YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

పంజాబ్ ఎన్నికల్లో డేరా బాబా ప్రభావం..

పంజాబ్ ఎన్నికల్లో డేరా బాబా ప్రభావం..

ఛండీఘడ్, ఫిబ్రవరి 10,
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు రెండు వారాల ముందు హర్యానా ప్రభుత్వం వివాదాస్పద డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌ను మూడు వారాల పాటు ఫర్లాపై విడుదల చేయడం రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. రెండు హత్యలు, రెండు అత్యాచారం కేసుల్లో దోషిగా తేలి 2017 నుంచి రోహ్‌తక్ జిల్లాలోని సునారియాలో జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు డేరా బాబు. అయితే, రామ్ రహీం విడుదలపై హర్యానా ముఖ్యమంత్రి స్పందించారు. పంజాబ్ ఎన్నికలకు, డేరా బాబా విడులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రామ్ రహీం విడుదల యాదృచ్ఛికమని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు.అయితే, డేరా బాబా(రామ్ రహీం) విడుదల సందర్భంగా ప్రభుత్వం కొన్ని కండీషన్లు పెట్టింది. గురుగ్రామ్‌లోని తన ఫామ్‌హౌస్‌లో ఉండాలని, సిరా(హర్యానా)లోని డేరా ప్రధాన కార్యాలయానికి వెళ్లొద్దని స్పష్టం చేసింది. అనుచరులతో ఎలాంటి సభలు, సమావేశాలు కూడా నిర్వహించొద్దని షరతు పెట్టింది. అయితే, ఇప్పటికే మూడు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించిన డేరా బాబా.. సత్ప్రపవర్తన కారణంగా ఫర్లా పై విడుదలయ్యారు.(పరిమితితో కూడిన విడుదల. (పెరోల్, ఫర్లా ‌కి మధ్య తేడా ఉంటుంది. దీర్ఘకాలిక జైలు శిక్ష పడిన వారు.. మూడు సంవత్సరాల శిక్ష అనుభవించిన తరువాత ఫర్లాకు అర్హులు అని హర్యానా ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు. రామ్ రహీమ్ విడుదలపై శ్రీ గురుద్వారా పర్బంధక్ కమిటీతీవ్రంగా స్పందించింది. హర్యానా నిర్ణయం పంజాబ్ రాష్ట్రంలో మత సామరస్యానికి విఘాతం కలిగిస్తోందని, తక్షణమే డేరా బాబాకు ఇచ్చిన ఫర్‌లాఫ్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఎస్‌జిపిసి చీఫ్ హర్జిందర్ సింగ్ ధామి. సిక్కుల మతపరమైన మనోభావాలను దారుణంగా దెబ్బతీసిన వ్యక్తి డేరా బాబా అని ధామి తీవ్రమైన కామెంట్స్ చేశారు. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండూ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఇక పంజాబ్‌ హోంమంత్రి సుఖ్‌జీందర్ సింగ్ కూడా రామ్ రహీం విడుదలపై తీవ్రంగా స్పందించారు. అత్యాచారం వంటి క్రూరమైన నేరాలకు పాల్పడిన వ్యక్తులకు పెరోల్‌, ఫర్‌లాఫ్‌పై విడుదల చేయొచ్చనే నిబంధన ఎక్కడా లేదని అన్నారు. రామ్ రహీంను కావాలనే విడుదల చేశారని ఆరోపించారు.ఇదిలాఉంటే.. పంజాబ్ ఎన్నికల్లో డేరా బాబా ప్రభావం తప్పక ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన సూచనలు పాటించేవారు ఇప్పటికీ చాలా మంది ఉన్నారని అంటున్నారు. బహుళ కోణాల్లో పరిశీలిస్తే.. కొన్ని స్థానాల్లో ప్రభావం చూపుతుందని అంటున్నారు. ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలోని మాన్సా, బటిండా, ఫరీద్ కోట్, ఫజిల్కా, ముక్త్సార్, మోగా, బర్నాల్, సంగ్రూర్, మాల్వా ప్రాంతాల్లో డేరా ప్రభావం ప్రత్యక్షంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా 24 కు పైగా నియోజకవర్గాల్లో డేరా బాబా అనుచరులు ఉన్నారు. రాష్ట్ర రాజకీయాలపై ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది. అంతేకాదు.. డేరా ఏ పార్టీకి, అభ్యర్థులకు మద్ధతు ఇవ్వాలో నిర్ణయించడానికి దాని రాజకీయ వ్యవహారాల కమిటీ కూడా ఉంది. అయితే, పంజాబ్‌లో పోలింగ్‌కు మరో 12 రోజులు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో రామ్ రహీమ్ విడుదలపై అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. రామ్ రహీం పంజాబ్ ఎన్నికల్లో చక్రం తిప్పుతాడా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇక గత నెలలో భటిండా జిల్లాలోని సలాబత్‌పురాలో జరిగిన డేరా సచ్చా సౌదా కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. చాలామంది రాజకీయ నాయకులు డేరా రెండవ గురువు పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్లినట్లు చెప్పినప్పటికీ.. రాజకీయ లబ్ధి పొందేందుకు వారి ప్రయత్నాలు వారు సాగించినట్లు తెలుస్తోంది. డేరా ఏ పార్టీకి అధికారికంగా మద్ధతు ఇవ్వనప్పటికీ.. పరోక్షంగా బీజేపీ-పీఎల్‌సీ, ఎస్‌డీ(సంయుక్త్) కూటమికి ప్రాధాన్యత ఇవ్వవచ్చని విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇక పంజాబ్ ఎన్నికల్లో తన సత్తా చాటాలని బీజేపీ గట్టిగా కృషి చేస్తోంది. బీజేపీ అగ్ర నేతలతో పాటు.. కొందరు కేంద్ర మంత్రులను కూడా ప్రచార రంగంలోకి దింపింది. ఇక ప్రధాని మోదీ సైతం వర్చువల్‌ ప్రసంగాలు ఇస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇక డేరా అనుచరులలో ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులతో పాటు.. సమాజంలో పేద, దళిత, వెనుకబడిన తరగతులకు చెందిన వారు ఉన్నారు. డేరా రాజకీయ కమిటీ, డేరా చీఫ్ నుంచి ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఆదేశం వచ్చినా.. ఆ ఆదేశం ఎన్నికలపై ప్రభావం చూపనుందని విశ్లేషకుల భావన. ఈ నేపథ్యంలోనే డేరా ఆశ్రమ చీఫ్‌ మద్ధతు పొందేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే రామ్ రహీం ను విడుదల చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.రంగంలోకి కాంగ్రెస్.. ఇక రామ్ రహీం విడుదలతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది. దళితుల ఓట్లను కాపాడుకునేందుకు కోర్ మాల్వా బెల్ట్‌లోని బదౌర్ స్థానం నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ బరిలోకి దింపింది. చమ్కౌర్ సాహిబ్ నుంచి కూడా చన్నీ పోటీ చేస్తున్నారు. పార్టీతో పాటు.. ప్రజల్లోనూ గందరగోళం లేకుండా కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా చన్నీని ఇప్పటికే ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. పంజాబ్ జనాభాలో దాదాపు 33 శాతం ఉన్న ఎస్సీ కమ్యూనిటీపై ఇది పెద్ద ప్రభావం చూపుతుంది.గత లెక్కలు చూస్తే డేరా ప్రభావం అంతంతే.. ఏదేమైనప్పటికీ.. డేరా ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుందని గత ఉదాహరణకు చెబుతున్నాయి. 2007, 2012 అసెంబ్లీ ఎన్నికలలో డేరా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. అయితే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2017లో డేరా అధినేత అప్పటి అకాళీదళ్ కూటమికి మద్దతిచ్చాడు. అయితే ఆ కూటమి కాంగ్రెస్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌ను పెరోల్‌పై కాకుండా ఫర్లాపై విడుదలయ్యాడు. వాస్తవానికి ఖైదీని పెరోల్‌పై విడుదల చేయడం చూశాం. కానీ, ఫర్లా అనేది చాలా అరుదుగా ఇస్తారు. ఖైదీని పెరోల్‌పై కంటే ఫర్లాలో విడుదల చేయడం సులభం. రామ్ రహీమ్ 2019లో పెరోల్ కోసం పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. ఒక మహిళ ఈ పెరోల్ పిటిషన్‌ను దాఖలు చేయగా.. కోర్టు ఈ పిటిషన్‌కు కొట్టేసింది. తాను రహీమ్‌కు పెంపుడు కుమార్తెనని పిటిషన్‌లో పేర్కొంది ఆ మహిళ. అయితే కుటుంబ సంబంధాలను కొనసాగించడం కోసం మాత్రమే దోషికి ఫర్‌‌లాఫ్ మంజూరు చేస్తారు. ఇక బంధువు వివాహం, ఇంట్లో అత్యవసర పరిస్థితి వంటి ప్రత్యేక కారణాల కోసం పెరోల్ మంజూరు చేస్తారు. పెరోల్‌ను ఎన్నిసార్లైనా ఇస్తారు. ఫర్లాకు మాత్రం పరిమితి ఉంటుంది.

Related Posts