ఏపీ అధికార పార్టీ టీడీపీలో కొత్త గుబులు పట్టుకుంది. రాష్ట్రంలో చంద్రబాబు పాలన చేపట్టి నాలుగేళ్లు గడిచిపోయింది. ఆయన టీం ఎన్నికల్లో గెలిచి కూడా నాలుగేళ్లు పూర్తయింది. ఈ నాలుగేళ్ల కాలంలో కేవలం 13 మంది మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజల్లో నిత్యం ఉంటున్నారని, ప్రజల సమస్యలను పట్టించుకుంటున్నారని, ప్రజలతో మమేకం అవుతున్నారని తేలిపోయింది. ప్రజలు చెప్పిన సమాధానం ఆధారంగా చంద్రబాబు వారికి మార్కులు ఇచ్చారు. 70 మార్కులు వచ్చిన కేవలం 13 మంది మాత్రమే ఉండడం విస్మయానికి గురి చేసిన విషయం. ఇక, 60 శాతం మార్కులు వచ్చిన వారిలో మంత్రి దేవినేని ఉమ వంటి కీలక నేతలు ఉండడం కూడా ఆశ్చర్య పరుస్తోంది. పోలవరం, పట్టి సీమ ప్రాజెక్టుల కోసం తాను తన కుటుంబానికి కూడా దూరమయ్యానని దేవినేని ఉమా పలుమార్లు పేర్కొన్నారు. మరి అలాంటి నేతలకు చంద్రబాబు ఇచ్చిన మార్కులు మింగుడు పడడంలేదు.ఇదెవరో విపక్షం నాయకులు వెల్లడించిన అంశం కాదు. సాక్షాత్తు.. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబే స్వయంగా వెల్లడించిన విషయం. చంద్రబాబుకు ప్రస్తుతం టీడీపీ+వైసీపీ జంపింగ్‌లతో కలిపి 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని వీరు పెద్ద ఎత్తున చెప్పగల ధీరులు కూడా. కీలక శాఖలను పర్యవేక్షిస్తున్న మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి వంటి వారు ప్రజలకు చేరువ కాలేక పోతున్నారా ? కేవలం పరిపాలనా అంశాలతోనే కాలం వెళ్లదీస్తున్నారా? అంటే సమాధానం లబించడం లేదు. చంద్రబాబు ఇటీవల నిర్వహించిన సర్వేలో ఇదే విషయాలపై ఆయన ప్రజల నుంచి సమాచారం రాబట్టారు. ప్రజల్లో ఉంటున్న నాయకులు ఎంత మంది? ఎంత మేరకు ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారు? ఎంత మేరకు వారు ప్రజల్లో కలసి తిరుగుతున్నారు? అని ప్రజల నుంచే సమాధానాలు రాబట్టారు. ముఖ్యంగా చంద్రబాబు పిలుపునిస్తున్న పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను సైతం ఎంత మంది సమర్ధంగా ముందుకు తీసుకు వెళ్తున్నారనే అంశాలను కూడా ఆయన రాబట్టారు. ఇక, ఈ మార్కుల విషయంలో కొందరు ఎమ్మెల్యేలు పెదవి విరుస్తుండడం గమనార్హం. తాము ఎంతో కష్టపడుతున్నామని, అయినా కూడా కొన్ని కారణాల వల్ల ప్రజలు టీడీపీపై వ్యతిరేకంగా ఉన్నారని, ఈ విషయాలు చెబితే.. అధినేతకు కోపం వస్తుందని అందుకే మౌనంగా ఉన్నామనే నాయకులు కూడా మీడియా ముందుకు వచ్చారు.నిజానికి వల్లభనేని వంశీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అదేవిధంగా ధూళిపాళ్ల నరేంద్ర పార్టీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రవేశాలు వెళ్లగక్కుతు న్నారు. ఇక, ప్రజల్లోను, మీడియాలో తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు, చేష్టలతో నిత్యం వార్తల్లో నిలిచే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు కూడా చంద్రబాబు 70 మార్కులు వేయడంపై పార్టీలోనే విస్మయం వ్యక్తమవుతోంది. షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ప్రభుత్వంతో చర్చించాలని ప్రయత్నించిన వంశీకి చేదు అనుభవం ఎదురైంది. అప్పటి నుంచి ఆయన అమరావతి మొహం కూడా చూడలేదు. ఇక, మంత్రి వర్గంలోనో లేదా స్పీకర్‌గానో అవకాశం వస్తుందని భావించిన ధూళిపాళ్లకు నిరాశ ఎదురుకావడంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. కానీ, వీరికి చంద్రబాబు 70 మార్కులు వేశారు. ఇదెలా సాధ్యమని అడుగుతున్నవారు కూడా ఉన్నారు. ఇదే సమయంలో నిత్యం ప్రజల్లో ఉంటున్న చాలా మంది ఎమ్మెల్యేలతో పాటు సీనియర్లను బాబు విస్మరించారా? అని ప్రశ్నిస్తున్నవారూ ఉన్నారు. మొత్తానికి బాబు మార్కులు.. నేతల్లో మార్పులు తేకపోగా.. అసంతృప్తి, ఆగ్రహం పెల్లుబికేలా చేస్తున్నాయి.