న్యూఢిల్లీ ఫిబ్రవరి 10
మొబైల్ ఫోన్ ఛార్జీలు (టారి ఫ్‌లు) ఈ సంవత్సరం మరింత పెరగనున్నాయి. మూడు నాలుగు నెలల తర్వాత పెంపు తప్పదని భారతీ ఎయిర్‌టెల్ ఎండీ, సీఈఓ గోపాల్ విఠల్ చెప్పారు. అనలిస్టుల సమావేశంలో ఆయన ఈ విషయం స్పష్టం చేశా రు. అవసరమైతే ఈ విషయంలో తామే ముందుగా ఛార్జీలు పెంచేందుకు వెనకాడేది లేదన్నారు. గత ఏడాది నవంబరులోనూ ఎయిర్‌టెల్ మిగతా కంపెనీల కంటే ముందుగా టెలికం ఛార్జీలు 18 నుంచి 25 శాతం వరకు పెంచింది. ప్రస్తుతం ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ఆర్పూ) పరిశ్రమ అభివృద్ధికి ఏ మాత్రం చాలదని విఠల్ స్పష్టం చేశారు. పెట్టుబడులపై రాబడులు 15 శాతమైనా ఉండాలంటే ఇది కనీసం రూ.300 ఉండాలన్నారు. గత డిసెంబరు నాటికి ఎయిర్‌టెల్ ఆర్పూ రూ.163 మాత్రమే. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది పెరగకపోగా 2.2 తగ్గింది. ఛార్జీల పెంపు ద్వారా ఈ సంవత్సరం ఎయిర్‌టెల్ ఆర్పూని కనీసం రూ.200కు చేర్చాలన్నది తమ లక్ష్యమన్నారు.