హైదరాబాద్, ఫిబ్రవరి 10,
తెలంగాణలో పట్టు పెంచుకునేందుకు బీజేపీ చాలా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా పార్టీ కేంద్ర నాయకత్వం, తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. మరీ ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలిచిన తర్వాత పార్టీలో జోష్ పెరిగింది. తెలగాణ ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించిన అనేక మంది నాయకులు, కేసేఆర్ కుటుంబ పాలనకు బీజేపీ మాత్రమే చెక్ చెప్పగలదనే నమ్మకంతో కమల దళం వైపు చూస్తున్నారు. కషాయం కట్టేందుకు సిద్దమవుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస నాయకత్వం, బీజేపీనే తమ ప్రధాన ప్రత్యర్ధి అన్న విధంగా వ్యూహాన్ని మార్చుకుంది. కాంగ్రెస్ పై కంటే బీజేపీ పైనే దృష్టిని కేంద్రీకరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు తెరాస నాయకులు, బీజేపీపై బూతుల దండ యాత్ర చేస్తున్నారు. తెరాస నాయకత్వం కేంద్రంపై యద్ధాన్ని ప్రకటించింది. మరో వంక కేసీఆర్ వ్యుహానికి ధీటుగా బీజేపీ రాష్ట్ర నాయకులు తెరాసపై యుద్ధానికి సిద్దమవుతున్నారు. నిజానికి, హుజూరాబాద్ మొదలు ఇంతవకు కేసీఆర్’కు ఢిల్లీ నుంచి గల్లి వరకు ఎదురు దెబ్బలే తగులు తున్నాయి. వరి వివాదం విషయంలో అయితే నేమీ, రాజ్యంగం విషయంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వివాదంలో అయితే నేమి, చివరకు సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణకు, ప్రధాని వచ్చిన సందర్భంగా చెలరేగిన ప్రోటోకాల్ వివాదం విషయంలో అయినా కేసీఆర్ కథ అడ్డం తిరిగిందా అన్నట్లుగా అవమానాలు ఎదురయ్యాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రధాని నరేంద్ర మోడీ, పార్లమెంట్ ఉభయ సభల్లో, తెలంగాణ సెంటిమెంట్’ను ఎందుకు గిచ్చారు? అటు వారు, ఇటు వారు అందరూ ముగిసిన అధ్యాయంగా భావిస్తున్న, రాష్ట్ర విభజన అంశాన్ని ఎందుకు మళ్ళీ తెరమీదకు తెచ్చారు? ఏమి ఆశించి మోడీ రాజకీయ మంట రాజేశారు? రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసే క్రమంలో, ఎదో యాదృచ్చికంగా ఈ వ్యాఖ్యలు చేశారా? అంటే లేదు, అదేదో యాదృచ్చికంగా చేసిన వ్యాఖ్యే అయితే, తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర ప్రజల విశ్వాశాన్ని పొందలేక పోయిందని, లోక్ సభలో చేసిన వ్యాఖ్యతోనే సర్దుకోవలసింది. కానీ, రాజ్య సభలో మోడీ, కాంగ్రెస్ పార్టీని హర్ట్ చేయడమే లక్ష్యం అన్నట్లుగా మరింత పదునైన అస్త్రాన్ని ప్రయోగించారు. రాష్ట్ర విభజన జరిగిన తీరును, తెర మీదకు తెచ్చి వివాదం చేశారు. రాష్ట్ర విభజన అసమంజసంగా,అశాస్త్రీయంగా జరిగితే, అందుకు కాంగ్రెస్ పార్టీతో పాటుగా బీజేపీ కూడా బాధ్యత తీసుకోవలసి ఉంటుంది.అవ్వన్నీ ఎలా ఉన్నా మోడీ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల్లో కమలదళం పట్ల అనుమానాలు రేకెత్తించే అవకాశం మెండుగా వుంది. దీంతో సహజంగానే, రాష్ట్ర బీజేపీ నాయకులు ఇరకాటంలో పడ్డారు. మోడీ వ్యాఖ్యలను కాంగ్రెస్, తెరాస నాయకులు తూర్పార పడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్ ఒక్క సారిగా బీజేపీపై విరుచుకు పడుతున్నాయి. తెలంగాణ మంత్రులు, టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు మోడీ, బీజేపీ తెలంగాణ ద్రోహులు అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. మోడీ వ్యాఖ్యలను ఖండిస్తూ తెరాస, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చాయి. అయితే, ప్రధాని మోడీ తెలంగాణకు వ్యతిరేకంకాదని, రాష్ట్ర విభజన జరిగిన తీరును మాత్రమే ఆయన తప్పు తప్పు పట్టరాని బీజేపీ నాయకులు సంజాయిషీ ఇచ్చుకుంటున్నారు.ఆంధ్ర ప్రదేశ్ విభజన అంశంతో పాటు పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనుసరించిన తీరును ప్రధాని మోడీ విమర్శిస్తే తెరాసకు అభ్యంతరమెందుకని తెలంగాణ బీజేపే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటును మోడీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని చెప్పారు. అయితే, ప్రధాని మోడీ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసినా, ఆయన చేసిన వ్యాఖ్యలు, కేసీఆర్, తెరాసకు మోడీ కష్టకాలంలోఅక్కరకొచ్చే అస్త్రాన్ని అందించారని, బీజేపీ లోనే కొందరు నాయకులు అంటున్నారు.