జనసేనాని పవన్ కళ్యాణ్.. తన దూకుడు పెంచాడు. మరో ఏడాదిలోనే ఎన్నికలు ఉండడం ఎన్నికల నోటిఫికేషన్‌కు 10 నెలల గడువే ఉండడంతో ఆయన తన స్పీడ్‌ను పెంచుతున్నాడు. ఇప్పటి వరకు రాజకీయంగా మౌనంగా ఉన్న పవన్.. ఇప్పుడు మాత్రం తన వ్యూహాలను ఒక్కొక్క దానినీ అమలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే త్వరలోనే ఆయన బస్సు యాత్రను ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. పవన్ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోరాటం చేస్తారని అంటున్నారు.పవన్ తన బస్సు యాత్రతో.. పార్టీలోకి భారీ సంఖ్యలో చేరికలు ఉండేటట్లు కార్యచరణ సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలతో పవన్ ముఖాముఖి చర్చలు జరిపినట్టు సమాచారం. వీరం దరిని ప్రజా సంకల్ప బస్సు యాత్రలో ఆయా నియోజకవర్గాల్లోనే పార్టీలో చేర్చుకునేందుకు పవన్ అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు. మరోవైపు కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నేత జనసేనానితో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నందున ఆయా నియోజక వర్గాల్లో గెలిచే అవకాశాలున్న నేతలపై దృష్టి సారించినట్టు సమాచారం.ఏపీలోని మొత్తం 175 నియోజకవ ర్గాల్లోనూ జనసేన ఒంటరిగానే పోరాడుతుందని ఇటీవలే పవన్ వెల్లడించారు. ఈ క్రమంలోనే పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ అడుగులు వేయడం ప్రారంభించాడు.బస్సు యాత్ర ద్వారా ఆయన ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తారని అంటున్నారు జనసేన నాయకులు. అదేసమయంలో తన సామాజిక వర్గం కాపు నేతలకు కూడా ఆహ్వానం పలికే అవకాశం ఉందని తెలుస్తోం ది. అలాగే.. ఇప్పటి వరకు ఇతర పార్టీల నుంచి ఎవరినీ చేర్చుకోను అని భీష్మించిన పవన్.. ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీల్లోని కీలక నేతలను తన పార్టీలోకి ఆహ్వానించేందుకు రంగసిద్ధం చేస్తున్నాడు. కీలక నేతలు ఎక్కువగా రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు ఉండడంతో సీమపై పవన్ ప్రత్యేక దృష్టి సారించాడు. మరోవైపు అధికార, ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులు కూడా సీమ ప్రాంతానికి చెందిన వారు కావడంతో పార్టీని రాయలసీమ నుంచే బలోపేతం చేయడానికి జనసేనాని వ్యూహం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.ఇక పవన్ కూడా ఇప్పటికే తాను వచ్చే ఎన్నికల్లో సీమలోని అనంతపురం జిల్లా నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీమ జిల్లాలపై పవన్ కాన్‌సంట్రేషన్ ఎక్కువుగా ఉండనుందని తెలుస్తోంది. సీమ జిల్లాల తర్వాత పవన్ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ జిల్లాల మీద ప్రధానంగా టార్గెట్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టిపోటీ ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా సమాలోచనలు చేస్తున్నారని జనసేన వర్గాలు అంటున్నాయి. ఇక, గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీకి మద్దతు పలికిన నేతలను, మద్దతుగా నిలిచిన ప్రాంతాలను ఎంపిక చేసుకుని, వాటిలో జనసేనను బలోపేతం చేసుకునేందుకు కూడా పవన్ వ్యూహం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఒకరకంగా అధికార పార్టీని ఓడించడం, మెరుగైన స్థానాల్లో బలాన్ని చాటడం ద్వారా పవన్ వచ్చే ఎన్నికల్లో నిర్ణాయక శక్తిగా మారాలని భావిస్తున్నట్టు సమాచారం. మరి పవన్ వ్యూహం ఎంత మేరకు పనిచేస్తుందో చూడాలి.