రాజమండ్రి, ఫిబ్రవరి 10,
వారిద్దరూ మిత్రులు కాదు. అలా అని శత్రువులు కారు. ఒకరు అధికారపార్టీ అని చెప్పుకొంటున్న ఎమ్మెల్యే. ఇంకొకరు టీడీపీ నేత. అకస్మాతుగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. దెప్పిపొడుపు మాటలతో తమలోని కళను బయటపెడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని రాజోలు రాజకీయాలు ఒక్కసారిగా వాడీవేడిగా మారిపోయాయి. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మధ్య ఒక్కసారిగా మాటల యుద్ధం మొదలైంది. రాపాక జనసేన నుంచి గెలిచి.. ప్రస్తుతం అధికార వైసీపీకి చేరువయ్యారు. గొల్లపల్లి టీడీపీ నేత. ఎప్పుడూ కనీసం పార్టీలపై విమర్శలు చేసుకోని ఈ ఇద్దరు నాయకులకు ఏమైందో ఏమో.. ఒకరినొకరు దూషించుకోవడం మొదలుపెట్టారు.టీడీపీ సమావేశంలో పాల్గొన్న గొల్లపల్లి.. ఎమ్మెల్యే రాపాకపై విరుచుకుపడ్డారు. రిపబ్లిక్ డే సందర్భంగా రాజోలు మండల టీడీపీ అధ్యక్షుడిని జాతీయ జెండా ఎగరేయకుండా అడ్డుకున్నారని ఎమ్మెల్యే రాపాకపై ఫైర్ అయ్యారు గొల్లపల్లి. ఈ విమర్శలకు రాపాక సైతం ఘాటుగానే స్పందించారు. అలా మొదలైన మాటల తూటాలు రాజోలు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఒకరు ప్రస్తుతం జరుగుతున్న అవినీతిని బయటపెడితే.. మరొకరు గతంలో జరిగిన అక్రమాలను వెలుగులోకి తెస్తున్నారు. ఇద్దరు నాయకులు ప్రస్తావిస్తున్న ఆ అంశాలే ప్రస్తుతం ఆసక్తికర చర్చగా మారాయి.ఎమ్మెల్యే రాపాక 70 కోట్లతో ఇల్లు కట్టుకుంటున్నారని ఆరోపించిన గొల్లపల్లి.. నిర్మాణం కోసం ఇసుక, ఐరన్ ఎక్కడి నుంచి బలవంతంగా తీసుకొచ్చారో తనకు తెలుసన్నారు. ఆ పేర్లను మాత్రం బయటపెట్టబోనని ట్విస్ట్ ఇచ్చారు. జనసేన నుంచి గెలిచి.. కాళ్ల పారాణి ఆరక ముందే వైసీపీలో చేరిన రాపాక.. రాజోలును ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు మాజీ మంత్రి. గతంలో తాను ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలోనే అభివృద్ధి జరిగిందని తెలిపారాయన. చివరకు రాపాక సొంతూరు చింతలమోరిలోని ఆయన ఇంటికి కూడా తానే రోడ్డు వేయించానని కామెంట్ చేశారు గొల్లపల్లి. గతంలో మల్కిపురంలో రాపాక పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారని.. అప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోలీసులతో మాట్లాడి కేసు లేకుండా చేశారని గొల్లపల్లి ఆరోపించారు.గొల్లపల్లి విమర్శలు.. ఆరోపణలతో ఉలిక్కిపడిన ఎమ్మెల్యే రాపాక.. వెంటనే కౌంటర్లు మొదలుపెట్టారు. ఎమ్మెల్యేగా రాజోలులో గొల్లపల్లి ఇసుక దోపిడీ చేశారని.. రోడ్ల పనులు, ప్రభుత్వ ఉద్యోగుల పోస్టింగ్‌లలో ప్రతిదానికీ రేటుకట్టి వసూలు చేసేవారని ఆరోపించారు రాపాక. ఏ నియోజకవర్గంలోనూ గొల్లపల్లి రెండోసారి గెలిచిన దాఖాలు లేవని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒక నియోజకవర్గమంటూ లేని నేతగా మాజీ మంత్రిని కార్నర్ చేశారు రాపాక. తన పేకాట వ్యవహారాలను ప్రస్తావించటంపై మండిపడిన ఆయన.. విస్తుపోయే విషయాలనూ బయటపెట్టారు. గతంలో గొల్లపల్లి సూర్యారావు పేకాట ఆడేందుకు రావులపాలెం నుంచి రాజోలుకు వచ్చేవారనీ… తనతో పేకాడిన సందర్భాల్లో ఓడిపోతే డబ్బులు కూడా ఇచ్చేవారు కాదనీ సంచలనం రేపారు రాపాక. ఈ ఆరోపణలు.. కౌంటర్లు చూశాక.. రాజోలులో ప్రస్తుతం పేకాటపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు.ఇద్దరి మాటల్లో వాస్తవాలు ఎలా ఉన్నా.. రాపాక, గొల్లపల్లి ఇద్దరూ పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నిస్తూ పరువు తీసుకుంటున్నారని అనుచరులు చర్చించుకుంటున్నారట. ఇద్దరి మధ్య విభేదాలు లేకపోయినా.. ఒక్కసారిగా వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం.. అవి శ్రుతిమించడం చూశాక.. రానున్న రోజుల్లో ఇంకేం బయటపెడతారో అనే ఉత్కంఠ రాజోలు జనాల్లో ఉందట.