విజయవాడ, ఫిబ్రవరి 9,
రాష్ట్ర విద్యుత్ రంగం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. జెన్‌కో ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. డిస్కమ్‌ల నుంచి తమకు డబ్బులు రాకపోవడంతో ఉద్యోగులకు, పెన్షనర్లకు జనవరి వేతనాలు చెల్లించలేదని జెన్‌కో ఉన్నతాధికారులు చెబుతున్నారు. జీతాలు ఎప్పుడు పడతాయో కూడా చెప్పలేమని అంటున్నారు. డిసెంబరు పెన్షన్‌ను కూడా పెన్షనర్లకు జనవరి 12వ తేదీన జెన్‌కో చెల్లించింది. రోజువారీ విద్యుత్ అవసరాల కోసం పవర్ మార్కెట్‌లో కొనుగోలు చేసేందుకు కూడా డబ్బులు లేని ఆర్థిక ఇబ్బంది విద్యుత్ సంస్థల్లో నెలకొందని అధికారులు చెబుతున్నారు. దీంతో శుక్రవారం కూడా రాష్ట్రంలో విద్యుత్ కోతలు కొనసాగాయి. ప్రభుత్వం నుంచి డిస్కమ్‌లకు రావాల్సిన నిధులు రాకపోవడమే కాకుండా పాత బకాయిలు కూడా పేరుకుపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. నెలవారీ ఇవ్వాల్సిన నిధులను కూడా చెల్లించకపోవడం వల్ల డిస్కమ్‌లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని విద్యుత్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టిపిసి)కు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదు. తమకు చెల్లించాల్సిన రూ.398 కోట్ల బకాయిలను చెల్లించాలని ఎన్‌టిపిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక, ఇంధన శాఖలకు రెండు నెలల నుంచి లేఖలు రాసుకుంటూ వచ్చింది. విద్యుత్ నిలిపివేస్తామని హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం నిధులు చెల్లించకపోవడంతో గురువారం నుంచి 2 వేల మెగావాట్ల సరఫరాను ఎన్‌టిపిసి నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ కారణంతో రాష్ట్రంలో గురువారం నుంచి మొదలైన కరెంట్ కోతలు శుక్రవారం కూడా కొనసాగాయి. అయితే శుక్రవారం నుంచి డిస్కమ్‌లు హిందూజా పవర్ స్టేషన్ నుంచి విద్యుత్ తీసుకున్నాయి. తక్కువ ధరకే హిందూజాలో విద్యుత్ వస్తున్నా.. బయట ఎందుకు కొనుగోలు చేశారంటూ సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై అక్షింతలు వేసిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పుతో హిందూజా నుంచి 1000 మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్ ధర రూ.3.82లకు కొనుగోలు చేస్తున్నాయి. దీంతో విద్యుత్ సరఫరా కొంత మెరుగుపడినా కోతలు మాత్రం కొనసాగాయి. వ్యవసాయ వినియోగదారులకు మాత్రం నాలుగు గంటలే విద్యుత్ అందింది.వ్యవసాయ, ఎస్‌సి, ఎస్‌టి, బిసిల వినియోగదారులతోపాటు మరికొన్ని రంగాలకు డిస్కమ్‌లు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.1400 కోట్లు వరకు చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే రెండు నెలల నుంచి ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. వినియోగదారుల నుంచి బిల్లుల రూపంలో వస్తున్న రూ.2 వేల కోట్లను డిస్కమ్‌లు నెట్‌వర్క్‌కు, మార్కెట్‌లో విద్యుత్ కొనుగోలుకు, లెటర్ ఆఫ్ క్రెడిట్ కింద ఇతర ఉత్పత్తిదారులకు చెల్లిస్తున్నాయి.విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లలో సాంకేతిక సమస్యలు శుక్రవారం కూడా కొనసాగాయి. విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్‌టిటిపిఎస్), నెల్లూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్‌డిఎస్‌టిపిఎస్) ప్లాంట్లలో నెలకొన్న సాంకేతిక లోపాలు వల్ల 1510 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. శుక్రవారం రాత్రికి గానీ, శనివారం ఉదయానికి గానీ ఎన్‌టిటిపిఎస్‌లోని 500, 210 మెగావాట్ల యూనిట్లు, ఎస్‌డిఎస్‌టిపిఎస్‌లోని 800 మెగావాట్ల యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని జెన్‌కో అధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్లాంట్లలో బొగ్గు కొరత కూడా నెలకొంది. బొగ్గు ప్లాంట్లలో కనీసం 15 రోజులకు సరిపడా బొగ్గు నిబంధనల ప్రకారం ఉండాలి. కానీ ఎన్‌టిటిపిఎస్, ఎస్‌డిఎస్‌టిపిఎస్, ఆర్‌టిపిఎస్ ప్లాంట్లలో కేవలం 3 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.