న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10,
దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చే న్యూస్ అందించింది. ఇకపై దేశంలో ఏ సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించినా కేంద్రం నుంచి 60 శాతం మాత్రమే నిధులు వస్తాయని స్పష్టం చేసింది. మిగిలిన 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. అంతేకాకుండా నిబంధనల ప్రకారం రాష్ట్ర వాటా నిధులు విడుదల చేసి ఖర్చు చేస్తేనే… కేంద్రం నుంచి తదుపరి నిధులు విడుదల అవుతాయని తెలిపింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిందికాగా ఇప్పటివరకు జాతీయ హోదా లభించిన సాగునీటి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు సమకూర్చేది. ఇకపై కేంద్రం వాటా 60 శాతానికి తగ్గిపోవడమే కాకుండా కేంద్రం నుంచి రాష్ట్రాలు పొందే నిధుల ప్రక్రియ సైతం మరింత క్లిష్టంగా తయారుకానుంది. ఒకవేళ సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించడానికి అన్ని అర్హతలు ఉన్నా ఆ సమయంలో నిధుల అందుబాటు, ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టి నిర్ణయం ఉంటుంది తప్ప జాతీయ హోదా కల్పించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కేంద్రం తాజా నిబంధనలతో ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు 60 శాతం నిధులు మాత్రమే విడుదలయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అయితే 8 ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకాశ్మీర్, లడాఖ్‌లలో మాత్రమే జాతీయ ప్రాజెక్టులకు కేంద్రం 90 శాతం నిధులు జారీ చేయనుంది.