మచిలీపట్నం
మచిలీపట్నంలో ఈనెల 7వ తేదీన జరిగిన నాగమల్లేశ్వరి హత్య పథకం ప్రకారమే జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. భార్య భర్తల మధ్య ఏర్పడిన విభేదాలే హత్యకు గల కారణoగా తేల్చి చెప్పారు. విలేఖరుల సమావేశంలో సీఐ అంకబాబు తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నం గాంధీనగర్కు చెందిన ధవళేశ్వరం సత్యనారాయణ, చిల్లర శ్రీనివాస్ రావులు స్నేహితులు. వడ్డీ వ్యాపారం లో స్నేహితులు ఇద్దరు భాగస్వాములు. స్నేహం అడ్డం పెట్టుకొని శ్రీనివాసరావు భార్య నాగమల్లేశ్వరి తో సత్యనారాయణ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. గత ఏడాది కరోనా కారణంగా శ్రీనివాస రావు మరణించాడు. శ్రీనివాస రావు మరణించడంతో నాగమల్లేశ్వరి పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. తాను పెళ్లి చేసుకుంటానని నాగమల్లేశ్వరి కుటుంబ పెద్దల తో మాట్లాడి ఆమెను తిరిగి మచిలీపట్నంకు తెచ్చుకున్నాడు. ఈడేపల్లి లోని ఓ అపార్ట్మెంట్ లో ఇద్దరూ కాపురం పెట్టారు. కొన్ని నెలలుగా ఇరువురి మధ్య కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. నాగమల్లేశ్వరని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న సత్యనారాయణ, ఈనెల ఏడో తేదీన అన్నంలో కొంగల మoదు కలిపి హత్య చేసేందుకు పూనుకున్నాడు. భోజనంలో కొంగల మoదు కలపడంతో పాటు మొహంపై పిడిగుద్దులు గుద్ధి గొంతు నులిమి హత్య చేసాడు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నాగమల్లేశ్వరి బంధువులకు ఫోన్ చేసి ఆమెకు ఫిట్స్ వచ్చాయంటూ చెప్పాడు. నాగమల్లేశ్వరి బంధువులు వచ్చే వరకు నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తిప్పుతూ హై డ్రామా ఆడాడు. నాగమల్లేశ్వరి మొహంపై గాయాలను చూసి హత్య జరిగినట్లు అనుమానించిన బంధువులు, పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలియజేసారు. విషయం తెలుసుకుని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బంధువుల నుంచి వివరాలు తీసుకుని కేసు నమోదు చేసారు. నాగమల్లేశ్వరి ని హత్య చేసిన సత్యనారాయణను గురువారం జడ్పీ సెంటర్ లో అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరాచారు.