విజయవాడ, ఫిబ్రవరి 10,
పరస్పర ప్రయోజనాలు. అటు ఏపీకి ఉండాలి.. ఇటు తెలుగు సినీ పరిశ్రమకూ ఉండాలి. జగన్‌తో మీటింగ్ తర్వాత సినీ పెద్దలు, మంత్రి వెల్లడించిన అభిప్రాయాలతో ఇదే సారాంశం కనిపిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమ బతకడానికి ప్రభుత్వం సహకరించాలి. ఆ సహకారం ఎన్ని రకాలుగా ఉండాలన్నదానిపై మొత్తం 17 రకాల అజెండాతో సినీ ప్రముఖులు వెళ్లారు. దానిపై చర్చలు జరిగాయి. ప్రభుత్వం నుంచీ సానుకూల సంకేతాలు వచ్చాయి. అలాగే ప్రభుత్వం కూడా సినీ ప్రముఖుల ముందు కొన్ని కోరికలు ఉంచింది. ఏపీలో సినిమా పరిశ్రమ పెట్టాలి. విశాఖ సహా అవకాశం ఉన్న చోట్ల ఏపీలో షూటింగ్‌లు ఎక్కువగా జరగాలి. అందుకు సినీ ప్రముఖులు కూడా సానుకూలంగా స్పందించారు.ప్రతీ థియేటర్‌లో ఉదయం 8 నుంచి మొదలై.. రోజంతా 5షోలకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇన్నాళ్లూ తెగకుండా, ముడిపడకుండా ఉన్న టికెట్ రేట్లపైనా ఓ సానుకూల చర్చే జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ 5రూపాయలు టికెట్ ఉన్న నాన్‌ఏసీ థియేటర్‌లో ఇకపై మినిమమ్ 30 రూపాయలు, అత్యధికంగా 70 రూపాయలు ఉండేలా కమిటీ రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక నగర పంచాయతీ అయినా, మున్సిపాలిటీ అయినా,కార్పొరేషన్ అయినా.. మినిమమ్ టికెట్ రేట్ 40, మ్యాగ్జిమమ్ 150 రూపాయల వరకూ ఆస్కారం ఉండబోతోంది. రాబోయే 2 వారాల్లో దీనికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి కూడా అధికారిక ఉత్తర్వులు వచ్చే చాన్స్ ఉంది.ఏపీలో సినీ పరిశ్రమ పెడితే ఎలాంటి ప్రోత్సహకాలు కావాలో సినీ ప్రముఖులు అడిగారు. సీఎం జగన్ వైపు నుంచి కూడా పరిశ్రమకు తగ్గ రాయితీలు, ప్రోత్సాహకాలు ఉంటాన్న సానుకూలత కనిపించింది.
నెలాఖరులోపు మంచి మాట
ఏపీలో సినిమా టికెట్ల వివాదానికి ఫుల్‌స్టాప్ పడే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్ని పరిస్థితులకు శుభం కార్డు వేసేందుకు టాలీవుడ్ ప్రముఖులు ముందడగు వేశారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖులు గురువారం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. చిరంజీవి, ప్రభాస్, మహేష్, రాజమౌళి, కొరటాల శివతో పాటు పలువురు ఈ సమావేశానికి హాజరయ్యారు.సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన చిరంజీవి.. సీఎం జగన్ నిర్ణయం ఎంతోషాన్ని ఇచ్చిందని చిరంజీవి అన్నారు. టికెట్ ధరలపై ఇక శుభం కార్డు పడినట్లు తాము భావిస్తున్నామని చెప్పారు. చిన్న సినిమాలకు కూడా ఐదో షోకు అనుమతివ్వడం మంచి పరిణామమని చిరు అన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ఇంకా మాట్లాడుతూ.. ‘సమస్యల పరిష్కారానికి సంబంధించి ఈనెలాఖరులోనే జీవో వస్తుందని భావిస్తున్నాము.మంత్రి పేర్ని నాని చొరవతో ఈ సమస్యలకు శుభంకార్డు పడింది. హైదరాబాద్ తరహాలో విశాఖలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు జగన్ అన్నారు. సీఎం నిర్ణయానికి తమవంతు సహకారం ఉంటుంది. మొత్తం మీద సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. సామరస్య పూర్వకంగా సమస్యలు పరిష్కరించుకుంటాము’ అని చిరు చెప్పుకొచ్చారు. టాలీవుడ్ ప్రముఖులంతా ఒక్కసారిగా రంగంలోకి దిగేసరికి ఇన్ని రోజుల వివాదానికి చెక్ పడినట్లు కనిపిస్తోంది.