జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం హెచ్‌డీ కుమార స్వామి.. ఎన్నికలు ముగిసిన కర్ణాటకలో కీలకంగా మారారు. ఇప్పుడు ఈయన చుట్టూనే.. ప్రధాన రాజకీయ దిగ్గజాలు సైతం ప్రదక్షిణలు చేస్తున్నారు. దేశంలో తీవ్ర ఉత్కంఠను రేపిన కర్ణాటక ఎన్నికల ఫలితాల విడుదలకు రేపు ఒక్కరోజు మాత్రమే గడువున్నా.. నాయకులు మాత్రం కొన్ని యుగాలు ఉన్నట్టుగా ఫీలవుతున్నారు. కొందరు ఈ టెన్షన్ తట్టుకోలేక.. విహార యాత్రలకు వెళ్లిపోయారు. మరికొందరు తమ ఫోన్లను స్విచాఫ్ చేసేశారు. ఇలా.. ఎక్కడ చూసినా.. టెన్షన్.. టెన్షన్.. అయితే, ఈ క్రమంలోనే బీజేపీకి 100; కాంగ్రెస్ కు 86 సీట్లు మాత్రమే వస్తున్నాయంటూ వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ నివేదికలు దేశవ్యాప్తంగా హోరెత్తిస్తున్నాయి.ప్రధాన సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్‌లో మెజార్టీ సర్వేలు బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తాయని చెపుతున్నాయి. ఓవరాల్‌గా మాత్రం కన్నడనాట హంగ్ వస్తుందన్నదే ఓ క్లీయర్ పిక్చర్ వచ్చేసింది. వాస్తవానికి కర్ణాటకలో అధికారాన్ని చేపట్టాలంటే ఏ పార్టీ అయినా 112 స్థానాలు సాధించాలి. కానీ, ఆ పరిస్థితి ప్రధాన జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు ఇరు పార్టీలకూ కనిపించడం లేదు.
జేడీఎస్.. బీజేపీతో చేతులు కలపకుండా ఉండేందుకు అవకాశమే లేదని అంటున్నారు పరిశీలకులు. దీనికి ప్రధానంగా రెండు రీజన్లు కనిపిస్తున్నాయి. బీజేపీ వస్తే.. కుమార స్వామికి డిప్యూటీ లేదా రెండున్నరేళ్లు, రెండున్నరేళ్లు అన్నట్టుగా అధికారం పంచుకునే చాన్స్ ఉంటుంది. 2019లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే.. అప్పుడు కూడా జేడీఎస్‌కు ప్రాధాన్యం కల్పిస్తారు. మొత్తంగా ఇప్పడు కుమార స్వామి సీఎం మేకర్‌గా మారారని అంటున్నారు విశ్లేషకులు. ఏదో ఒక పార్టీతో జట్టుకట్టి అధికారంలోకి రాకపోతే రాజకీయ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందన్న అంచనాలో కుమారస్వామి ఉన్నారు.అంతేనా, ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, మధ్య కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటకల్లో బీజేపీ పైచేయి సాధిస్తే.. కోస్తా కర్ణాటక, ముంబై కర్ణాటక, పాత మైసూరు ప్రాంతాల్లో కాంగ్రెస్ అధిక స్థానాలు సాధించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.అంటే ఈ రెండు పార్టీలు ఎంతగా విరుచుకుపడినా.,. మేజిక్ ఫిగర్‌ను మాత్రం చేరుకునే ప్రసక్తే లేదని స్పష్టమైంది. ఆటలో అరటి పండు మాదిరిగా ప్రాంతీయ పార్టీ జేడీఎస్ కీలకంగా మారిపో యింది. మరోపక్క ఇండిపెండెంట్ల హవా కూడా భారీ ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలో కన్నడ నాట సీఎంను నిర్ణయించేది ఎవరు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ‘కాంగ్రెస్ ముక్త భారత్’లో భాగంగా మోడీ, అమిత్ షా అన్ని రకాలుగా జేడీఎస్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. దీంతో జేడీఎస్‌పైకి మాత్రం బీజేపీతో కలవబోమని చెబుతున్నా.. ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు, పార్టీ క్రియాశీలత వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటే.. జేడీఎస్ రాష్ట్ర చీఫ్.. బీజేపీతో జట్టుకట్టే అవకాశమే మెండుగా ఉంటుంది.ఎన్నికలకు రెండు రోజుల ముందు ఈ ఎన్నికల్లో తనను గెలిపించకపోతే తన చావును చూస్తారని కూడా తీవ్రస్థాయిలో ప్రసంగించారు. దేవగౌడను ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో పొగడడం ఓ ఎత్తు అయినా అది బీజేపీకి ఓట్లు రాల్చలేకపోయింది. దేవగౌడ తాము బీజేపీతో కలవం అని స్ట్రాంగ్‌గానే చెప్పారు. అయితే కుమారస్వామి మాత్రం అధికారమే పరమావధిగా బీజేపీతో కలిసేందుకు రెడీగానే ఉన్నట్టు కన్నడ పొలిటికల్ టాక్. ఒకవేళ జేడీఎస్ బీజేపీతో కలిస్తే అది జేడీఎస్ లౌకికవాదాన్ని ప్రశ్నించేదిగా ఉంటుంది. మరి కన్నడ అధికార పీఠం ఎవరిని వరించనుందో మంగళవారం వరకు వెయిట్ చేయక తప్పేలా లేదు.