర్ ఆధారంతోనే మనదేశంలోని అత్యంత ప్రముఖులు 300 మంది మొబైల్ ఫోన్లపై నరేంద్ర మోడీ సర్కార్ ట్యాపింగ్ చేయిస్తోందనే దుమారం అందరికీ తెలిసిందే. మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తోందనే విషయాన్ని కేంద్రం అంగీకరించకపోయినా ట్యాపింగ్ జరుగుతోందనే విషయం దాదాపు అందరికీ అర్ధమైపోయింది. ట్యాపింగ్ విషయమై సుప్రీంకోర్టు విచారణ చేయిస్తోంది. ఇలాంటి సమయంలోనే అసలు పెగాసస్ సాఫ్ట్ వేర్ సృష్టికర్త అయిన ఇజ్రాయెల్ ప్రభుత్వం మెడకే చుట్టుకుంది. మాజీ ప్రధానమంత్రి నెతన్యాహూ కొడుకు ప్రభుత్వ ఉన్నతాధికారులు సైన్యాధికారులు పాత్రికేయులు పారిశ్రామికవేత్తల ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయనే విషయాన్ని ఆ దేశానికి చెందిన ఒక మీడియా బయటపెట్టింది. సదరు మీడియా కథనాలపై పెద్ద గొడవ మొదలవ్వటంతో చేసేదిలేక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రభుత్వానికి తెలీకుండా పోలీసులే సొంతంగా మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారా అనే ప్రశ్నలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే నిజంగానే పోలీసులు మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నట్లయితే ఆ విషయాన్ని సీరియస్ గానే తీసుకోవాలని ప్రజా భద్రతా శాఖ మంత్రి ఒమర్ బర్గేవ్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. నెతన్యాహూ కొడుకు మొబైలే కాకుండా ఆయన మద్దతుదారులు సలహాదారుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేస్తున్నట్లు సదరు మీడియా ప్రచురించింది. మొత్తానికి పెగాసస్ స్పైవేర్ ద్వారా ఇతర దేశాల్లో ఇజ్రాయెల్ పెడుతున్న చిచ్చు చివరకు దాని మెడకే చుట్టుకుంది. అందుకనే పెద్దలు చెడపకురా చెడేవు అని చెప్పేవారు. మనదేశంలో రాహుల్ గాంధీ కొందరు జడ్జీలు పాత్రికేయులు సామాజిక కార్యకర్తలు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ లాంటి అనేకమంది మొబైళ్లను కేంద్రం ట్యాప్ చేస్తోందనే ఆరోపణలపై ఒకపుడు పార్లమెంటు అట్టుడికిపోయింది. ఇంత జరిగినా ట్యాపింగ్ జరగలేదని కానీ పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనలేదని కానీ ప్రభుత్వం డైరెక్టుగా చెప్పటం లేదు. అందుకనే సాఫ్ట్ వేర్ కొనుగోలు వాస్తవమే అని అందరికీ అర్ధమైపోయింది.

Related Posts